Idream media
Idream media
హోరాహోరీగా సాగుతున్న గ్రేటర్ వార్‌లో మహిళలదే హవా సాగుతోంది. ప్రచారపర్వంలో తమదైన శైలిలో దూసుకెళ్లారు. గ్రేటర్ మేయర్ పీఠం ఈసారి జనరల్ మహిళకు రిజర్వ్ కావడంతో అన్ని పార్టీలు మహిళలకు అవకాశం కల్పించి పెద్ద ఎత్తున సీట్లు కేటాయించాయి. 150 డివిజన్లలో టీఆర్‌ఎస్ 85, బీజేపీ 74, కాంగ్రెస్ 75 మంది మహిళలను బరిలో నిలిపాయి. మేయర్ పీఠం దక్కించుకోవాలనే ఆశతో అన్ని పార్టీలు జనరల్ స్థానాల్లో ఎక్కువ మంది మహిళలకు అవకాశం కల్పించారు. ఏ పార్టీ గెలుస్తోందో.. ఏ మహిళకు గ్రేటర్ మేయర్ అవకాశం లభిస్తోందో అనే ఉత్కంఠ అందరిలో నెలకొంది.
ఉండమ్మా బొట్టు పెడతా..
గ్రేటర్‌లో బరిలో మొత్తం 234 మంది వరకు మహిళలు ఉన్నారు. కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, సికింద్రాబాద్, అంబర్‌పేట, ముషీరాబాద్, కార్వాన్, మల్కాజిగిరి నియోజకవర్గాల్లోని పలు డివిజన్ల నుంచి పోటీచేస్తున్న వివిధ పార్టీల మహిళా అభ్యర్థులు పురుషుల కంటే ఆసక్తికరంగా ప్రచారం కొనసాగించారు. ఇంటింటికి తిరిగి మహిళా ఓటర్లకు బొట్టు పెట్టి ఇంట్లో ఓట్లన్ని తమకే వేయాలని అభ్యర్థించారు. వెండి కుంకుమ భరిణెలు, చీరలు పంపిణీ చేసి మహిళా ఓటర్ల మెప్పు పొందారు. పలు ఇళ్లల్లోని పెద్దల కాళ్లు మొక్కి ఆశీర్వాదాలు తీసుకొన్నారు. 55 ఏళ్లకు పైబడిన ఓటర్లలో చాలామంది మహిళల ప్రచారానికి ఆకర్షితులయ్యారు. మరికొందరు అభ్యర్థులు ఓటర్ల పిల్లలకు స్నానం చేయించి, దుస్తులు వేసి వారి తల్లిదండ్రులను ఆకట్టుకున్నారు. వారం రోజులుగా ఇదే తరహాలో ఆయా డివిజన్లలో ప్రచారం నిర్వహించారు. వినూత్నంగా వ్యవహరిస్తూ అందరినీ ఆకట్టుకున్నారు. వీరిలో ఎంత వరకు విజయం సాధిస్తారో చూడాలి మరి.