iDreamPost
iDreamPost
ఆన్ లైన్ గేమ్స్ లో లక్షల రూపాయలు పోగొట్టుకుని.. దిక్కుతోచని స్థితిలో.. మనస్తాపంతో చాలామంది బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇటీవల కాలంలో ఇలాంటి ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. తాజాగా ఆన్ లైన్ రమ్మీకి అలవాటుపడిన ఓ వివాహిత.. తనవద్ద ఉన్న నగదుతో పాటు.. అప్పు తెచ్చిన నగదును కూడా పేకాటలో పెట్టి.. పోగొట్టి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది.
బి.భవాని (29), భర్త భక్కియరాజ్ (32) ఇద్దరు పిల్లలతో కలిసి చెన్నైలోని మనాలి న్యూ టౌన్ లో నివసిస్తోంది. బీఎస్సీ చదువుకుంది. పెళ్లై ఆరేళ్లయింది. భవాని ఓ ప్రైవేటు హెల్త్ కేర్ సంస్థలో పనిచేస్తుండగా.. భర్త తొరైపాక్కంలోని ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. లాక్ డౌన్ సమయంలో భవాని ఆన్ లైన్ రమ్మీకి బానిసైంది. అది గమనించిన భర్త, తల్లిదండ్రులు పేకాట ఆడొద్దని ఎంత వారించినా, హెచ్చరించినా భవానీలో మార్పు రాలేదు.
ఆన్ లైన్ రమ్మీలో ఎప్పటికైనా భారీ మొత్తంలో డబ్బు రాకపోతుందా అన్న గుడ్డి నమ్మకంతో ఉన్న డబ్బంతా అందులోనే పెట్టింది. అది చాలదన్నట్టు బంగారు నగలు తాకట్టుపెట్టి మరీ రూ.10.5 లక్షలతో మళ్లీ ఆడింది. ఆ డబ్బు కూడా పోయింది. తర్వాత తన నగలు విడిపించుకోవాలని చెప్పి.. అక్కచెల్లెళ్ల నుంచి కొంత నగదు అప్పు తీసుకుంది. నగలు విడిపించకుండా ఆ డబ్బు కూడా పేకాటలో పెట్టేసింది. అవి కూడా పోవడంతో.. తీవ్ర మనోవేదనకు గురైన భవాని ఆదివారం (జూన్ 5 ) సాయంత్రం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలిసిన పోలీసులు భవానీ మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం స్టాన్లీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.