sai
sai
మనకు తారసపడిన వ్యక్తులు బయటకు నవ్వుతూ, తుళ్లుతూ కనిపిస్తుంటే.. వారికేమీ బాధలు లేవేమో అన్న సందేహం కలగకమానదు. కానీ ఎవరికి ఉంటే కష్టాలు, కన్నీళ్లు వాళ్లకు ఉంటాయి. కొంత మంది వాటిని ధైర్యంగా, స్థైర్యంగా ఎదుర్కొంటుంటారు. మరికొంత మంది చతికిల పడిపోతుంటారు. మనిషిని నడిపించేంది రూపాయి కాబట్టే.. ఆర్ధిక సమస్యలు వెంటాడుతుంటే.. అప్పో, సొప్పో చేసి తీర్చుకోగల్గుతాం. కానీ శారీరకమైన బాధలను ఎవ్వరితోనూ పంచుకోలేం. వాటిని మనమే భరించాల్సి ఉంటుంది. భరించలేని వేదన అనుభవిస్తుంటే.. బతకాలన్న ఆశ కచ్చితంగా ఉండదు. అయితే ఎంతటి శారీరక సమస్యలకైనా బలవన్మరణం అనేది శాశ్వత పరిష్కారం కానేకాదు. ఇదే ఓ మహిళ విషయంలో జరిగింది. తెలుగు నేలపై పుట్టి, పెరిగి, మెట్టినిండ అడుగుపెట్టిన ఆ మహిళ.. పరాయి గడ్డపై తనను తాను బలితీసుకుంది.
కేవలం అనారోగ్య సమస్యలతో 40 ఏళ్లు కూడా నిండని ఓ మహిళ అమెరికాలో ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నల్గొండ జిల్లా నార్కట్ పల్లి మండల పరిధిలోని అమ్మనబోలుకు చెందిన ఏనుగు మల్లారెడ్డి, అనసూర్య దంపతులు..హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డారు. ఎల్బీనగర్‌లోని సూర్యోదయ కాలనీలో నివాసముంటున్నారు. వీరి కుమారుడు శ్రీనివాస్ రెడ్డికి కవిత అనే మహిళతో 18 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే కుమారుడు అమెరికాలో సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా అవకాశం రావడంతో..కుటుంబంతో అక్కడకు వెళ్లిపోయారు. మిస్సోరీలో స్థిరపడ్డారు. అయితే కవితకు కొన్ని రోజుల నుండి అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. ఆసుపత్రులు చుట్టూ తిరిగినా ఉపశమనం కలగకపోవడంతో తీవ్ర నిర్ణయం తీసుకుంది. ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో ఆ కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది.