చూడ్డానికి వెళ్తే షాక్ కొడుతుంది
చూడ్డానికి వెళ్తే షాక్ కొడుతుంది
వి రాజా
మంచి కాన్సెప్ట్ అనుకుంటే సరిపోదు. ఎవరైనా అనుకుంటారు. కానీ దాని చుట్టూ ఓ సరైన కథ, ఆ కథకు సరిపడా సన్నివేశాలు అల్లుకోవాలి. ఆ సన్నివేశాల్లో నటీనటుల నటర పండాలి. డైలాగులు బలంగా వుండాలి. ఇలా ఒకటి కాదు రెండు కాదు సినిమా అంటే. చాలా అంటే చాలా వుంది. ఇవన్నీ పండితేనే సినిమా. ఈవారం విడుదలైన ఓ సుకుమారి సినిమాకు కాన్సెప్ట్ అనేది మాత్రమే వుంది. అంతకు మించి మరేం లేదు. దాని చుట్టూ రాసుకున్న కథలో క్లారిటీ లేదు. రాసుకున్న సీన్లలో బలం లేదు. టోటల్ గా తెరకెక్కించిన సినిమా ఆసక్తికరంగా లేదు. అదే సమస్య.
ఓ సుకుమారి కాన్సెప్ట్ ఏమిటంటే ఓ అమ్మాయి ఎవర్ని ముట్టుకుంటే వారికి బలంగా షాక్ కొడుతుంది. ఆ మెడికల్ మిరాకిల్ ఏమిటంటే బలమైన రీజన్ లేదు. ఏదో ఫాంటసీ రీజన్ తప్ప. నిజానికి ఇది మంచి కాన్సెప్ట్. నవ్వులు పుట్టించవచ్చు. యాక్షన్ సీన్లు చేసుకోవచ్చు. భర్తతో కాపురం చేయలేని, ఎవరినీ టచ్ చేయలేని బాధ నుంచి బోలెడు ఎమోషన్ పుట్టించవచ్చు. ఇలాంటి సమస్యను దర్ళకుడు ఎలా క్లోజ్ చేస్తాడా అనే ఉత్కంఠను రేకెత్తించవచ్చు. కానీ ఇవేమీ జరగలేదు అదే సమస్య ఓ సుకుమారి సినిమాతో.
రెండు కుటుంబాలు. ఓ కుటుంబంలో అమ్మాయికి ఎవరినైనా ముట్టుకుంటే షాక్ కొట్టే సమస్య. మరో కుటుంబంలో ఇద్దరు అన్నదమ్ముల మధ్య కలతలు. ఆ చిన్న ఇంటికి ఓ స్వంత రాజకీయ పార్టీ. సర్పంచ్ పదవి కోసం కొట్లాట..ఆ ఇంట్లోనే సమస్య సమస్యలు, ఎమోషన్లు. ఆ ఇంటికి కోడలిగా వస్తుందీ అమ్మాయి. షాక్ సమస్య తెలియకుండానే పెళ్లి చేసుకుంటాడు ఆ ఇంటి కుర్రాడు. అప్పుడేం జరిగింది అన్నది మిగిలిన సినిమా.
సినిమా ఎత్తుగడ భలే ఆసక్తికరంగా వుంటుంది. ఆ వెంటనే షార్ట్ ఫిలిం కన్నా తక్కువ రేంజ్ కు జారిపోతుంది. బలగం మాదిరిగా రూటెడ్ సినిమాగా తీయాలని ప్రయత్నంలో చిన్న, తక్కువ ఎక్స్ పీరియన్స్ వున్న నటులను తీసుకున్నారు. మంచిదే. కానీ వాళ్ల నుంచి సరైన నటన తీసుకోవాలి అంటే దర్శకుడికి స్టామినా వుండాలి. కానీ అది కనిపించలేదు. అందువల్ల కొత్త, చిన్న వారి నటనలే కాదు, హీరో తిరువీర్, హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ వంటి వారి నటనలు కూడా తేలిపోయాయి. ఎప్పుడైతే నటనలు తేలిపోయాయో, సన్నివేశాలు పండలేదు.
ఓ సీన్ చూద్దాం. ఫొటోలోకి ఎక్కేసిన పెళ్లాంతో అంటాడు ఓ పెద్ద మనిషి..నేను ఇప్పట్లో నీ దగ్గరకు రాను అని. కానీ అంతలోనే నల్లి బొక్క ను నోట్లో పెట్టుకుని పీలుస్తూ ఫొటో ఎక్కేస్తాడు. ఎంత ఫన్ పుట్టించవచ్చు ఈ సీన్ లో. కానీ అదేం వుండదు. ఇలా చాలా సీన్లు ఎగ్జిక్యూషన్ లో వృధా అయిపోయాయి. అసలు హీరోయిన్ పాత్ర క్లారిటీ వుండదు. విషయం దాచాలని చూస్తారు. దాచకూడదని చూస్తారు. ఇలా రకరకాలుగా వుంటుంది వ్యవహారం. హీరో సంగతి కూడా అలాంటిదే. అమ్మ, నాన్న మాట ఎందుకు వినడో తెలియదు. హీరోయిన్ అంటే భయపడతాడు. అంతలోనే దగ్గరగా వుంటాడు. ఇలా రకరకాలుగా వుంటుంది స్క్రిప్ట్. మధ్యలో ఫైట్ సీన్లు పెట్టడం కోసం రాజకీయాలు జోడించారు.
టోటల్ గా సినిమాకు సమస్య ఒకటే. దర్శకుడి కి అనుభవం తక్కువ కావడం. ఆయనకే కనుక సత్తా వుంటే నటనలు ఇలా వుండవు. సన్నివేశాలు ఇలా రాసుకోరు. టోటల్ గా సినిమా ఇలా వుండదు. కేవలం కాన్సెప్ట్ బాగుందని ముందుకు వెళ్లిపోయారంతే. సంక్రాంతికి వస్తున్నాంతో మిడిల్ క్లాస్ గృహిణిగా అలరించిన, అందంగా కనిపించిన ఐశ్వర్య రాజేష్ ఈ సినిమాలో అస్సలు బాలేరు అంటే కారణం ఆమె కాదు, దర్శకుడే. ఎందుకంటే అవన్నీ చూసుకోవాల్సింది ఆయనే కదా.
అంతే కాదు, ఇంతో అంతో ఫొటొగ్రఫీ బాగుంది తప్ప, మరే క్రాఫ్ట్ బాలేదు. నేపథ్య సంగీతం తీర్ధానికి తీర్థం, ప్రసాదానికి ప్రసాదం అన్నట్లు సాగింది. రకరకాల శబ్దాలు సన్నివేశాలను మరింత కనెక్ట్ కాకుండా యధాశక్తి అడ్డం పడ్డాయి. తనకు ఎలాంటి నేపథ్య సంగీతం కావాలి అన్నది దర్శకుడు చూసుకోవాలి కదా? మొత్తం మీద ఓ మంచి కాన్సెప్ట్ వృధా అయిపోయిందిలా.