Idream media
Idream media
కరోనా ముగిసింది. థియేటర్లు తెరిచారు. సినిమాలకి మళ్లీ మంచి కాలమని ఆశ పడ్డారు. కథ మళ్లీ మొదటికొచ్చింది. తెలంగాణలో వకీల్‌సాబ్ ఆడుతున్నవి తప్ప అన్నీ మూసేసినట్టే. అవి కూడా ఎంతో కాలం నడవవు. ఆంధ్రాలో తెరిచే వున్నా భయంతో జనం వెళ్లడం లేదు. ఒక రకంగా అవీ నష్టాల్లోకి వెళ్లినట్టే.
రెండు రాష్ట్రాల్లో కలిపి కొన్ని వేల థియేటర్లున్నాయి. ఒక థియేటర్ అంటే ప్రత్యక్షంగా, పరోక్షంగా కొన్ని వందల మందిని సాకుతుంది. ఏ లెక్క చూసినా కనీసం 20 మంది సిబ్బంది, క్యాంటిన్ మీద, పార్కింగ్ మీద బతికేవాళ్లు పదిమంది, అంతటితో ఆగదు. రోజూ కొన్ని వందల మంది సంచరించే ప్రాంతమది. జనాల్ని నమ్ముకుని బయట రకరకాల దుకాణాలుంటాయి. వచ్చే ప్రేక్షకుల్ని చేరవేస్తూ ఆటో వాళ్లు జీవిస్తారు. జనం కదిలితేనే బతుకు చక్రం.
థియేటర్లు పచ్చగా వుంటే సినీ పరిశ్రమ బావుంటుంది. దీన్ని నమ్ముకుని వేల మంది వుంటారు. షూటింగ్‌లు ఆగిపోతే ఆకలికి మాడిపోతారు. వాళ్లకి ఈ పని తప్ప ఇంకోటి రాదు. మేకప్ మ్యాన్‌ని కూలి చేయమంటే చేయలేడు, చేతకాదు. OTTల్లో వచ్చే సినిమాలతో ప్రయోజనముండదు. పాతిక చిన్న సినిమాలు కలిస్తే కూడా ఒక పెద్ద సినిమాకి సమానం కావు.
ఈ బడుగు జీవుల్ని కరోనా రెండు రకాలుగా చావగొట్టింది. ఉపాధి పోగొట్టింది. ధరలు పెంచేసింది. గతంలో 5 వేలతో ఇల్లు గడిస్తే ఇపుడు అది 7 వేలయింది.
పరిశ్రమ సంగతి పక్కన పెడితే థియేటర్ల నిర్వహణ భరించలేకుండా వుంది. వూళ్లలో అనేకం మూతపడ్డాయి. కొన్ని షాపింగ్ కాంప్లెక్స్‌లు, కళ్యాణ మండపాలుగా మారిపోయాయి. కొన్ని నగరాల్లో మాత్రం మల్టిఫ్లెక్స్‌లయ్యాయి. సంవత్సరం క్రితం ఒక ఆశ ఉండింది. చెడ్డ రోజులు పోయి పూర్తిగా మంచి రోజులు వస్తాయని. మంచి రోజులు వచ్చినట్టే వచ్చిపోయాయి. సెకెండ్ వేవ్ భయానకంగా ఉంది. పొట్టకూటి కోసం జనం బయటికి వస్తారే కానీ, వినోదం కోసం రాలేని స్థితి. వంద థియేటర్లు రెండు రాష్ట్రాల్లో శాశ్వతంగా మూతపడతాయని అంచనా!
గతంలో కూడా సినిమా రంగం సమస్యల్ని ఎదుర్కుంది. కానీ, ఇంత ఎక్కువ కాలం కాదు. ఉద్యమాల కాలంలో కొన్ని నెలలు ఇబ్బందులు పడింది. మళ్లీ వెంటనే కోలుకుంది. అనిశ్చితి ఎప్పటి వరకో అంతుబట్టడం లేదు.
కరోనాకి కరోనాకి మధ్య బ్రేక్‌లో క్రాక్, జాతిరత్నాలు సేఫ్‌గా బయటపడ్డాయి. మిగిలినవన్నీ అంతంత మాత్రమే. ఈ సమ్మర్ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అన్నీ ఎండిపోయాయి.