iDreamPost
android-app
ios-app

Hridayam : హృదయం రీమేక్ ఎవరి చేతికి వెళ్తుంది

  • Published Feb 02, 2022 | 6:06 AM Updated Updated Feb 02, 2022 | 6:06 AM
Hridayam : హృదయం రీమేక్ ఎవరి చేతికి వెళ్తుంది

ఇటీవలే మళయాలంలో విడుదలైన హృదయం సంచలనం సృష్టిస్తోంది. హైదరాబాద్ లాంటి తెలుగు నగరాల్లోనూ హౌస్ ఫుల్స్ పడుతున్నాయి. బాష అర్థం కాకపోయినా సరే ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో చూసి మరీ మూవీ లవర్స్ ఎంజాయ్ చేస్తున్నారు. అలా అని ఇదేదో కమర్షియల్ మాస్ సినిమా కాదు. ఒక అందమైన యువత కథ. అన్ని ఎమోషన్స్ ఉంటాయి. ప్రేమ, పెళ్లి, సుఖం దుఃఖం, కాలేజీ, చదువు, స్కూలు ప్రతి ఒక్క అంశాన్ని చాలా సున్నితంగా చూపించిన తీరు బాగా ఆకట్టుకుంటోంది. ఒరిజినల్ వెర్షన్ మొదటివారానికే పాతిక కోట్ల గ్రాస్ ని వసూలు చేయడం ఇటీవలి కాలంలో కురుప్ తర్వాత దీనికే సాధ్యమయ్యింది. అంతగా ఆడుతోంది మరి.

మరి ఇంత బ్లాక్ బస్టర్ అయిన సినిమాకు రీమేక్ హక్కుల కోసం డిమాండ్ ఏర్పడటం సహజం. అయితే ఇంకా ఇప్పటిదాకా మన నిర్మాతలెవరూ దీని కోసం ఎగబడటం లేదని టాక్. కారణం ఉంది. ఇదే తరహాలో తమిళంలో పిచ్చగా ఆడిన 96ని దిల్ రాజు ఏరికోరి మరీ అదే దర్శకుడితో రీమేక్ (జాను) చేస్తే ఇక్కడ ఎంత దారుణ ఫలితం వచ్చిందో చూశాం. శర్వానంద్ సమంతాల కాంబో సైతం కాపాడలేకపోయింది. అప్పుడెప్పుడో ఇదే తరహాలో ఓ మెచ్యూర్డ్ తమిళ్ హిట్ మూవీని రవితేజ నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్ పేరుతో తీసుకుంటే పేరైతే వచ్చింది కానీ డబ్బులు సోసోగానే మిగిలాయి. అంతకుమించేమీ జరగలేదు.

నాగ చైతన్య ప్రేమమ్ హిట్టే కానీ మలయాళంలో ఇది ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసింది. కానీ ఇక్కడ ఆ స్థాయికి చేరుకోలేదు. దీన్ని బట్టి అర్థమవుతోంది ఏంటంటే ఫీల్ గుడ్ మూవీస్ అన్నీ గుడ్డిగా రీమేక్ చేసుకుంటే అదే రిజల్ట్ రిపీట్ అవుతుందన్న గ్యారెంటీ లేదు. అందుకే హృదయం విషయంలో మనవాళ్ళు ఎవరూ తొందపడటం లేదు కాబోలు. ఫైనల్ రన్ అయ్యేలోపు ఎవరో ఒకరు తీసుకుంటారు కానీ ప్రస్తుతానికి మాత్రం సైలెంట్ గానే ఉన్నారు. వాస్తవానికి ఇలాంటివి డబ్బింగ్ చేయడం బెటర్. ఆ ఒరిజినల్ ఫీల్ ని క్యారీ చేస్తూ జనాన్ని మెప్పించవచ్చు. రీమేక్ కోసం చేసే వ్యయప్రయాసలన్నీ తప్పుతాయి. డిజిటల్ గానూ వర్కౌట్ అవుతుంది

Also Read : Radhe Shyam : ప్రభాస్ సినిమాకు స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి