Idream media
Idream media
ధర్మపురి శ్రీనివాస్ తెలంగాణలో అతిపెద్ద సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నాయకుడు. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలం కొనసాగారు. 1989లో కాంగ్రెస్ తరపున నిజామాబాదు (పట్టణ) శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి డి.సత్యనారాయణ పై గెలుపొంది తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. మంత్రి పదవి కూడా పొందారు. 1998లో తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. 1999లో బీజేపీ అభ్యర్థి యెండెల లక్ష్మీనారాయణ ను ఓడించి రెండోసారి ఎమ్మెల్యే అయ్యారు. అదే సమయంలో కాంగ్రెస్ శాసనసభ ఉప నాయకుడిగా పని చేశారు. 2004లో రెండోసారి పీసీసీ అధ్యక్ష పదవి పొందారు.
2004లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సతీష్ పవార్ ను ఓడించి మూడవసారి శాసనసభకు ఎన్నికై వై.యస్. రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో పని చేశారు. 2009 ఎన్నికలలో మాత్రం గతంలో తాను ఓడించిన యెండెల లక్ష్మీనారాయణ చేతిలోనే పరాజయం పొందారు. 2010లో జరిగిన ఉప ఎన్నికలోనూ డి.శ్రీనివాస్ మరోసారి లక్ష్మీనారాయణ చేతిలో ఓడిపోయారు. 2014లో నిజామాబాదు (గ్రామీణ) శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి టీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ చేతిలో ఓడిపోయారు. 2004, 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన డీఎస్ 2015, జూలై 2న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఉద్యమ పార్టీగా అవతరించిన టీఆర్ఎస్ లో చేరారు. ప్రస్తుతం అదే పార్టీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు.
ఇటీవల కొంత కాలంగా ఆయన టీఆర్ఎస్ కు దూరంగా ఉంటున్నారు. తన కుమారుడి వ్యవహారంలో పార్టీ అండగా నిలవకపోవడం, తనకు సరైన ప్రాధాన్యం ఇవ్వకపోవడం వంటి కారణాలతో పార్టీతో అంటీముట్టనట్టు ఉన్న డీఎస్ జీహెచ్ ఎంసీ ఎన్నికలకు ముందు పార్టీపైనే విమర్శలు చేశారు. టీఆర్ ఎస్ అధిష్ఠానాన్ని టార్గెట్ చేస్తూ ఆయన చేసిన కామెంట్స్ గులాబీ పార్టీలో కాక రూపాయి. అప్పటికే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రజా ప్రతినిధులు డీఎస్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని తీర్మానం చేస్తూ సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు. తప్పు చేస్తే చర్య తీసుకోవాలని చెప్పిన డి.ఎస్. అప్పటి నుంచి పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు.
పార్లమెంట్ ఎన్నికల్లో కూడా టీఆర్ ఎస్ కు కాకుండా బీజేపీ తరపున పోటీ చేసిన తన తనయుడు అర్వింద్ గెలుపు కోసం ఇంటర్నల్ గా పని చేశారు. దీంతో రాజ్యసభ పదవి కి రాజీనామా చేయాలని ఆ పార్టీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఆ విమర్శలపై డిఎస్ సైతం గట్టిగా రివర్స్ కౌంటర్ ఇచ్చారు.దమ్ముంటే తనపై చర్యలు తీసుకోవాలని సవాలు కూడా విసిరారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఆయనపై చర్యలు తీసుకుంటే బలమైన సామాజిక వర్గం ఓటర్లు టీఆర్ ఎస్ కు దూరం అవుతారని భావించి పార్టీ కూడా వ్యూహాత్మకంగా వ్యవహరించి మౌనం వహించింది. ఇప్పుడు జీహెచ్ ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా డీఎస్ పేరు మరోసారి తెరపైకి వచ్చింది.
టీఆర్ఎస్ తరపున రాజ్యసభ సభ్యులుగా ఉన్న కె. కేశవరావు, డి. శ్రీనివాస్ రావు కూడా గ్రేటర్ లో ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో ఎవరికీ స్పష్టమైన మెజారిటీ లేకపోవడంతో ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో ప్రతీ ఓటు అధికార పార్టీకి ముఖ్యమే. డీఎస్ అధికార పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన టీఆర్ ఎస్ మేయర్ అభ్యర్థికి మద్దతు ఇస్తారా.. లేదా..?, అసలు ఆరోజు సమావేశానికి వస్తారా.. అనే చర్చ జరుగుతోంది. టీఆర్ఎస్ కు గ్రేటర్ లో ఎమ్మెల్యేలు, ఎంపీలు కలిపి 33 మంది ఎక్స్ అఫీషియో సభ్యులు ఉన్నప్పటికీ డీఎస్ ఓటు హాట్ టాపిక్ గా మారింది. ఒకవేళ ఆయన ఓటు వేస్తే టీఆర్ఎస్ లోనే కొనసాగాలనే ఉద్దేశం ఉన్నట్లే. లేకపోతే పార్టీ ఆయనపై ఈసారి చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అదే జరిగితే ఇప్పటికే టీఆర్ఎస్ కు దూరంగా ఉంటున్న ఆయనను బీజేపీ తన గూటికి చేర్చుకునేందుకు సిద్ధంగా ఉంది. మరి ఏం జరగనుందో గ్రేటర్ మేయర్ ఎన్నిక అనంతరం తేలనుంది.