iDreamPost
android-app
ios-app

ఓటిటి దారిలో నాగార్జున వైల్డ్ డాగ్ ?

  • Published Nov 26, 2020 | 9:38 AM Updated Updated Nov 26, 2020 | 9:38 AM
ఓటిటి దారిలో నాగార్జున వైల్డ్ డాగ్ ?

ఇప్పటిదాకా ఓటిటిలో డైరెక్ట్ రిలీజైన సౌత్ స్టార్ హీరోల సినిమాలు రెండు. సూర్య ఆకాశం నీ హద్దురా, నాని విలు తప్ప మిగిలినవన్నీ కూడా మీడియం రేంజ్ చిత్రాలే. అందులోనూ అద్భుతం అనిపించుకున్నవి ఏవీ లేవు. బాగుంది లేదా తేడా కొట్టింది అనే మాటలు మినహాయించి బెస్ట్ బ్లాక్ బస్టర్ టాక్ దేనికీ రాలేదు. తెలుగులో సీనియర్లు ఇప్పటికీ థియేట్రికల్ రిలీజ్ అయితేనే బాగుంటుందనే బలమైన అభిప్రాయంలో ఉన్నారు. దీనికి చెక్ పెడుతూ నాగార్జున కొత్త మూవీ వైల్డ్ డాగ్ డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ ఉండొచ్చనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. నెట్ ఫ్లిక్స్ ద్వారా ఇప్పటికే ఒప్పందం కూడా జరిగిందని అంటున్నారు.

అధికారికంగా చెప్పలేదు కానీ డీల్ జరిగిన మాట వాస్తవమేనని సమాచారం. అయితే ఇక్కడో ట్విస్టు ఉంది. ఓటిటితో పాటు సమాంతరంగా థియేట్రికల్ రిలీజ్ కూడా ఉండేలా ప్లాన్ చేయమని నాగ్ సూచించినట్టు వినికిడి. అందరూ నెట్ ఫ్లిక్స్ చందాదారులు ఉండరు, అభిమానులు ప్రత్యేకంగా పెద్దతెర మీదే తమ హీరోను చూడాలనుకుంటారు కాబట్టి రెండు రకాలుగా వర్క్ అవుట్ చేసుకోవచ్చనే ఆలోచనగా కనిపిస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే కొత్త ట్రెండ్ కి దారి చూపించినట్టు అవుతుంది. అందరికంటే ముందుగా ధైర్యంగా షూటింగు మొదలుపెట్టి దారి చూపించిన నాగ్ ఇందులో కూడా ముందడుగు వేస్తున్నట్టు కనిపిస్తోంది.

టెర్రరిజం బ్యాక్ డ్రాప్ లో రూపొందిన వైల్డ్ డాగ్ లో నాగార్జున ఎన్ఐఏ ఆఫీసర్ గా నటిస్తున్నారు. బిగ్ బాస్ 3లో పాల్గొన్న అలీరెజాతో పాటు సయామీ ఖేర్ కీలక పాత్రలు చేస్తున్నారు. ఇందులో పాటలు, కమర్షియల్ ఎలిమెంట్స్ లాంటివి పెద్దగా ఉండవు. సీరియస్ గా సాగే యాక్షన్ డ్రామా ఇది. అహిషోర్ సాల్మోన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఎలాగూ ఇంకో రెండు నెలలు 50 శాతం ఆక్యుపెన్సీతోనే థియేటర్లు నడిపించాల్సి వచ్చేలా ఉంది. దానికి తోడు సంక్రాంతికి చాలా విపరీతమైన పోటీ నెలకొంది. వాటి మధ్య వైల్డ్ డాగ్ అంత ఈజీగా నెగ్గుకురాలేదు. అందుకే ఒకవేళ ఈ నిర్ణయం నిజంగా తీసుకుని ఉంటే మంచిదే