iDreamPost
android-app
ios-app

టీడీపీ, జనసేనల్లో హోదా అలజడి

  • Published Jul 21, 2021 | 10:23 AM Updated Updated Jul 21, 2021 | 10:23 AM
టీడీపీ, జనసేనల్లో హోదా అలజడి

ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టుకు నిధులు, విశాఖ ఉక్కు పరిరక్షణపై పార్లమెంట్ వేదికగా వైఎస్సార్సీపీ చేస్తున్న పోరాటం ప్రతిపక్ష టీడీపీ తోపాటు బీజేపీ మిత్రపక్షమైన జనసేన పార్టీల్లో అలజడి రేపుతోంది. ఈ సమస్యలపై ఆ రెండు పార్టీలు ఇన్నాళ్లు గోడ మీద పిల్లి వాటం ప్రదర్శిస్తూ వస్తున్నాయి. ప్రశ్నించి నిలదీయాల్సిన కేంద్రాన్ని వదిలి రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ కాలం గడిపేస్తున్నాయి. పైగా మోదీ ప్రభుత్వంతో వైఎస్సార్సీపీ మిలాఖత్ అయ్యి రాష్ట్ర సమస్యలపై నిలదీయడం లేదని ఆరోపణలు చేస్తున్నాయే తప్ప.. ప్రధాన పార్టీలుగా తమ బాధ్యతను గాలికి వదిలేశాయి.

ఈ నేపథ్యంలో సోమవారం ప్రారంభమైన పార్లమెంటు సమావేశాల్లో రాష్ట్రానికి అత్యవసరమైన ఈ మూడు అంశాలపై వైఎస్సార్సీపీ నినదించింది. ప్రత్యేక హోదాపై మొదటి నుంచి అనుసరిస్తున్న వైఖరికి కట్టుబడి కేంద్రాన్ని గట్టిగా నిలదీసింది. తొలి రెండు రోజుల సమావేశాల్లో అటు రాజ్యసభ, ఇటు లోకసభలో వైఎస్సార్సీపీ ఎంపీలు వాయిదా తీర్మానాలు, రూల్ 267 తదితర రూపాల్లో చర్చకు డిమాండ్ చేస్తూ.. ఆందోళనలు చేపట్టి సభా కార్యక్రమాలను స్తంభింపజేశారు. టీడీపీ, జనసేనల ఊహకు అందని రీతిలో కేంద్రంపై యుద్ధం ప్రకటించడంతో సభలోనే ఉన్న టీడీపీ సభ్యులు అవాక్కయ్యారు. రాష్ట్ర సమస్యలపై పోరాడుతున్న వైఎస్సార్సీపీ సభ్యులకు మద్దతు ఇవ్వాలన్న ఆలోచన కూడా చేయలేకపోయారు. రాష్ట్ర విభజన అంశాలపై వైఎస్సార్సీపీ వ్యూహం మార్చి పోరాట పంథా అందుకోవడంతో టీడీపీ నోట్లో పచ్చి వెలక్కాయ పడినట్లు అయ్యింది. జనసేనదీ అదే పరిస్థితి. వ్యూహం మార్చి స్పీడ్ పెంచడం ద్వారా వైఎస్సార్సీపీ ఆ రెండు పార్టీలను ఇరకాటంలోకి నెట్టింది. తప్పనిసరిగా స్పందించాల్సిన అనివార్యత కల్పించింది.

Also Read : ఓటుకు నోటు కేసు.. చంద్రబాబును బుక్ చేసిన రేవంత్ రెడ్డి..!

విభజన హామీల ఊసెత్తని ప్రధాన ప్రతిపక్షం

రాష్ట్రానికి చెందిన సమస్యలపై స్పందించి పోరాడాల్సిన బాధ్యత అధికార పక్షంతో పాటు ప్రతిపక్షానికీ ఉంటుంది. కానీ టీడీపీ ఆ బాధ్యతను విస్మరిస్తోంది. బీజేపీతో అంటకాగి అధికారంలో ఉన్నప్పుడే హోదా హామీకి నీళ్లొదిలేసిన చంద్రబాబు ప్యాకేజీ పేరుతో ప్రజలను మాయ చేయాలని చూశారు. అయితే అప్పట్లో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న వైఎస్ జగన్ ప్రత్యేక హోదాను నినాదంగా మలచుకొని..ఎన్నికల అజెండాగా మార్చడంతో చంద్రబాబు తప్పనిసరి పరిస్థితుల్లో హోదా ఇవ్వనంటున్న బీజేపీతో ఎన్నికల ముందు తెగతెంపులు చేసుకున్నారు. అయినా ప్రజలు ఆయన్ను నమ్మలేదు. ఓడిపోయి ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాతైనా చంద్రబాబు ఎన్డీయే సర్కారును నిలదీయడానికి జంకుతున్నారు. పోలవరం, విశాఖ ఉక్కు అంశాల్లోనూ కేంద్రాన్ని గట్టిగా ఒక్క మాటైనా అనలేకపోతున్నారు. వచ్చే ఎన్నికల నాటికి మళ్లీ బీజేపీతో చెలిమికి ఆరాటపడుతున్న ఆయన.. తన రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారు. ఈ పరిస్థితుల్లో హోదా, పోలవరం, ఉక్కు సమస్యలపై పోరాట పంథాలోకి వెళ్లడం చంద్రబాబుకు, టీడీపీకి మింగుడుపడటం లేదు. అధికారపక్షమే పోరాడుతుంటే ప్రధాన ప్రతిపక్షం మౌనం వహిస్తే ప్రజల్లోకి వ్యతిరేక సంకేతాలు వెళ్తాయి. పరపతి మరింత దిగజారుతుంది. అలాగని కేంద్రానికి వ్యతిరేకంగా గళం విప్పితే బీజేపీతో చెలిమికి మార్గాలు మూసుకుపోతాయి. దాంతో ఏం చేయాలో అర్థంకాని స్థితిలో టీడీపీ కొట్టుమిట్టాడుతోంది.

ప్రశ్నించడమే మర్చిపోయిన జనసేన

పాచిపోయిన లడ్డూలు ఆంధ్ర ప్రజల చేతిలో పెట్టారని గతంలో మోదీ ప్రభుత్వంపై అంతెత్తున ఎగిరిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ఎన్నికల తర్వాత అదే బీజేపీతో జత కట్టి కుక్కిన పెనులా మారిపోయారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్ప కేంద్ర స్థాయిలో హోదా వంటి కీలక పెండింగ్ సమస్యలపై ప్రశ్నించడమే మర్చిపోయారు. ఢిల్లీ పెద్దలతో పరిచయాలు, పలుకుబడి ఉన్నట్లు చెప్పుకొంటున్న ఆయన హోదా, పోలవరం నిధుల విషయం ఒక్కసారి కూడా వారివద్ద ప్రస్తావించిన పాపాన పోలేదు. విశాఖ ఉక్కు ఆందోళన మొదలైన తొలినాళ్లలో ఒకసారి ఢిల్లీ వెళ్లి కేంద్ర నాయకుల వద్ద మాటవరసకు ప్రస్తావించి.. అంతటితో తన బాధ్యత తీరిపోయిందనట్లు దాన్ని వదిలేశారు. రాష్ట్రానికి వచ్చినప్పుడు కూడా ఈ సమస్యల ఊసెత్తడం లేదు. పార్లమెంటులో తన ప్రతినిధులు లేకపోయినా.. కేంద్ర నాయకులను కలిసి ఒత్తిడి చేసే అవకాశం ఉన్నా అలా చేయలేకపోతున్నారు. వైఎస్సార్సీపీ ఆందోళన బాట పట్టిన నేపథ్యంలో ఇప్పటికైనా జనసేనాని స్పందిస్తారా అన్నది అనుమానమే.

Also Read : ప్రత్యేక హోదా, రాష్ట్ర సమస్యలపై పార్లమెంటులో గళం పెంచుతున్న వైఎస్సార్సీపీ