iDreamPost
android-app
ios-app

Lokesh challenges -లోకేష్ అంత సీరియ‌స్ గా స‌వాళ్లు చేస్తున్నా..?

Lokesh challenges -లోకేష్ అంత సీరియ‌స్ గా స‌వాళ్లు చేస్తున్నా..?

ఏపీ రాజ‌కీయ నేత‌ల వాక్కులు చాలా వేడిగా ఉంటున్నాయి. ప్ర‌ధానంగా టీడీపీ నేత‌లు, వైసీపీ మంత్రుల మ‌ధ్య మాట‌ల మంట‌లు సెగ‌లు క‌క్కుతున్నాయి. మిగతా వారి సంగ‌తి ప‌క్క‌న బెడితే, టీడీపీ జాతీయ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు త‌న‌యుడు, జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ స‌వాళ్లు హాట్ టాపిక్ గా మారాయి. కొద్ది కాలంగా వేష‌, భాష‌ల్లో కాస్త ప‌రిణ‌తి చూపేందుకు తెగ ప్ర‌య‌త్నిస్తున్న లోకేష్ తాజా రాజ‌కీయాల నేప‌థ్యంలో మ‌రోసారి ప్ర‌త్యేక‌త చాటేందుకు విశ్వప్ర‌య‌త్నం చేశారు. చాలా సీరియ‌స్ గా స్టేట్మెంట్ లు ఇచ్చారు. గ‌తం కంటే భిన్నంగా ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిపై నోరు పారేసుకున్నారు. త‌మ నాయ‌కుడు ఊరుకుంటారేమో కానీ, తాను అలాంటివాడిని కాద‌ని ప్ర‌పంచంలో ఎక్క‌డున్నా ఏ ఒక్క‌డినీ వ‌ద‌ల‌నంటూ సినిమాల మాదిరిగా ప‌వ‌ర్ ఫుల్ డైలాగులు చెప్పినా పార్టీలో కానీ, ప్ర‌జ‌ల్లో కానీ లోకేష్ కు అంతగా గుర్తింపు ద‌క్కిన‌ట్లుగా లేదు.

నారావారి వారసుడు లోకేష్ విచిత్రమైన సవాళ్లు చేస్తున్నార‌నే చ‌ర్చ త‌ప్పితే.. జ‌గ‌న్ వ‌లే తండ్రికి త‌గ్గ త‌న‌యుడి అన్నంత పేరు లోకేష్ పొంద‌లేక‌పోతున్నారు. ఆయ‌నలో ఆ హుందాత‌నం క‌నిపించ‌డం లేద‌ని ప‌రిశీల‌కులు భావిస్తున్నారు. పార్టీ ఆఫీసులపై వైసీపీ నేతలు చేసిన దాడులపై లోకేష్ స్పందన విచిత్రంగా ఉంది. ఇంతకాలం ముఖ్యమంత్రి గారు అని సంబోధించారట. తాజా దాడుల తర్వాత సైకో రెడ్డి శాడిస్ట్ రెడ్డి అని సంబోధిస్తున్నానంటూ త‌న‌కు తాను ప్ర‌క‌టించుకోవ‌డం వ‌ల్ల ఆయ‌న‌కు న‌ష్ట‌మే కానీ, ప్ర‌యోజ‌నం శూన్య‌మే అంటున్నారు. ముఖ్య‌మంత్రిపై గ‌తంలో కూడా నోరు పారేసుకున్న సంద‌ర్భాలు చాలానే ఉన్నాయి. ప్ర‌జ‌ల్లో గుర్తింపు ఉన్న వ్య‌క్తుల‌పై అలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డం ప్ర‌జ‌ల‌కు దూరం చేస్తాయి కానీ ఎప్ప‌టికీ ద‌గ్గ‌ర చేయ‌వ‌నే విష‌యం లోకేష్ గుర్తిస్తే మంచిద‌నే అభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ప్రభుత్వంపై ఎన్ని ఆరోపణలనైనా,విమర్శలైనా చెప్పవచ్చు. ప్రతిపక్షమన్నాక ప్రభుత్వంలో జరిగే తప్పులను ఎండగట్టాల్సిందే తప్పేలేదు. కానీ సీఎంను పట్టుకుని వ్యక్తిగతంగా నోటికొచ్చినట్లు తిట్టడాన్ని ఎవరూ హర్షించరు. సరే ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే జగన్ ను లోకేష్ సవాలు చేయటమే ఆశ్చర్యంగా ఉంది. ‘ఎన్నాళ్ళిలా ఇంట్లో దాక్కుని కుక్కులతో దాడులు చేయిస్తావు ? నువ్వే రా తేల్చుకుందాం’ అంటు ఛాలెంజ్ చేశారు.జగన్ ను బయటకు రమ్మనడం ఏమిటి ? తేల్చుకుందామని సవాలు విసరడం ఏమిటి ? అర్థం కాకుండా ఉంది లోకేష్ వ్యవహారం. అసలు జగన్ తో లోకేష్ ఏమి తేల్చుకుందామని అనుకుంటున్నారు ? వీళ్ళిద్దరి మధ్య తేల్చుకోవాల్సిన వ్యవహారాలు ఏమున్నాయి ? అన్నదే అర్థం కావట్లేదు. 2019 ఎన్నికల్లో ముఖ్యమంత్రి కొడుకుగా, మంత్రిగా హోదాలో మంగళగిరిలో పోటీచేసి ఓడిపోయారు.

ఇపుడున్న ఎంఎల్సీ పదవి కూడా తొందరలోనే ముగిసిపోతుంది. ఇలాంటి పరిస్దితుల్లో వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయడానికి ఏదో ఒక సేఫ్ నియోజకవర్గాన్ని వెతుక్కోవాల్సిన అవసరం లోకేష్ మీదుంది. ప్రస్తుత పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు కూడా కుప్పంలో చాలా కష్టపడాలి. మరి లోకేష్ పరిస్థితి ఏంటి? మంగళగిరి నుండే పోటీ చేస్తానని లోకేష్ చెబుతున్నది వాస్తవం కాదని పార్టీ వర్గాలే అనుమానిస్తున్నాయి. మొన్నటి ఎన్నికల్లోనే జగన్ ఏమిటి చంద్రబాబు+లోకేష్ కెపాసిటి ఏమిటనే విషయంపై జనాలే తీర్పిచ్చారు. మళ్ళీ తన కెపాసిటీని లోకేష్ ముందు నిరూపించుకోవాల్సిన అవసరం జగన్ కు లేదు. అవసరం ఏదన్నా ఉంటే తన కెపాసిటి ఏమిటో నిరూపించుకోవాల్సిన అవసరం లోకేష్ కే ఉంది. కాబట్టి ట్విట్టర్లో లేకపోతే మీడియా సమావేశాల్లో జగన్ను సవాలు చేయడం మానేసి తనకొక నియోజకవర్గాన్ని వెతుక్కుంటే బాగుంటుందనే అభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి.