Idream media
Idream media
ఆధిపత్యం కోసం జరుగుతున్న పోరులో ప్రకాశం జిల్లా కందుకూరు మున్సిపాలిటీ ఎన్నికలు త్రిసంకుస్వర్గంలో నిలిచిపోయాయి. ఈ కారణంతోనే దాదాపు దశాబ్ధం పాటు స్కందపురి మున్సిపాలిటీకి ఎన్నికలు జరగలేదు. ఈ సారి కూడా మునుపటి పరిస్థితే. కోర్టు కేసులు తేలకపోవడంతో ఈ సారి కూడా ఎన్నికలు జరగడం లేదు. మరికొన్నేళ్లు ప్రత్యేక అధికారి పాలనలోనే స్కందపురి పాలన సాగబోతోంది.
ప్రకాశం జిల్లాలో ఉన్న పెద్ద మున్సిపాలిటీలలో కందుకూరు ఒకటి. 1986 ముందు వరకూ కందుకూరు మేజర్ పంచాయతీగా ఉంది. చుట్టుపక్కల గ్రామాలను కలిపి 1987లో కందుకూరును 24 వార్డులతో మున్సిపాలిటీగా మార్చారు. అప్పుడే తొలిసారి ఎన్నికలు జరిగాయి. తొలి ఎన్నికల్లో టీడీపీ మున్సిపాలిటీలో పాగా వేసింది. ఆ తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లోనూ కందుకూరు మున్సిపాలిటీని టీడీపీనే గెలుచుకుంది. 2007లో నాలుగోసారి మున్సిపాలిటీకి ఎన్నికలు జరిగాయి.
ఇవి జరగక ముందే 2005లో పట్టణానికి సమీపంలో ఉన్న మహదేవపురం గ్రామం కోర్టు ద్వారా మున్సిపాలిటీ నుంచి బయటకు వెళ్లిపోయింది. గ్రామ పంచాయతీగా ఏర్పడింది. పట్టణ జనాభా 50 వేలు దాటడడంతో విలీనమైన గ్రామాలను తొలగించి కేవలం పట్టణం వరకు 30 వార్డులను ఏర్పాటు చేశారు. మున్సిపాలిటీలో విలీనమైన గ్రామాలన్నీ కూడా టీడీపీకి కంచుకోటల్లాంటివి. వీటిని తొలగించడంతో 2007లో తొలిసారి కందుకూరు మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. ఇవే కందుకూరుకు మున్సిపాలిటీకి చివరి ఎన్నికలయ్యాయి. 2012 తర్వాత మళ్లీ ప్రత్యేక అధికారి పాలన ప్రారంభమైంది.
Also Read : ఒవైసి చూపు ఆంధ్రా మీదికి ఎందుకు మళ్లింది?
2014లో టీడీపీ అధికారంలోకి రావడంతో మళ్లీ పట్టణానికి ఏడు కిలోమీటర్ల దూరంలోని పది గ్రామాలను మున్సిపాలిటీలో విలీనం చేయాలనే ప్రతిపాదనను 2016లో టీడీపీ నేతలు చేశారు. చేమవారిపాలెం, చేమవారిపాలెం ఎస్సీ కాలనీ, ఎస్టీకాలనీ, వేమవారిపాలెం, ఆనందపురం, ఆనందపురం ఎస్సీ, ఎస్టీ కాలనీ, గల్లావారిపాలెం, కండ్రవారి పాలెం, చుట్టిగుంట, దివివారి పాలెం, గినిగుంట గ్రామాలను మున్సిపాలిటీలో కలిపి ఎన్నికలు నిర్వహించాలని టీడీపీ ప్రభుత్వంలో ప్రయత్నాలు జరిగాయి. ఈ ప్రతిపాదనను టీడీపీ ప్రత్యర్థులు వ్యతిరేకించారు.
కోర్టు మూడు కిలోమీటర్ల దూరంలోని గ్రామాలను విలీనం చేసేందుకు అవకాశం ఇవ్వగా.. ఏడు కిలోమీటర్ల దూరం ఉన్న గ్రామాలను కలపడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పట్టణానికి చెందిన దాసరి మాల్యాద్రి ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వ్యవసాయ పొలాలను దాటుకుని ఆయా గ్రామాలకు వెళ్లాలని, పట్టణంలోని పరిపాలనకే పాలక మండలికి బారంగా మారిందని, గ్రామాలు కూడా కలిస్తే.. మరింత ఇబ్బందికర పరిస్థితి తలెత్తుతుందని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో విచారణ జరుగుతోంది.
Also Read:పాపం డాక్టర్ గారు …గెలవగలిగినప్పుడు సీట్ రాలేదు,సీట్ వచ్చినప్పుడు పార్టీ ఓడిపోయింది..
కందుకూరు ఎమ్మెల్యేగా మానుగుంట మహీధర్ రెడ్డి కొనసాగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మహీధర్ రెడ్డి.. గడచిన ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసి గెలిచారు. 2014లో ఎన్నికలకు దూరంగా ఉన్నారు. కిరణ్‌కుమార్ రెడ్డి ప్రభుత్వంలో పట్టణ, పురపాలక శాఖ మంత్రిగా 2014 వరకు పని చేశారు. మహీధర్ రెడ్డి పురపాలక శాఖ మంత్రిగా ఉన్న సమయంలోనూ ఈ వివాదం పరిష్కారం కాలేదు. ఆ తర్వాత అది కొనసాగుతూనే ఉంది. కందుకూరు మున్సిపాలిటీని, నియోజకవర్గంలోని గ్రామాలను మహీధర్ రెడ్డి అభివృద్ధి పథంలో నడిపించారు.
ప్రకాశం జిల్లాలో ఏ నియోజకవర్గంలో జరగని అభివృద్ధి కందుకూరులో జరిగిందంటే అతిశయోక్తి కాదు. జిల్లాకు వచ్చే నిధులలో సింహభాగం కందుకూరుకే తీసుకువెళ్లే మంత్రాంగం మహీధర్ రెడ్డి సొంతం. అయితే కందుకూరు మున్సిపాలిటీ ఎన్నికలు జరగకపోవడం మహీధర్ రెడ్డికి మచ్చగా మారింది. గ్రామాల విలీన వివాదాన్ని వీలైనంత త్వరగా పరిష్కరించి.. ఎన్నికలు జరిగేలా చూస్తే.. ఆ ఘనత మహీధర్ రెడ్డికే దక్కుతుంది. ఇది ఎప్పటికి జరిగేనో చూడాలి.