iDreamPost
android-app
ios-app

దుర్గేష్‌ దారెటు..?

  • Published Jun 08, 2021 | 7:16 AM Updated Updated Jun 08, 2021 | 7:16 AM
దుర్గేష్‌ దారెటు..?

తూర్పుగోదావరి జిల్లా నుంచి మంచి వాగ్ధాటిగల నాయకులు ఎందరో ఉన్నారు. అయితే రాజమహేంద్రవరానికి చెందిన మాజీ ఎమ్మెల్సీ కందుల లక్ష్మీదుర్గేష్‌ తన సమ్మోహన భరితమైన మాటలతో ప్రత్యేక శైలితో ఆకట్టుకుంటారు.

రాజమహేంద్రవరం మున్సిపల్‌ ఛైర్మన్‌గా పనిచేసిన పోతుల వీరభద్రరావు మనుమడిగా (కుమార్తె తరపు నుంచి) రాజకీయాలు ఒంటబట్టించుకున్న దుర్గేష్‌.. ఉండవల్లి అరుణ్‌కుమార్, జక్కంపూడి రామ్మోహనరావుల వర్గం నుంచి దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ఎమ్మెల్సీ పదవిని పొందగలిగారు. ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీగా ఆరేళ్ళ పాటు ఆ పదవిలో కొనసాగిన దుర్గేష్‌ రాష్ట్ర వ్యాప్తంగా తన వాగ్ధాటితో మంచి పేరే సంపాదించుకోగలిగారు.

రాజమహేంద్రవరం రూరల్‌ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున చందన రమేష్‌ 2009లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో అధికార కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీగా దుర్గేష్‌ రూరల్‌ నియోజకవర్గాన్ని తన సొంత నియోజకవర్గంగా ఎంచుకున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడి వారితో సన్నిహిత సంబంధాలు కొనసాగించారు. రాజశేఖర్‌రెడ్డి మరణానంతరం, రాష్ట్ర విభజన తరువాత కూడా కాంగ్రెస్‌ పార్టీలోనే కొనసాగారు. కాంగ్రెస్‌ పార్టీ ఆదేశాల మేరకు 2014లో రాజమహేంద్రవరం ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ ఎన్నికల్లో కేవలం 21,243 ఓట్లతోనే సరిపెట్టకోవాల్సి వచ్చింది. దుర్గేష్‌ ఛరిష్మాకంటే.. విభజన కారణంగా కాంగ్రెస్‌ పార్టీపై ఏర్పడ్డ ప్రజా వ్యతిరేకతతోనే దుర్గేష్‌ ఓటమి చెందాల్సివచ్చిందని చెబుతారు.

Also Read : బుచ్చయ్యే కాదు.. వారసుడూ కనిపించడం లేదు..!

తదనంతర పరిణామాల నేపథ్యంలో వైఎస్సార్‌సీపీలోకి చేరారు. రూరల్, సిటీ నియోజకవర్గాల బాధ్యతలను దుర్గేష్‌కే అప్పజెప్పారు. అయితే రాజకీయ కారణాల దృష్ట్యా వైఎస్సార్‌సీపీని వీడి జనసేన పార్టీలో చేరారు. ఆ పార్టీ తరపునే 2019లో రూరల్‌ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసారు. అయితే త్రిముఖ పోటీలో 42వేల ఓట్లతోనే సరిపెట్టుకుని ఓటమి మూటగట్టుకోవాల్సి వచ్చింది. ఇప్పటి వరకు దుర్గేష్‌ ఎదుర్కొన్న రెండు ప్రత్యక్ష ఎన్నికల్లోనూ ఓటమి పాలవ్వడం ఆయన అభిమానులను నిరాశపర్చే విషయమేనని చెప్పాలి.

రాజకీయంగా ఎంతో భవిష్యత్తు ఉన్న నాయకుడిగా దుర్గేష్‌పై ఆయన అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. అయితే ప్రస్తుతం జనసేన పార్టీ రాజకీయ వ్యవహరాలు అంతంత మాత్రంగానే ఉండడంతో అందుకు తగ్గట్లుగానే దుర్గేష్‌ సైతం జనజీవనానికి పెద్దగా అందుబాటులోకి రాలేకపోతున్నారు. అడపాదడపా ఒకటిరెండు కార్యక్రమాలకు వచ్చినప్పటికీ మునుపటి మాదిరిగా తన ప్రత్యేకను చూపించే ప్రయత్నం చేయడం లేదు. తాను ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న జనసేన పార్టీపై విమర్శలకు దిగితే కౌంటర్‌ ఇచ్చేందుకు మాత్రం మీడియా ముందుకు వస్తున్నారు. ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీలో స్తబ్ధత, కోవిడ్‌ పరిస్థితుల దృష్ట్యా మాత్రమే సైలెంట్‌గా ఉన్నారా? లేక మరింకేమైనా ఆలోచనలు ఉన్నాయా? అన్న చర్చ నియోజకవర్గంలో ప్రారంభమైంది. జనసేనలోనే కొనసాగుతారా? అన్న సందేహాలు వ్యక్తం చేస్తున్నవారు కూడా లేకపోలేదు.

పూర్తిస్తాయిలో విషయపరిజ్ఞానం, మంచి వాగ్ధాటి గల దుర్గేష్‌ ప్రజల ముందుకు వచ్చేందుకు అనేకానేక అంశాలు ఉంటాయి. అయితే వాటన్నిటినీ పక్కన పెట్టి ప్రస్తుతం జనానికి దూరంగానే వ్యవహరిస్తుండడంతో సందేహాలకు ఆస్కారం ఇస్తున్నట్టవుతోంది. ఈ నేపథ్యంలో గతంలో మాదిరిగానే దుర్గేష్‌ ప్రజల ముందుకు చొరవగా రావాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.

Also Read : తోట వర్సెస్‌ వేగుళ్ల – రసవత్తరంగా మండపేట రాజకీయం