తెలుగు రాష్ట్రాలలోని బ్రిలియంట్ పొలిటిషియన్స్ లో సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఒకరు. ప్రజా ఉద్యమాలు నిర్మించడంలో దిట్ట అయిన తమ్మినేని వీరభద్రానికి, ఎన్నికల నిర్వహణలో మంచిపట్టు ఉంది. ఎన్నికల పొత్తులు, గెలుపు వ్యూహాల్లో ఆయన ప్రతిభను ప్రత్యర్థులు కూడా ప్రశంసిస్తారు.
దుమ్ముగూడెం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలంటూ ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పాదయాత్ర చేసి తన ఇమేజ్ ను పెంచుకోవడంతో పార్టీని బలోపేతం చేశారు. ప్రజాపోరాటాలతో ఎక్కువగా మమేకమవడంతో ఆయన మాస్ లీడర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. పార్టీ రాష్ట్రకార్యదర్శిగా ఎన్నికైన తర్వాత ఎన్నికల్లో పోటీ చేయలేదు. స్పష్టమైన ఉచ్చారణతో పాటు ఆకట్టుకునేలా మాట్లాడటంలో ఆయన ప్రతిభావంతులు.
ఒకప్పుడు కమ్యూనిస్టుల కంచుకోటగా ఉన్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని తెల్దారుపల్లి వీరభద్రం స్వస్థలం. ఆయన తల్లిదండ్రులకు కూడా ప్రజాపోరాటాలతో సంబంధముంది. జాగీర్దారులకు వ్యతిరేకంగా తమ్మినేని వీరభద్రం తండ్రి సుబ్బయ్య పోరాడారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో పాల్గొన్న సుబ్బయ్య, దళాలలో కూడా పనిచేశారు. తండ్రి స్ఫూర్తితో విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొన్న తమ్మినేని.. ప్రత్యేకమైన శైలితో తక్కువ సమయంలోనే సీపీఎం లో కీలక నేతగా ఎదిగారు. 17 ఏళ్లకే సీపీఎంలో చేరిన తమ్మినేని 36 ఏళ్లు వచ్చే సరికి ఖమ్మం జిల్లా సీపీఎం తాత్కాలిక కార్యదర్శిగా ఎన్నికయ్యారు.
Also Read : మాజీ పోలీస్ పటేల్ కు రాష్ట్ర స్థాయి పదవి
1991లో జరిగిన జనరల్ ఎలక్షన్స్ లో ఖమ్మం లోక్ సభ నుంచి సీపీఎం తరఫున పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి పీవీ రంగయ్యనాయుడు చేతిలో ఓటమి చెందారు. ఆ ఎన్నికల్లో కేవలం ఒక శాతం ఓట్ల తేడాతో ఆయన ఓడారు. తర్వాత 1996లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి రంగయ్యనాయుడుని ఓడించి లోక్ సభలో అడుగుపెట్టారు. 1998లో జరిగిన ఎన్నికల్లో కూడా మళ్లీ ఎంపీగా పోటీ చేసి రెండోస్థానానికి పరిమితమయ్యారు.
2004 లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఖమ్మం అసెంబ్లీ స్థానం నుంచి సీపీఎం తరఫున పోటీచేసి టీడీపీ అభ్యర్థిపై విజయం సాధించారు. 2009లో పాలేరు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి రామిరెడ్డి వెంకటరెడ్డి చేతిలో ఓటమి చెందారు.
అవినీతి ఆరోపణలు..
తమ్మినేని పై అవినీతి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆయన అవినీతికి పాల్పడ్డారంటూ ఆయన మాజీ సహచరులే ఆరోపించారు. తర్వాత వారిని పార్టీ నుంచి బహిష్కరించారు. ’ నిప్పుకు చెదలు’ అనే పుస్తకం కూడా పబ్లిష్ చేశారు. తర్వాత కాలంలో కమ్యూనిస్టులపై విమర్శలు చేసేందుకు కాంగ్రెస్‌కు అదోక అస్త్రంగా మారింది. తమ్మినేని పై సీపీఐ నేత నారాయణ కూడా తీవ్ర ఆరోపణలు చేశారు. 2014 ఎన్నికల్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి వైసీపీ తరపున ఎంపీగా పోటీ చేసినప్పుడు ఆయన నుంచి 15 కోట్లు తీసుకుని తమ్మినేని మద్దతు తెలిపారని ఆరోపించారు. అయితే ఆ తర్వాత ఆరోపణలను ఉపసంహరించుకున్నట్లు తెలపడంతో పాటు విచారం వ్యక్తం చేశారు.
Also Read : ఆ కామ్రేడ్ పలుకే బంగారమాయె..!
2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఎల్ఎఫ్ అనే ఫ్రంట్ ను ఏర్పాటు చేసి వామపక్షాలతో పాటు దళితులును ఐక్యం చేసే ప్రయత్నం చేశారు. అభ్యుదయ భావాలున్న వివిధ సంఘాలను ఒకే తాటిపై తెచ్చేందుకు యత్నించారు. బీఎల్ఎఫ్ తరపున అభ్యర్థులను నిలిపి సీపీఎం మద్దతు ఇచ్చింది. కానీ ఎన్నికల్లో బీఎల్ఎఫ్ అభ్యర్ధులు విజయం సాధించలేక పోయారు. ఆయన నేతృత్వంలో జరిగిన ఎన్నికల్లో అదో పెద్ద వైఫల్యంగానే చెప్పవచ్చు. ప్రస్తుతం సైలెంట్‌గా ఉన్న వీరభద్రం వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం ఎలాంటి అడుగు వేస్తారో చూడాలి.