Idream media
Idream media
తెలుగుదేశం అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో సోమవారం వ్యవహరించిన తీరు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 40 ఏళ్ల రాజకీయ అనుభవం, 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా, 9 ఏళ్లు ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు ఎన్నో అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొని ఉంటారు. కానీ చంద్రబాబు వ్యవహారశైలి ఎన్నడూ ఇలా లేదనే భావన అంతటా వ్యక్తమవుతోంది.
అసలేం జరిగింది..
రైతుల సమస్యలపై తెలుగుదేశం ప్రశ్నలకు ప్రభుత్వం స్పందించగా, దానిపై తను మాట్లాడాలంటూ చంద్రబాబు నాయుడు పట్టుబట్టారు. తెలుగుదేశం ఎమ్మెల్యే రామానాయుడు ప్రశ్నకు వ్యవసాయ శాఖా మంత్రి సమాధానం ఇచ్చారు. దానిపై మళ్లీ మాట్లాడే అవకాశం రామానాయుడుకు దక్కింది. అయితే మధ్యలో చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకున్నారు. తను మాట్లాడాలంటూ పట్టుబట్టారు. దానికి చైర్ లో ఉన్న డిప్యూటీ స్పీకర్ అనుమతి ఇవ్వలేదు. దీంతో చంద్రబాబు నాయుడు రెచ్చిపోయారు. తనకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదంటూ ఆయన తన సీట్లోంచి లేచి స్పీకర్ పోడియం ముందు భైఠాయించారు. ఆయన అక్కడ కూర్చోవడంతో మిగతా తెలుగుదేశం ఎమ్మెల్యేల్లో కొందరు వెళ్లి ఆయనతో పాటు కూర్చున్నారు. ఎంతకూ వీరు లేకపోవడంతో.. సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగిస్తున్న వీరిని ఒక రోజు పాటు సస్పెండ్ చేసే తీర్మానాన్ని ప్రవేశ పెట్టింది అధికార పక్షం. ఆ మేరకు చంద్రబాబు నాయుడు సభ నుంచి ఒక రోజు పాటు సస్పెండ్ అయ్యారు.
తన కోపమే తనకు శత్రువు..!
తనకు ఎప్పుడూ ఇంత కోపం రాలేదని స్వయానా చంద్రబాబే వెల్లడించారు. ఎప్పుడు లేనిది అంత కోపం ఇప్పుడే ఎందుకొస్తోంది..? అసెంబ్లీ సమావేశాల్లో అంతకన్నా తీవ్రంగా చర్చలు జరిగిన సందర్భాలు కానీ.. అంశాలు కానీ లేవా..? అంటే చాలానే ఉన్నాయనేది వాటిని పరిశీలించే వారెవరికైనా తెలుస్తుంది. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు ఇలా సస్పెండ్ కావడం కొత్త కాదు కానీ, ఏకంగా ప్రధాన ప్రతిపక్ష నేత సభలో అలా వ్యవహరించడం మాత్రం చర్చనీయాంశంగా మారుతోంది. సభలో బలాబలాలను బట్టి మాట్లాడే అవకాశం దక్కుతూ ఉంటుంది. తన పార్టీ ఎమ్మెల్యేనే మాట్లాడుతున్న సమయంలో తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలంటూ చంద్రబాబు నాయుడు ప్రవర్తించిన తీరు విచిత్రంగా ఉందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. నేల మీద కూర్చుని ఆయన పబ్లిసిటీ స్టంట్లు చేశారా లేక ఆయన వింతగా ప్రవర్తించారా అనే అంశంపై చర్చ జరుగుతోందిప్పుడు. ఇది కేవలం అసెంబ్లీలో చోటుచేసుకున్న అంశాల వల్లే చంద్రబాబుకు కోపం వచ్చినట్లుగా లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో జగన్ కు పెరుగుతున్న ఖ్యాతి, ఆయన పాలనకు వస్తున్న ర్యాంకులు, ప్రజాధరణ చూసి ఓర్వలేక చంద్రబాబు ఎప్పుడూ లేని విధంగా వ్యవహరిస్తున్నారన్న భావన చాలా మందిలో వ్యక్తమవుతోంది. ఈ తరహా చర్చను గమనిస్తే తన కోపమే తనకు శత్రువు అన్న నానుడి చంద్రబాబు మరిచినట్లుగా కనిపిస్తున్నారు.