బిజెపికి లేని బాధ చంద్రబాబుకు ఎందుకు ?

కేంద్ర నిధులు వాడుకోవటం గురించి చంద్రబాబునాయుడు కూడా బుద్ధులు చెప్పేస్తున్నారు. కేంద్రప్రభుత్వం నుండి డబ్బులు వస్తే వైసిపి వాళ్ళు ప్రచారం చేసుకోవటం ఏమిటంటూ ప్రశ్నించారు. కేంద్రం నిధులేమిటో వైసిపి నేతల ప్రచారం ఏమిటో అంతా గందరగోళంగా ఉంది. అసలు హోలు మొత్తం మీద చంద్రబాబు బాధేమిటో అర్ధం కావటం లేదు.

ఒకవేళ చంద్రబాబు ఆరోపిస్తున్నట్లుగా కేంద్రప్రభుత్వం నిధులతో వైసిపి నేతలు ప్రచారం చేసుకున్నారనే అనుకుందాం. అడగాల్సింది బిజెపి నేతలు కదా ? మధ్యలో చంద్రబాబుకు ఏమిటి సంబంధం ? తాను అధికారంలో ఉండగా కేంద్రం నుండి వచ్చిన నిధులను చంద్రబాబు తన ప్రచారం కోసం వాడుకో లేదా ? కేంద్రంలో రాష్ట్రంలో ఏ ప్రభుత్వాలున్నా ఎప్పుడూ జరిగేదిదే కదా ?

రాష్ట్రంలోని అమలు అవుతున్న ఏ పథకంలో కూడా రాష్ట్రప్రభుత్వం షేర్ ఇది.. కేంద్ర ప్రభుత్వం షేర్ ఇది అని ఎక్కడైనా చెబుతుందా ? అంతెందుకు మోడి ప్రభుత్వం కార్మికులకు బీమా కోసం నిధులు మంజూరు చేస్తే చంద్రబాబు దాన్ని చంద్రన్న బీమా పథకం అని ప్రచారం చేసుకోలేదా ? గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు వేయటానికి కేంద్రం పంచాయితీ రాజ్ శాఖకు నిధులిస్తే చంద్రబాబు, చినబాబు తమ ఘనతగా చెప్పుకోలేదా ?

అలాగే ప్రభుత్వం అందిస్తున్న ఫించన్లు, రేషన్ లో కూడా కేంద్రం నిధులున్నాయి కదా ? నంద్యాలలో చంద్రబాబు పర్యటించినపుడు టిడిపికి ఓట్లేయకపోతే రేషన్ కట్, రోడ్లు కూడా వేయించేది లేదని జనాలను బహిరంగంగా బెదిరించలేదా ? జనాలకు ఇచ్చిన రేషన్ , వేయించిన రోడ్లు హెరిటేజ్ కంపెనీ నిధులతో వేయించాడా ? తానిస్తున్న ఫించన్, రేషన్ తీసుకుంటు, తానువేసిన రోడ్లపై తిరుగుతు తమకే ఓట్లు వేయనంటారా ? అంటూ జనాలను దబాయించిన విషయం మరచిపోయాడేమో ?

గ్రామాల్లో కట్టిన వ్యక్తిగత మరుగుదొడ్ల పథకం డబ్బులో మేజర్ షేర్ కేంద్రానిదే. అలాగే నీరు-చెట్టు పథకం కూడా కేంద్రానిదే. అయితే వాటిని కేంద్రపథకాలని చంద్రబాబు ఒక్కసారైనా చెప్పాడా ? చంద్రబాబుకన్న జగన్మోహన్ రెడ్డే నయం. రైతుభరోసా పథకంలో రైతులు ఏడాదికి అందుకుంటున్న రూ. 13500 ల్లో కేంద్రం వాటా కూడా ఉందని స్పష్టంగా ఒకాసరి చెప్పాడు. ఏమిటో ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకోవటానికే తప్ప ఇంక దేనికి పనికొచ్చేట్లు లేదు చంద్రబాబు అనుభవం.

Show comments