iDreamPost
iDreamPost
ఎన్నికల సంఘం.. అసలు ఇదొక వ్యవస్థ ఉంటుందన్నది గత కొన్నేళ్ళ వరకు ప్రజలకు తెలియదనే చెప్పాలి. కేంద్ర ఎన్నికల కమిషనర్‌గా టీఎన్ శేషన్ పదవీలోకి రాగానే ఎన్నికల సంఘం ఉనికి సామాన్య ప్రజలకు కూడా తెలిసిందంటారు. అప్పటి వరకు ఎన్నికల్లో జరిగే అవకతవకలకు చెక్ పెట్టడంలో శేషన్ తనదైన శైలిని అనుసరించడంతో పాటు, ఎన్నికల సంఘం అనే వ్యవస్థ ఎంత కీలకమో చాటి చెప్పారు. ఎన్నిల నిర్వహణలో నిబంధనలను తు.చ తప్పకుండా అమలు చేసి ఆరోపణలకే ఆస్కారం లేకుండా తన విధులు నిర్వహించడంలో శేషన్ బెంచ్‌మార్క్‌నే క్రియేట్ చేసారంటారు. దీంతో ఎన్నికల సంఘం, దానికి బాధ్యత వహించే అధికారులంటే ప్రజలు, ప్రజాప్రతినిధుల్లో ప్రత్యేకమైన గౌరవం ఏర్పడింది.
అలాగే పలు రాష్ట్రాలకు కమిషనర్లుగా వ్యవహరించిన వారు సైతం వినూత్నమైన విధానాలతో ఓట్లు నమోదు, ఎన్నికల నిర్వహణ తదితర అంశాల్లో ప్రజల మన్ననలు, ప్రముఖుల అభినందనలను అందుకున్నవారు కూడా పలువురు ఉన్నారు. ఇలాంటి అధికారుల్లో ఎవ్వరూ కూడా తాము చెప్పినది మాత్రమే జరగాలి అన్న మంకుపట్టును పట్టిన దాఖలాల్లేవు. విధానపరంగా ఏవైనా ఇబ్బందులు ఎదురైతే రాజకీయ పార్టీలను సమావేశ పరచి, అందరికీ ఆమోద యోగ్యమైన కామన్ మినిమమ్ పాయింట్‌ను ఎంపిక చేసి, దానికి అనుగుణంగా ముందుకెళ్ళేవారు. అందువల్లనే వారి పట్ల ప్రత్యేక గౌరవభావం పెరగడానికి కారణమైందంటారు.
అయితే ఏపీ స్టేట్ ఎన్నికల కమిషన్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ మాత్రం అధికారంలో ఉన్న ప్రభుత్వంతో కయ్యం పెట్టుకుని జనంలో నానుతున్నారంటున్నారు. రోజుకో కయ్యం, పూటకో వివాదం మాదిరిగా సాగుతున్న నిమ్మగడ్డ తీరు సర్వత్రా విమర్శలకు తావిస్తున్నప్పటికీ తన ధోరణిని మాత్రం వీడడం లేదు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా సమయం వచ్చినప్పటికీ రెండేళ్ళ పాటు స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించకుండా కాలయాపన చేసిన ఆయన, ఇప్పుడు వెంటనే సిద్ధం కావడం, ఏకపక్షంగా నోటిఫికేషన్ జారీ చేసేయడం పట్ల సర్వత్రా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అది కూడా కరోనా పాజిటివ్‌లు పెద్దగా వ్యాప్తి చెందని టైమ్‌లో ఎన్నికలను వాయిదా వేసి తన వైఖరిపై అనుమానాలు పెరిగేందుకు ఆయనే అవకాశం ఇచ్చారన్న విమర్శ కూడా విన్పిస్తోంది. తన ముందు విధులు నిర్వహించిన అధికారులు సదరు పదవిపై పెంచిన హుదాతనాన్ని ఏ మాత్రం పట్టించుకోకుండా ‘కుందేటికి మూడు కాళ్ళే’’ అన్న సిద్ధాంతం మేరకు వ్యవహారాలు నడిపిస్తుండడం అభ్యంతరాలకు కారణమవుతోంది.
ఇప్పుడు తన కార్యాలయానికి చెందిన ఉన్నతాధికారుల్లో ఒకరిని డిస్మిస్ చేయడం, మరొకరిని మాతృసంస్థకు అటాచ్ చేయడం కోసం ఉత్తర్వులు ఇవ్వడం ఉద్యోగ వర్గాల్లో సైతం విస్మయాన్ని కల్గిస్తోంది. నిన్నటి వరకు ప్రభుత్వంతో మాత్రమే కయ్యంపెట్టుకున్న నిమ్మగడ్డ ఇప్పుడు తన ఆర్డర్‌లను నెరవేర్చాల్సిన ఉద్యోగులను సైతం వేధింపు తరహా ధోరణిలతో వ్యవహరిస్తుండడం చర్చకు తావిస్తోంది. అసలు ఎన్నికల కమిషన్ అనేది తనపని తాను చాపకింద నీరులా చేసుకోవడం మాత్రమే ఇప్పటి వరకు అందరికీ తెలిసింది. కానీ దానికి భిన్నంగా ప్రతిపక్ష పార్టీ నాయకులతో ప్రత్యక సమావేశాలు, సన్మానాలు చేయించుకోవడం వంటి వ్యవహారాలతో ఆ పదవి పరును రచ్చకీడుస్తున్నారన్న భావన కూడా ఉద్యోగ వర్గాల నుంచి వ్యక్తమవుతోందంటున్నారు.
ఎన్నికల సంఘం, దానికి ఉండే విశేష అధికారాలను గురించి ఎవ్వరూ వేలెత్తి చూపకపోగా, ఆ పదవిలో ఉన్న నిమ్మగడ్డ వ్యవహారశైలిని మాత్రమే ప్రశ్నిస్తున్నారన్నది ఇక్కడ ప్రస్తావనార్హం. అధికార పార్టీ నాయకులు చెబుతున్నట్లుగా పదవీ విరమణ అనంతరం తెలుగుదేశం పార్టీలో చేరుతారా? అన్న అనుమానాలు ఇప్పుడు జనంలో సైతం పుట్టుకొస్తున్నాయి.