iDreamPost
iDreamPost
ఏక్ నాథ్ షిండే, హెడ్ లైన్స్ లో అతని పేరు తరచు వినిపిస్తోంది. మహారాష్ట్ర సింధియాగా ఆయనకు నేషనల్ మీడియా పేరు పెట్టింది. మహాసర్కార్ లో ఆయన పట్టణాభివృద్ధి శాఖమంత్రి. ఇప్పుడు డజనుకు పైగా ఎమ్మెల్యేలతో కలసి, గుజరాత్ కు దుకాణం మార్చారు. అంటే ఇది సేన నాయకత్వంపై తిరుగుబాటే.
ఇందులో ఆశ్చర్యమేంటంటే, గత వారం మాత్రమే, సేన వారసుడు ఆదిత్య ఠాక్రే అయోధ్యను సందర్శించినప్పుడు షిండే ఆయన చుట్టూ కనిపించారు. ఫోటోలు దిగారు.
బీజేపీ వేసిన ప్లాన్ లో భాగంగా, షిండే తిరుగుబాటు చేసినట్లు వార్తలు వచ్చిననాటి నుంచి, శివసేన మహా అసెంబ్లీలో సభా నాయకుడు, పార్టీ చీఫ్ విప్ పదవుల నుంచి తొలగించింది. ఇక్కడ నుంచి మహా సంక్షోభం క్లైమాక్స్ చేరింది. కాంగ్రెస్, ఎన్సీపీ మంత్రులకు కలసిపనిచేయడం చాలా కష్టమని తిరుగుబాటు చేస్తున్న ఎమ్మెల్యేలు, మంత్రులు అంటున్నారు.
నిజానికి, ఫిబ్రవరి 9న ఏక్‌నాథ్ షిండేకు 58 ఏళ్లు నిండినప్పుడు, థానేలో పోస్టర్లు కనిపించాయి. “కాబోయే ముఖ్యమంత్రి” అని రాశారు. ఇది ఆయన కాదనలేదు. అంతెందుకు 2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత కూడా, థానేలోని శివసైనికులు, షిండేను సిఎం అభ్యర్థిగా ప్రకటిస్తూ, థానేలో పోస్టర్లు, బ్యానర్లు పెట్టారు. థానేలో షిండేకు బలముంది. ఇది కార్యకర్తల కోరికగానే చూశారు తప్ప, నిజంగా షిండేకు ఆ ఆలోచన ఉందని ఎవరూ అనుకోలేదు. ఆ ఎన్నికల్లో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీలు కలసి మహావికాస్ అవధి కూటమి ప్రభుత్వాన్ని ఎర్పాటు చేశారు. ఈ కూటమి మొత్తం బలం 152.
ఇప్పుడు తిరుగుబాటు ఎమ్మెల్యేలు బాలాసాహెబ్ ఠాక్రే పేరును ప్రస్తావిస్తున్నారు. షిండే, శివసేన నాయకుడు అనంద్ డిఘే శిష్యుడు. రాజకీయాల్లోకి రాకముంది ఆటోరిక్షా నడిపారు. ఇప్పుడు ఏకంగా ప్రభుత్వాన్నే నడపాలని కోరుకొంటున్నారని శివసేన నేతలు విమర్శిస్తున్నారు. నిజానికి షిండే చాలా దూరం వచ్చేశారు.
ఆటోడ్రైవర్ నుంచి తిరుగుబాటు మంత్రిదాకా
1980ల్లో కార్యకర్తగా ఆయన ప్రయాణం మొదలైంది. ఆ తర్వాత థానే శాఖకు షిండే నాయకత్వం వహించారు. ఆ తర్వాత థానే మున్సిపల్ కార్పొరేషన్ లో కార్పొరేటర్. ఆ తర్వాత 2004లో ఎమ్మెల్యే అయ్యారు. 2004 నుండి, అతను వరుసగా నాలుగు ఎన్నికలలో గెలిచాడు, అతని కొడుకు శ్రీకాంత్ షిండే ఎంపీ. పార్లమెంటు సభ్యుడు.
శివసేన ఠాక్రే వారసుల గుప్పిట్లో బలంగా ఉందన్న సంగతి అందరికీ తెలుసు. షిండేకి ఈ విషయం తెలియదనుకోలేం. మరి ఎందుకు తెగించారు? సీఎం ఉద్ధవ్ ఠాక్రే కొడు ఆదిత్య పార్టీలోకి వచ్చిన నాటి నుంచి సీనియర్లను పక్కనపెడుతున్నారన్నది విమర్శ. ఆదిత్య, రాష్ట్ర రవాణా మంత్రి అనిల్ పరాబ్ లాంటి జూనియర్లు పార్టీలో అన్ని నిర్ణయాలు తీసుకొంటున్నారన్నది మరో ఆరోపణ. శివసేనకు బలమైన కోట అయిన థానేలో షిండే అత్యంత సీనియర్ నాయకుడు. రాష్ట్రవ్యాప్తంగా పలుకుడి ఉన్న నేత.
2014లో బీజేపీతో సేన తెగతెంపులు చేసుకుంది. విడిగా పోటీచేసింది. కాని ఓడిపోయింది. అప్పుడు షిండే మహారాష్ట్ర అసెంబ్లీలో, ప్రతిపక్ష నేతగా చేశారు. బీజేపీని సభలో ఎదుర్కొన్నారు. సేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత మంత్రి అయ్యారు.
ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు సేన సిద్ధమవుతోంది. ఈ సమయంలో తిరుగుబాట అంటే 2024 అసెంబ్లీ ఎన్నికలకు ముందు అగ్నిపరీక్షే. గట్టెక్కడం అంత సులువేం కాదు. ప్రత్యర్ధి ఎత్తుగడులు ఇంకా శివసేనకు అర్ధంకావడంలేదు.