iDreamPost
android-app
ios-app

పెట్రో భారంలో రాష్ట్రాల వాటా ఎంత, కేంద్రం కలెక్షన్ ఎంత

  • Published Aug 29, 2021 | 7:05 AM Updated Updated Aug 29, 2021 | 7:05 AM
పెట్రో భారంలో రాష్ట్రాల వాటా ఎంత, కేంద్రం కలెక్షన్ ఎంత

పెట్రో ఛార్జీల భారం నుంచి ప్రజలకు ఉపశమనం దక్కేలా లేదు. ధరలు తగ్గించే అవకాశం లేదని ఇప్పటికే కేంద్రం ప్రకటించేసింది. పైగా గత ప్రభుత్వం తీసుకొచ్చిన ఆయిల్ బాండ్ల అప్పులు తీర్చడం వల్లనే ధరలు పెరుగుతున్నాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పడం పెద్ద దుమారం రేపింది. ఆర్థిక మంత్రి కూడా అర్థసత్యాలను ప్రచారం చేస్తున్నారనే విమర్శలు అన్ని వైపులా వచ్చాయి. మరో మంత్రి అయితే ప్రభుత్వం ఉచితంగా రేషన్ బియ్యం పంపిణీ చేస్తుందంటే పెట్రో ఛార్జీలు పెంచడం ద్వారానే అని కూడా చెప్పేశారు. కేంద్రం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలన్నీ పెట్రోల్ ధరలు పెంచడం వల్లనేనని కూడా కొందరు సెలవిచ్చారు.

మొత్తంగా ప్రజలకు పథకాల పేరుతో ఇస్తున్నది ధరలు పెంచేసి మళ్లీ ప్రభుత్వమే తీసేసుకుంటుందనే విషయాన్ని కేంద్రంలో పెద్దలు చెప్పకనే చెబుతున్నారు.

మరికొందరు బీజేపీ పెద్దలు వితండ వాదన తెస్తున్నారు. పెట్రో ఛార్జీల భారం తగ్గాలంటే రాష్ట్రాలే తమ వాటా పన్నులు తగ్గించాలని సెలవిచ్చారు. కేంద్రం మాత్రం ధరలు పెంచడమే తప్ప ప్రజలకు ఊరట కల్పించదని చెబుతూ రాష్ట్రాల పన్నుల వాటా తగ్గించుకోవాలని ఎదురుదాడికి దిగడం విస్మయకరంగా కనిపిస్తోంది. వాస్తవానికి ఇటీవల పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రం ఇచ్చిన సమాధానం ప్రకారం దేశంలో అత్యధికంగా పన్నులు వసూలు చేస్తున్న రాష్ట్రంగా మధ్యప్రదేశ్ ఉంది. అక్కడ గడిచిన రెండు దశాబ్దాలుగా బీజేపీ పాలనే సాగుతోంది. ఆ తర్వాత రాజస్తాన్ వంటి రాష్ట్రాలున్నాయి.

ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో పెట్రోల్ బ్యారెల్ ధర 68 డాలర్లుగా ఉంది. దాని ప్రకారం పెట్రోల్ అసలు ధర రూ. 35 కూడా ఉండదు. ఇక విశాఖలో ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం వసూలు చేస్తున్న పన్నుల వాటా లీటర్ కి రూ 28.49 గా ఉంది. అంటే లీటర్ పెట్రోల్ రూ. 107గా ఉంటే పెట్రోల్ అసలు ధర, రాష్ట్రాల పన్నులతో పాటుగా డీలర్ వాటా, రవాణా ఛార్జీలు అన్నీ తగ్గించేస్తే కేంద్రం వసూలు చేస్తున్న పన్నులు రూ. 38కి పైగా ఉంది. సరిగ్గా ఇది 2014 నాటికి రూ. 8 ఉండేది. ఇప్పుడు 400 శాతం పైబడి పెరిగింది. దాంతో కేంద్ర ప్రభుత్వం భారీగా పన్నులు పెంచేసి పెట్రో ఛార్జీల రూపంలో వసూళ్ల పర్వం సాగిస్తున్నట్టు స్పష్టమవుతోంది. అదే సమయంలో రాష్ట్రాల మీద మాత్రం పన్నులు తగ్గించుకోవాలనే ఉచిత సలహాలను అధికార పార్టీ పెద్దలివ్వడం ఆశ్చర్యంగా కనిపిస్తోంది.

2020-21 ఆర్థిక సంవత్సరంలో సవరించిన లెక్కల ప్రకారం కేవలం పెట్రో ఉత్పత్తుల ద్వారా కేంద్రానికి వచ్చిన ఆదాయం రూ. 3.64లక్షల కోట్లు. ఏంటే నెలకు రూ. 30వేల కోట్లు, రోజుకి వెయ్యి కోట్లు చొప్పున పెట్రోల్ ద్వారా ప్రజల జేబులోంచి కేంద్రానికి చేరుతోంది. అదే సమంయలో రాష్ట్రాలకు ఆ పన్నుల నుంచి వచ్చే వాటా ఏమీ ఉండదు కాబట్టి అదంతా కేంద్రం చేతుల్లో చేరుతోంది ఓవైపు ఏటా ఐదారు లక్షల కోట్లు అప్పులు చేస్తూ మరో వైపు మూడున్నర లక్షల కోట్లకు పైగా పెట్రో ట్యాక్స్ వసూళ్లు చేస్తున్న కేంద్రం తీరు విస్మయకరంగా మారుతోంది. మొత్తం మార్కెట్లో అన్ని సరుకుల ధరల పెరుగుదలకు, సామాన్యుల జీవనం భారంగా మారేందుకు ఈ పరిణామాలు దోహద పడుతున్నాయి.

Also Read : ఆంధ్రప్రదేశ్ రాజధానిగా విశాఖ – పార్లమెంట్ సాక్షిగా నిర్ధారణ