iDreamPost
android-app
ios-app

Veer Mahaan: గ్రేట్ ఖ‌లీ త‌ర్వాత‌ WWEలో దుమ్మురేపుతున్న‌ ఈ రెజ్లర్ ఎవరు?

  • Published Apr 29, 2022 | 4:05 PM Updated Updated Apr 30, 2022 | 5:56 PM
Veer Mahaan: గ్రేట్ ఖ‌లీ త‌ర్వాత‌ WWEలో దుమ్మురేపుతున్న‌ ఈ రెజ్లర్ ఎవరు?

ఇప్పుడంతా బాహుబ‌లి, రాఖీబాయ్‌ల సీజ‌న్. మార్వెల్ సూప‌ర్ హీరోల్లా క‌నిపించే వాళ్ల‌కే క్రేజ్. నిజానికి ఇండియాలో బాహుబ‌లిని మించిన స్టార్లున్నారు. WWE, WWF ల్లో కేన్, జాన్ సెనా, ది రాక్ లాంటి పెద్ద సూపర్‌స్టార్లకు ఇండియాలో పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక‌ ది గ్రేట్ ఖలీ WWEలో స్టార్లను ఎత్తికుదేస్తుంటే ఇండియాకి పూన‌క‌మొచ్చేది. గ్రేట్ ఖలీకి వీర ఫాలోయింగ్ త‌క్కువేంకాదు. ఇప్పుడు వీర్ మహాన్( Veer Mahaan) రెజ్లింగ్ లో సూప‌ర్ స్టార్.

WWE పోటీల్లోకి వెళ్లిన త‌ర్వాత‌, అత‌ని బాడీ, స్టైల్ గొప్ప ఎట్రాక్ష‌న్ అయిపోయాయి. శివుని భ‌క్తుడిగా శైవ నామాలు, కండ‌లు తిరిగిన బాడీ, దూకుతుంటే సింహంలా క‌నిపించే వీర్ మహాన్‌కు ఫాలోయింగ్ పెరిగిపోతోంది.

ఇంత‌కీ వీర్ మహాన్ ఎవరు? ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఒక చిన్న గ్రామం అత‌ని స్వ‌స్థ‌లం. అస‌లు పేరు రింకు సింగ్ రాజ్‌పుత్( Rinku Singh Rajput). వ‌య‌స్సు 34 ఏళ్లు. రింకు సింగ్ తండ్రి ఓ ట్రక్ డ్రైవర్‌. రింకు చిన్నప్పటి నుంచీ కుస్తీ పట్టేవాడు.

అత‌ని హ్యాండ్స్ చాలా స్ట్రాంగ్. అందుకే జావెలిన్ త్రో ఆడేవాడు. జూనియర్ నేషనల్‌లో పతకం కూడా సాధించాడు. అక్క‌డి వ‌ర‌కు అంద‌రిలాంటి క‌థే రింకూది. 2008లో అతని లైఫ్ పెద్ద మలుపుతిరిగింది. రింకు టీవీ రియాలిటీ షో ‘ది మిలియన్ డాలర్ ఆర్మ్(The Million Dollar Arm)లో పార్టిసిపేట్ చేశాడు. ఇది ఒక బేస్‌బాల్ టాలెంట్ హంట్ షో. ఇందులో వేగంగా బేస్‌బాల్ విస‌రాలి. జావెలిన్ త్రో అనుభవం ఈ షోకు బాగా ఉపయోగపడింది. అలాగ‌ని అంత‌కుముందు బేస్‌బాల్ ఆడింది లేదు. కానీ, స్ట్రాంగ్ బాడీ, వేగంగా విస‌ర‌గ‌లిగే టాలెంట్ తో షోని రింకు గెలిచాడు.ఎంత వేగంగా బేస్ బాల్ విసిరాడో తెలుసా? 140 కిమీ. క‌ళ్లుతిరిగే వేగం.

అక్క‌డ నుంచి బేస్‌బాల్‌పై ఆసక్తి పెరిగింది. అమెరికా వెళ్లాడు. బేస్‌బాల్ జట్లలో ఆడాడు. పీటర్స్‌బర్గ్ పైరేట్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ప్రొఫెషనల్ అమెరికన్ బేస్‌బాల్ జట్టులో ఆడిన తొలి భారతీయ క్రీడాకారుడిగా రింకు రికార్డు సృష్టించాడు. గ‌ట్టి ప్రాక్టీస్ తో బేస్‌బాల్ విసిరే వేగం 145 కి.మీకి పెరిగింది. ఆఫ‌ర్లూ అంతే.

మ‌ళ్లీ అత‌ని లైఫ్ లో మ‌రో మ‌లుపు. 2018లో బేస్‌బాల్ ఆటకు గుడ్ బై చెప్పిన‌ తరువాత, ప్రొఫెషనల్ రెజ్లింగ్‌పై శ్రద్ధ పెట్టడం ప్రారంభించాడు. WWEతో సంతకం చేశాడు. సౌరవ్ గుర్జార్‌తో కలిసి ‘ది ఇండస్ షేర్’ పేరుతో WWE NXTలో పాల్గొన్నాడు. ఆ త‌ర్వాత జిందర్ మహల్ ఈ టీంలో చేరాడు. అప్పకే రింకు సింగ్ తన పేరును వీర్‌గా మార్చుకున్నాడు. వీర్ పేరు అత‌నికి గొప్ప బ్రాండింగ్ నిచ్చింది

వీర్, షాంకీ, జిందర్‌ల జట్టు వరుసగా 12 మ్యాచ్లలో గెల్చినా, 2021లో వీర్ స్వతంత్ర రెజ్లర్‌గా WWE Raw తో సంతకం చేశాడు. ఈసారి తన పేరును వీర్ మహాన్‌గా మార్చుకున్నాడు. అక్క‌డ నుంచి కొత్త హీరో పుట్టుకొచ్చాడు.

మ‌నిషేమో 6 అడుగుల 4 అంగుళాలు, 125 కిలోల బ‌రువుతో మార్వెల్ హీరోలా క‌నిపించాడు. అలాగ‌ని వీర్, భార‌తీయ‌త‌ను మ‌ర్చిపోలేదు. నుదుటిపై శైవ నామాలు, గ‌డ్డం, పొడువాటి జుట్టుతో చాలా గంభీరంగా క‌నిపిస్తాడు. ఇండియ‌న్స్ ఎక్క‌డ చూసినా, అత‌ను మ‌నోడే అనుకొనేంత‌లా మారిపోయాడు. ఈ స్టైల్ లో రింకు మిగతావారి కన్నా స్పెష‌ల్.

ఏప్రిల్ 4న WWE బరిలోకి దిగాడు. ఈ మ్యాచ్‌లో వీర్ మహన్, తండ్రీకొడుకులైన రే మిస్ట్రియో, డొమినిక్ మిస్ట్రియోలను చిత్తుగా ఓడించాడు. సూప‌ర్ స్టార్ అయిపోయాడు. ఇక ప్రొఫెష‌న‌ల్ రెజ్లింగ్ కు వీర్ ఒక బ్రాండ్ నేమ్. చిన్న గ్రామంలో కుస్తీలు ప‌ట్టే కుర్రాడు WWEకి రావ‌డ‌మంటే, గెల‌వ‌డ‌మంటే గొప్ప సినిమాకు క‌థ దొరికిన‌ట్లేక‌దా! నిజానికి అత‌ని లైఫ్ మీద ఇప్పటికే ఒక సినిమా వ‌చ్చింది. పేరు The Million Dollar Arm.