గుంటూరు జిల్లాలో కీలక నియోజకవర్గమైన రేపల్లె లోని రేపల్లి మున్సిపాలిటీ ఎన్నికల పై ఇప్పుడు జోరుగా పందాలు జరుగుతున్నాయి. ఇటు అధికార పక్షం, అటు ప్రతిపక్షం ఈ మున్సిపాలిటీ ను కైవసం చేసుకుంటుందని ఇరు పార్టీల ద్వితీయశ్రేణి నాయకులు కార్యకర్తలు ఆశాభావంతో ఉన్నారు. దింతో ఏం జరుగుతుందోనన్న ఆసక్తి గుంటూరు జిల్లా అంతటా ఉంది.
మోపిదేవి వర్సెస్ అనగాని
రేపల్లి మున్సిపల్ ఎన్నికలు మొత్తం మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ వెర్సెస్ ప్రస్తుత ఎమ్మెల్యే టిడిపి నాయకుడు అనగాని సత్యప్రసాద్ మధ్యనే జరిగిందని చెప్పాలి. ఈ ఇద్దరు నేతలు ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో తాడేపల్లి మున్సిపల్ ఎన్నికలు శాసనసభ ఎన్నికల కంటే వేడిగా జరిగాయి. ప్రతి వార్డు లోనూ నువ్వానేనా అన్నట్లు పోటీ ఏర్పడింది. గతంలో టీడీపీ చేతిలో ఉన్న రేపల్లె మున్సిపల్ చైర్మన్ స్థానాన్ని ఎలాగైనా సాధించాలన్న పట్టుదలతో అధికారపక్షం ఉంటే, దాన్ని నిలబెట్టుకునేందుకు టిడిపి నాయకులు శతవిధాలా ప్రయత్నించారు. 28 వార్డుల మున్సిపాలిటీలో దాదాపు 22 చోట్ల నువ్వానేనా అన్నట్లు పోరు సాగింది. మిగిలిన ఆరు వార్డుల్లో పూర్తిగా అధికార పక్షం గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఇరు పార్టీల అనుచరగణం వార్డుల వారీగా లెక్కలు వేసుకుని, ఒక్కొక్కరికి ఒక్కో బాధ్యత అప్పగించడంతో ఫలితం మీద తీవ్ర చర్చ నడుస్తోంది.
ఎలాగైనా సాధించాలని!
గత రెండు శాసనసభ ఎన్నికల్లో అనగాని సత్యప్రసాద్ వైఖరిపట్ల నియోజకవర్గ ప్రజల్లో ముఖ్యంగా రేపల్లి మున్సిపాలిటీ ప్రాంతంలో తీవ్రమైన వ్యతిరేకత కనిపిస్తోంది. 2014లో టీడీపీ అధికారంలో ఉన్నా స్థానిక ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఏమీ చేయలేక పోయరన్న అసహనం ప్రజల్లో ఉంది. 2019లో కొన్ని కారణాల వల్ల మళ్ళీ అనగాని మీద మోపిదేవి వెంకటరమణ స్వల్ప తేడాతో ఓడిపోయారు. రేపల్లె మున్సిపాలిటీ లో స్వల్ప మెజారిటీ మాత్రమే అనగానికి వచ్చింది. ప్రస్తుతం ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలతో ప్రజల్లో ఉన్న సానుకూలతను రేపల్లె మున్సిపాలిటీ లో స్పష్టంగా కనిపించింది. మాజీమంత్రి మోపిదేవి అన్ని వార్డుల్లో పర్యటించి, అభ్యర్థుల ఎంపికలోనూ అత్యంత జాగ్రత్తలు తీసుకున్నారు. సామాజిక రాజకీయ ఆర్థిక కోణాల వారీగా టికెట్లు ఇచ్చి బలమైన అభ్యర్థులను బరిలోకి దించారు. ఎలక్షన్ ప్రచారం లో, ఎన్నికల వేళ మోపిదేవి రేపల్లెలో ఉంటూ కీలకమైన సూచనలు ఇవ్వడం విజయావకాశాలను పెంచిందని చెప్పాలి. ఖచ్చితంగా ఇక్కడ ఇరవైకి పైబడిన సీట్లు గెలుస్తామని ధీమా అధికారపక్షం లో స్పష్టంగా కనిపిస్తోంది.
లోలోపల అసంతృప్తి!
గత మున్సిపల్ ఎన్నికల్లో 18 వార్డుల్లో గెలిచిన టీడీపీ మున్సిపల్ చైర్ పర్సన్ సీట్ అందుకుంది. ఇప్పుడు మళ్లీ దాన్ని ఎలాగైనా నిలబెట్టుకునేందుకు సిట్టింగ్ ఎమ్మెల్యే అనగాని తీవ్ర కసరత్తు చేశారు. అయితే పార్టీ టికెట్ల ఎంపికతో పాటు, ద్వితీయ శ్రేణి నాయకులు లో ఎక్కడా అసభ్యత కనిపించకపోవడం, ప్రచారం లోని కొన్ని వర్గాలు గొడవలు పడి ప్రచారానికి దూరంగా ఉండటం టీడీపీ కి ప్రతికూల అంశాలుగా మారాయి. ఇవి ఎన్నికల వేళ కూడా అధికార పార్టీ కు ప్లస్ అయ్యాయి. కొందరు టిడిపి నాయకులు అసంతృప్తి చెంది కొన్ని చోట్ల అధికార పక్షానికి సహకరించిన దాఖలాలు ఉన్నాయి. దీంతోపాటు ప్రభుత్వం మీద ఉన్న సానుకూలత, టిడిపి ఎమ్మెల్యే అనగాని మీద ఉన్న వ్యతిరేకత ఆ పార్టీకి చేటు తెస్తుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
Also Read : టెన్షన్లలో అభ్యర్థులు, ఫలితాల కోసం ఎదురుచూపులు
3వ వార్డ్ కీలకం!
రేపల్లి మున్సిపాలిటీలోని ఇరవై ఎనిమిది వార్డులు ఒక ఎత్తు అయితే మూడో వార్డు లో ఫలితం మాత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇక్కడ టిడిపి, వైసిపిలతో పాటు జనసేన అభ్యర్థి సైతం ప్రచారంలో కీలక మయ్యారు. రేపల్లె మున్సిపాలిటీలో జనసేన ప్రభావం తక్కువగా ఉన్నప్పటికీ మూడో వార్డు పరిధిలో మాత్రం సామాజిక వర్గ సమీకరణాల్లో భాగంగా జనసేన అభ్యర్థి కీలకం అవుతున్నారు. దీంతో పాటు మూడు పార్టీలకు చెందిన అభ్యర్థులు ఎన్నికల వేళ ఆర్థికంగానూ ఓటర్లను ప్రభావితం చేయగలిగారు అని పరిశీలకులు చెబుతున్నారు. మరోపక్క ఓటర్లు కూడా ఈ వార్డులో గుంభనంగా ఉన్నారు. దీంతో 2,500 వేల ఓట్లు ఉన్న ఈ వార్డ్ ఫలితం మీద అన్ని పార్టీల దృష్టి ఉంది. ఏది ఏమైనా రేపల్లె ఫలితం ఖచ్చితంగా ఎమ్మెల్యే అనగాని, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ మధ్య పోరు కిందనే అందరూ చూడటం విశేషం.