iDreamPost
android-app
ios-app

పెట్రోల్ ధర విషయంలో మోసం చేస్తోంది ఎవరు..?

పెట్రోల్ ధర విషయంలో మోసం చేస్తోంది ఎవరు..?

పెట్రోల్ ధరల విషయంలో ప్రజలను మోసం చేస్తోంది ఎవరు..? ఇప్పుడిదే అంశంపై దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. కరోనా వైరస్ నేపథ్యంలో రాష్ట్రాలు తీసుకోవాల్సిన,తీసుకుంటున్న చర్యలపై ముఖ్యమంత్రులందరితో ప్రధానమంత్రి నరేంద్రమోడీ బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అయితే కరోనా సమస్యలపైనే కాకుండా హఠాత్తుగా పెట్రోలు,డీజిల్ ధరల విషయంలో కొన్ని రాష్ట్రాలు ప్రజలను మోసం చేస్తున్నట్లు విరుచుకుపడ్డారు.

కరోనా సమస్యపై మోడీతో వీడియో కాన్ఫరెన్స్ కారణంగా ముఖ్యమంత్రులు కేవలం కరోనా సమస్యపైన మాత్రమే సమాచారంతో కాన్ఫరెన్స్ కు సిద్ధమయ్యారు. కానీ హఠాత్తుగా పెట్రోలు డీజిల్ ధరలు తగ్గించటంపైన కూడా మోడీ ఆరోపణలతో విరుచుకుపడటం తో అందరూ ఆశ్చర్యపోయారు.

పైగా పెట్రోల్ డీజల్ ధరల తగ్గింపులో కేంద్రం ఎక్సైజ్ ట్యాక్స్ తగ్గించినా రాష్ట్రాలు వ్యాట్ తగ్గించకపోవటంతోనే ధరలు పెరిగిపోతున్నాయంటూ ఆరోపించారు. రాష్ట్రాలు ధరలు తగ్గించకుండా జనాలను మోసం చేస్తున్నాయనటమే ఆశ్చర్యంగా ఉంది.

అంతర్జాతీయంగా బ్యారెల్ క్రూడాయిల్ ధరలు చాలా తక్కువగా ఉన్నపుడు కేంద్రం ధరలు ఏరోజూ తగ్గించలేదు. ఇదే సమయంలో క్రూడాయిల్ ధరలు పెరుగుతున్నపుడు మాత్రం దాని కారణంగా ఇక్కడ ధరలు పెంచేస్తోంది. నిజానికి ధరలను ఇష్టమొచ్చినట్లు పెంచుకుంటూ వెళుతున్న కేంద్రమే జనాలను మోసం చేస్తోంది. తాను పెంచుకుంటున్నదంతా పెంచేసి సంపాదించినంత సంపాదించేసుకుని ఇప్పుడు సంపాదించుకున్నది చాలు, ధరలు తగ్గించమని మోడీ సీఎంలకు చెప్పటమే విచిత్రంగా ఉంది.

ఇదే మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ హయాంలో ధరలు పెరిగిపోతున్నాయంటూ ఢిల్లీలో రచ్చ చేశారు. అప్పటితో పోల్చుకుంటే మోడీ హయాంలో ధరలు నూరుశాతం పెరిగిపోయాయి. ఇదే విషయాన్ని ప్రతిపక్షాలు ఎంతగా ప్రశ్నిస్తున్నా మోడీ సమాధానం చెప్పడంలేదు.