జ‌గ‌న్‌ది యుద్ధం, బాబుది ప‌ద్యం

యుద్ధం చేస్తున్న‌ప్పుడు ప‌ద్యం పాడ‌కూడ‌దు.
జ‌గ‌న్ యుద్ధం చేస్తున్నాడు,
చంద్ర‌బాబు ప‌ద్యం పాడుతున్నాడు.

యుద్ధం చేస్తున్న‌ప్పుడు రాజ‌కీయాలు మాట్లాడ‌కూడ‌దు.
జ‌గ‌న్ యుద్ధం చేస్తున్నాడు
బాబు రాజ‌కీయాలు మాట్లాడుతున్నాడు.

శ‌త్రువుకి శ‌త్రువు మ‌న మిత్రుడే కావ‌చ్చు, కానీ అది విప‌త్తులో కాదు.
జ‌గ‌న్‌కి క‌రోనా శ‌త్రువు.
క‌రోనాని కూడా మిత్ర అవ‌కాశంగా తీసుకునే బాబుని ఏమ‌నాలి?

ప్ర‌పంచం మీదికి ఒక శ‌త్రువు దాడి చేసింది. అంద‌రూ ఏదో ర‌కంగా దాంతో పోరాడుతున్నారు. బాబుకి ఇంట్లో కూచున్నా జ‌రుగుతుంది. జ‌గ‌న్‌కి జ‌ర‌గ‌దు. రోజూ కొన్ని వేల మందిని స‌మాయ‌త్తం చేయాలి. పోరాటంలో న‌డిపించాలి. కుప్ప కూలిపోతున్న ఆర్థిక వ్య‌వ‌స్థ‌ని ర‌క్షించుకోవాలి. పేద‌వాళ్ల‌కి ఇంత తిండి దొరికేలా చేయాలి. జ‌గ‌న్ యుద్ధం చేస్తున్నాడు. యుద్ధం అత‌నికి కొత్త‌కాదు.

ఇంత పెద్ద పోరాటంలో త‌ప్పులు జ‌రుగుతాయి. జ‌రిగి తీరుతాయి. ల‌క్ష‌ల మంది జీవితాల‌తో ముడిప‌డిన వైద్య ఉద్య‌మంలో త‌ప్పులు జ‌ర‌గ‌కుండా చూడ‌టానికి జ‌గ‌నేం దేవుడు కాదు.

శ‌త్రువు విశ్వ‌రూపం దేవుడికి కూడా తెలియ‌దు. అందుకే గుళ్లు మూసేసుకుని కూచున్నాడు. ధ‌ర్మాధ‌ర్మాలు బోధించి టీవీల నిండా క‌నిపించే స్వాములు, బాబాలు , పీఠాధిప‌తుల‌కీ తెలియ‌దు. అందుకే క‌న‌ప‌డ‌కుండా ఐసోలేష‌న్‌లో ఉన్నారు. అగ్ర‌రాజ్య‌మ‌ని విర్ర‌వీగే అమెరికాకి తెలియ‌దు. శవాల‌ని లెక్కేస్తూ వ‌ణుకుతూ ఉంది.

గొప్ప ఆరోగ్య వ్య‌వ‌స్థ క‌లిగి ఉన్న దేశాలే చేతులెత్తేస్తే మ‌రి ఆంధ్ర‌ప్ర‌దేశ్ స్థితి ఏంటి? విభ‌జ‌న‌తో క‌ష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని బాగు చేస్తాడ‌ని బాబుకి అధికారం ఇస్తే అమ‌రావ‌తి నాట‌కాన్ని ఐదేళ్లు ఫోక‌సింగ్ లైట్ల‌తో చూపించాడు. నాట‌కం అయిపోయింది. జ‌నం చీక‌టిని గుర్తించారు. ప్ర‌జ‌లు అధికారం ఇచ్చారు కానీ, బాబు మాత్రం ఖాళీ ఖ‌జానా ఇచ్చి వెళ్లాడు. అయినా ఏడాదిగా యుద్ధం చేస్తూనే ఉన్నాడు. యుద్ధం ఆయ‌న స్వ‌భావం.

ఈ విప‌త్తులో జ‌గ‌న్ ఎవ‌రినీ భ‌య‌పెట్ట‌లేదు. ట్రంప్ అంత‌టి వాడు అమెరికాలో ల‌క్ష మంది చ‌చ్చిపోతార‌ని బాధ్య‌త లేకుండా మాట్లాడుతూ ఉంటే జ‌గ‌న్ మొద‌టి నుంచి ప్ర‌జ‌ల‌కి ధైర్యం చెబుతూనే ఉన్నాడు.

“ఏమీ కాదు, ప‌రీక్ష‌లు చేయించుకోండి, జాగ్ర‌త్త‌గా ఉండండి, మ‌న ర‌క్ష‌ణ మ‌న చేతుల్లోనే ఉంది” అని అంటున్నాడే త‌ప్ప భ‌యానికి గురి చేయ‌డం లేదు.

ప్రాథ‌మిక ద‌శ నుంచే త‌న‌కున్న అన్ని వ‌న‌రుల‌ని స‌మీక‌రించుకుని వైద్యుల్ని సంసిద్ధం చేశాడు. వాలంటీర్ల వ్య‌వ‌స్థ‌ని అద్భుతంగా ఉప‌యోగించాడు. దాని ప్ర‌యోజ‌నం విప‌త్తు వేళ అంద‌రికీ అర్థ‌మైంది. ఆశా వ‌ర్క‌ర్లు, పోలీసులు అన్ని ప్ర‌భుత్వ విభాగాల‌ను స‌మీకృతం చేసి క‌రోనాతో యుద్ధం చేస్తున్నాడు.

వైర‌స్ గురించి ఎవ‌రూ క‌ల గ‌న‌లేదు. అందుకే ప్ర‌పంచంలో ఎక్క‌డా దానికి సంబంధించిన ర‌క్ష‌ణ ప‌రిక‌రాల ఉత్ప‌త్తి, పంపిణీ వేగ‌వంతంగా లేదు. మ‌రి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మాత్రం అవ‌న్నీ అందుబాటులో ఉండే అద్భుతం సాధ్య‌మా?

ఇప్పుడు స‌ర్దుకున్నాయి కానీ, తొలి ద‌శ‌లో వైద్యులు రిస్క్ తీసుకుని ప‌నిచేశారు. ప్ర‌పంచ‌మంతా ఇలాగే చేశారు. అందుకు వైద్య వృత్తికి మ‌నం జీవితాంతం కృత‌జ్ఞ‌త‌లు తెల‌పాలి. దేవుడు మ‌న‌కు ప్రాణాన్ని ఇచ్చాడో లేదో తెలియ‌దు కానీ, వైద్యుడు మాత్రం ప్రాణం పోస్తాడు. అందుకే అత‌ను క‌నిపించే దేవుడు.

అయితే ప్ర‌భుత్వం మీద ఉన్న ఒత్తిడిని అర్థం చేసుకోలేని ఒక వైద్యుడు , ఒక అధికారి నోరు జారారు. స‌స్పెన్ష‌న్‌కి గుర‌య్యారు. అసంతృప్తి అనేది క‌రోనాకి మించిన వైర‌స్‌. దాన్ని క‌ట్ట‌డి చేయ‌కపోతే అంద‌రికీ అంటుకుంటుంది. స‌స్పెన్ష‌న్ స‌రైన చ‌ర్యే.

కానీ దీన్ని కూడా రాజ‌కీయం చేశారు. ప్ర‌శ్నించ‌డం త‌ప్పా అన్నారు. ప్ర‌శ్నించ‌డానికి స‌మ‌యం సంద‌ర్భం ఉంటుంది. నీ ప్ర‌శ్న‌ల వ‌ల్ల వేల మందికి ప్ర‌యోజ‌నం కంటే న‌ష్ట‌మే ఎక్కువ జ‌రుగుతున్న‌ప్పుడు , అది తప్పే అవుతుంది.

క‌రోనా కాలంలో ప‌ని చేయ‌డం అంద‌రికీ కొత్తే. మ‌నం ఇంట్లో ఉండ‌టం కోసం పోలీసులు ఎర్ర‌టి ఎండ‌లో మాడుతున్నారు. ఇంట్లో భార్యాపిల్ల‌ల్ని కూడా చూడ్డం లేదు. పారిశుధ్య కార్మికులు వీధుల్లో తిరుగుతున్నారు. పాల‌నా యంత్రాంగాన్ని ప‌రుగులు పెట్టిస్తున్నాడు కాబ‌ట్టే జ‌గ‌న్ క‌రోనాని కంట్రోల్ చేయ‌గ‌లుగుతున్నాడు.

ఈ క‌ష్ట కాలంలో స‌హ‌కారం అందించ‌డం మ‌రిచిపోయి తెలుగుదేశం నాయ‌కులు పేప‌ర్ పులులుగా మారి విమ‌ర్శ‌లు చేస్తున్నారు. రాష్ట్రంలో వ‌ల‌స కూలీలు, దిక్కులేని వాళ్లు ల‌క్ష‌ల్లో ఉన్నారు. వాళ్లంద‌రికీ స్వ‌చ్ఛంద సంస్థ‌ల సాయంతో వైసీపీ నాయ‌కులు భోజ‌నం పెడుతున్నారు. వాళ్ల‌ని రోడ్ల మీద‌కి రాకూడ‌దంటే ఎలా? ఏర్పాట్లు చేయ‌కుండా ప్ర‌తి ఊళ్లో వంద‌ల మందికి భోజ‌నం పెట్ట‌డం సాధ్య‌మా? తెలుగుదేశం నాయ‌కుల్లాగా ఇల్ల‌లో కూచుంటే జ‌నం మాడిపోతారు.

ఒకాయ‌న జ‌గ‌న్ జ‌నాల్ని చంపేస్తాడ‌ని అంటాడు. చంపే వాడైతే ఒక‌టో తేదీ పింఛ‌న్‌, రేష‌న్ ఇస్తాడా? ఇంటికి వెయ్యి రూపాయలు ఇస్తాడా? వైసీపీ కార్య‌క‌ర్త‌లు వెయ్యి రూపాయ‌లు పంచుతున్నార‌ని విమ‌ర్శ‌. తిత్లీ తుపాను సాయాన్ని టీడీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పంచిన విష‌యాన్ని మ‌రిచిపోతే ఎలా?

అక్క‌డ‌క్క‌డ అజ్ఞానం కొద్ది వైసీపీ కార్య‌క‌ర్త‌లు వెయ్యి రూపాయిలు ఇచ్చిన మాట నిజ‌మే, అయినా వాళ్ల పిచ్చికాక‌పోతే , ఆ డ‌బ్బు వాళ్లు ఇవ్వ‌క పోయినా అది జ‌గ‌న్ ఇచ్చింద‌ని జ‌నం తెలుసుకోలేరా?

విజ‌య‌సాయిరెడ్డికి వైజాగ్‌లో ఏం ప‌ని అని ఇంకొకాయ‌న విమ‌ర్శిస్తాడు. సాయిరెడ్డి ద‌గ్గ‌రుండి ప‌నుల్ని వేగ‌వంతం చేయిస్తూ ప్ర‌జ‌ల‌కి ఇబ్బంది లేకుండా చూస్తున్నాడు త‌ప్ప , ఆయ‌న అక్క‌డుండి స‌ముద్రంలో గ‌వ్వ‌లు ఏర‌డం లేదు!

ఒక రాజ్య‌సభ స‌భ్యుడికి సంక్షోభ స‌మ‌యంలో ప్ర‌జ‌ల‌తో క‌లిసి ప‌నిచేసే హ‌క్కు లేదా? దాన్ని కూడా రాజ‌కీయంగా చూడ‌ట‌మేనా?

బైనాక్యులర్స్‌లో ద‌గ్గ‌ర వ‌స్తువులు దూరంగా , దూర‌పు వ‌స్తువులు ద‌గ్గ‌ర‌గా క‌నిపిస్తాయి. జ‌గ‌న్ చేసే మంచి ప‌నులు చెడ్డ‌విగా, చిన్న‌చిన్న లోపాలు పెద్ద‌విగా క‌నిపించే బైనాక్యుల‌ర్స్ చంద్ర‌బాబు వాడుతున్నాడు.

ఆయ‌నకి దృష్టి లోప‌మ‌ని ప్ర‌జ‌లు ఎప్పుడో గ్ర‌హించారు. మౌనం వ‌ల్ల మాన‌సిక శ‌క్తి పెరుగుతుంద‌ని యోగులు చెబుతారు. బాబు మౌనంగా ఉంటే ఆయ‌న‌కీ , ప్ర‌జ‌ల‌కీ మంచిది.

క‌రోనా కంటే మీ రాజ‌కీయ‌మే ప్ర‌మాద‌మ‌ని ప్ర‌జ‌లు గుర్తిస్తే అది మీకే హానిక‌రం.
మీ తాటాకు చ‌ప్ప‌ళ్ల‌కు బెద‌ర‌డానికి అవ‌త‌ల ఉండేది ఎవ‌రో మీకు తెలియంది కాదు.

జ‌గ‌న్ మీలా వెన్నుపోటుతో అధికారంలోకి రాలేదు.
వెన్నుపోట్లు త‌ట్టుకుని అధికారంలోకి వ‌చ్చిన వాడు.

ప‌ద్యం మీకు కొత్త కావ‌చ్చు
యుద్ధం జ‌గ‌న్‌కి కొత్త‌కాదు, తెలియంది కాదు. అది ల‌క్ష‌ణం.

Show comments