iDreamPost
iDreamPost
ఇప్పటి సినిమాల్లో హీరోలు ఉద్యోగం లేక ఖాళీగా ఉంటూ హీరోయిన్ ను ప్రేమిస్తూ సడన్ గా లైఫ్ లో సెటిలైపోయి చివర్లో సందేశం ఇచ్చేలా ఉంటాయి లేదా మల్టీ మిలియనీర్ గా కనిపిస్తూ హీరోయిజం చూపిస్తూ ఏదో ఒక కారణంతో సమాజానికి మంచి చేసేలా ప్రేక్షకులను మెప్పిస్తాయి. కథ ఏదైనా కథానాయకుడు ఖచ్చితంగా తెలివైన వాడే అయ్యుంటాడు. నేను లోకల్ లో నానిని చూసినా సరిలేరు నీకెవ్వరులో మహేష్ బాబుని చూసినా అందరి లక్షణం ఒకటే. అవతలి వాళ్ళ కంటే మహా మేధావులుగా ఉండటం.
అమాయకత్వం అనేది ఏ కోశానా కనపడదు. లోకం పోకడ తెలియని స్వచ్ఛమైన మనసుతో ఓ మనిషి ఉంటే ఎలా ఉంటుందో ఎవరూ చూపించే సాహసం చేయడం లేదు. కానీ కళాతపస్వి విశ్వనాధ్ గారు దాన్ని గతంలోనే సమర్ధవంతంగా నిరూపించారు. అదే 1986లో వచ్చిన స్వాతిముత్యం. పూర్ణోదయ బ్యానర్ మీద ఏడిద నాగేశ్వర్ రావు నిర్మించిన ఈ సినిమా అప్పట్లో సూపర్ హిట్ గా నిలిచి కమర్షియల్ గానూ ఘన విజయం అందుకుంది.
ఇందులో కమల్ హాసన్ పేరు శివయ్య. పోత పోసిన అమాయకత్వంతో మంచిచెడులకు తేడా తెలియని వ్యత్యాసంతో నాన్నమ్మతో కలిసి జీవిస్తూ ఉంటాడు. దీని వల్లే ఏ ఉద్యోగం లేక కాలం గడుపుతూ ఉంటాడు. ఆ సమయంలో రోజూ గుడికొచ్చి సేవ చేసే ఓ విధవతో పరిచయం కలుగుతుంది. ఆమెకో బిడ్డ ఉంటాడు. అనుకోకుండా ఆమెనే పెళ్ళిచేసుకుంటాడు శివయ్య. కడిగిన ముత్యంలా ఉండే భర్తలోని అమాయకత్వాన్ని సరిచేసే బాద్యత ఆమె తీసుకుంటుంది. ఇక్కడ అక్కడి నుంచి వీళ్ళ ప్రయాణం ఎలా సాగిందన్నదే స్వాతిముత్యం కథ.
శివయ్యగా కమల్ హాసన్ తన పాత్రకు ప్రాణ ప్రతిష్ట చేశారు. ఇంత అమాయకులు ఉంటారా అనిపించేలా ఆయన జీవించిన తీరు నభూతో నభవిష్యత్. అప్పటికే స్టార్ గా వెలుగొందుతున్న కమల్ ఇలాంటి పాత్ర చేయడం సాహసమే. కాని ఇప్పుడు చూస్తే ఏ హీరో ఇలాంటి ఆలోచన చేసేందుకు కూడా భయపడుతున్నారు. అఫ్కోర్స్ విశ్వనాథ్ లాంటి దర్శకులూ లేరనుకోండి. కాని ఎంతసేపూ నేలవిడిచి సాము చేసే హీరోలనే కాకుండా ఇలా నిజ జీవితంలోనూ మంచి మనుసుతో ఉండే అమాయకమైన పాత్రలు చేస్తే ఓ కొత్త ప్రయత్నం అనిపించుకుని ప్రేక్షకుల మెప్పు పొందొచ్చు. అలాంటి కథతో ఎవరైనా చేస్తే ఎంత బాగుంటుందో.