iDreamPost
android-app
ios-app

హిందీ సినిమాలకు మోక్షం దక్కేదెప్పుడో

  • Published Sep 12, 2021 | 6:57 AM Updated Updated Sep 12, 2021 | 6:57 AM
హిందీ సినిమాలకు మోక్షం దక్కేదెప్పుడో

థియేటర్లు తెరుచుకున్నప్పటికీ బాలీవుడ్ ఇంకా భయం గుప్పిట్లోనే ఉంది. నార్త్ ఆడియన్స్ మునుపటి లాగా థియేటర్లకు వచ్చేందుకు సిద్ధంగా కనిపించడం లేదు. మహారాష్ట్రలో సినిమా హాళ్ల మూసివేత కొనసాగడం విపరీతమైన నష్టాలను కలుగజేస్తోంది. రిలీజైన మూవీస్ కూడా మరీ గొప్ప ఫలితాలు అందుకోలేదు. బెల్ బాటమ్ బ్రేక్ ఈవెన్ టెస్ట్ పాస్ అయ్యింది కానీ అక్షయ్ కుమార్ కెరీర్ లోనే అతి తక్కువ వసూళ్లు వచ్చిన సినిమాగా పేరు తెచ్చుకుంది. అమితాబ్ బచ్చన్ ఇమ్రాన్ హష్మీల చెహరేకు రెండో రోజు నుంచే డెఫిషిట్లు మొదలయ్యాయి. దెబ్బకు ఇంకెవరు రిలీజుల సాహసం చేయలేకపోతున్నారు. ప్రభావం ఆ స్థాయిలో ఉంది మరి.

అందుకే సల్మాన్ ఖాన్ స్పెషల్ క్యామియో చేసిన అంతిమ్ అనే భారీ చిత్రాన్ని థియేటర్లలో పే పర్ వ్యూ మోడల్ ద్వారా ఓటిటిలో ఒకేసారి రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు. మల్టీ ప్లెక్సుల నుంచి వ్యతిరేకత వస్తుందనే అంచనా తుది నిర్ణయం ఇంకా ప్రకటించలేదు. మరోవైపు ప్రేక్షకులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మల్టీ స్టారర్ సూర్యవంశీ తాలూకు ఎలాంటి అప్ డేట్ బయటికి రావడం లేదు. ఇప్పటికే ఏడాదికి పైగా ఇది ల్యాబ్ లో మగ్గుతోంది. ఇండియా మొదటి సారి వరల్డ్ కప్ నేపధ్యాన్ని తీసుకుని రూపొందించిన 83 కూడా ఇదే పరిస్థితి. గంగుభాయ్ ఖట్వాడి లాంటి ఎన్నో భారీ బడ్జెట్ సినిమాలు ఇదే ఇబ్బందిని ఎదురుకుంటున్నాయి.

పోనీ అక్టోబర్ కైనా పరిస్థితి నార్మల్ అవుతుందా అంటే ఏమో చెప్పలేం అంటున్నారు విశ్లేషకులు. ఎందుకొచ్చిన తలనెప్పని ఆర్ఆర్ఆర్ నెల ముందు గానే తమ రిలీజ్ వాయిదాని అధికారికంగా ప్రకటించేసింది. అజయ్ దేవగన్ మైదాన్ అయినా ఆ డేట్ కి విడుదల చేస్తారా లేదా అనేది అనుమానమే. మరోవైపు హాలీవుడ్ సినిమాలు బాగానే ఆడుతున్నాయి కానీ వాటికి జరిగిన బిజినెస్ కు తగ్గట్టు కలెక్షన్లు లాభసాటిగా ఉంటున్నాయే తప్ప మరీ యాభై అరవై కోట్లేమీ రావడం లేదు. ఇకపై పరిణామాలు ఎవరి ఊహకు అందటం లేదు. ఒక్క టాలీవుడ్ లో మాత్రమే బాక్సాఫీస్ ఆశాజనకంగా ఉంది. మిగిలిన చోట్ల ఎడారిలో నీళ్లు వెతుక్కునే పనిలా ఉంది

Also Read : న్యాచురల్ స్టార్ కి పరీక్షా సమయం