iDreamPost
android-app
ios-app

పొత్తు లేకుండా ఎప్పుడు గెలిచారో చెప్పండి బాబూ?

  • Published Jan 07, 2022 | 12:17 PM Updated Updated Jan 07, 2022 | 12:17 PM
పొత్తు లేకుండా ఎప్పుడు గెలిచారో చెప్పండి బాబూ?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుకు ఒక్క వెన్నుపోటులోనే పేటెంట్‌ ఉందని అందరూ అనుకుంటారు. కానీ వాస్తవాల వక్రీకరణలోనూ ఆయనది అందెవేసిన చేయి. తిమ్మిని బమ్మిని చేసే పచ్చ మీడియా అండ ఉండడంతో తాను ఏం చెప్పినా జనం నమ్ముతారనేది ఆయన నమ్మకం. అందుకే పూటకో మాట, పేటకో అబద్ధం అన్నట్టు ఆయన రాజకీయం సాగుతుంటుంది. కుప్పం పర్యటనలో ఉన్న ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యలు దీన్నే రుజువు చేస్తున్నాయి. కుప్పం ఆస్పత్రిలో ఎన్టీఆర్‌ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆక్సిజన్‌ ప్లాంట్‌ను ఆయన శుక్రవారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ కుప్పంతో తనకు విడదీయరాని సంబంధం ఉందని అన్నారు. ఎన్నికల కోసం కుప్పం రాకున్నా ఏడు సార్లు గెలిపించారు అని చెప్పారు. ప్రజా సమస్యలపై పోరాడేవారిని ఈ ప్రభుత్వం వేధిస్తోందని ఆరోపించారు. వైఎస్సార్‌ సీపీ నేతలకు రాజకీయాలు తప్ప మరో ధ్యాస లేదు అని విమర్శించారు. వైఎస్సార్‌ సీపీ నేతలు చేసిన పొత్తుల వ్యాఖ్యలపైనా చంద్రబాబు స్పందించారు. పొత్తులు పెట్టుకుంటేనే తెలుగుదేశం పార్టీ గెలుస్తుందన్న వ్యాఖ్యలను ఖండించారు. పొత్తుల్లేకుండా ఎన్నోసార్లు గెలిచామని అలవోకగా ఒక బండ అబద్ధం ఆడేశారు.

Also Read : మీరు ఎవరికి , ఎప్పుడు , ఎంతమందికి నిరుద్యోగ భృతి కల్పించారు బాబూ

ఇదీ బాబుగారి పొత్తుల చరిత్ర..

టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీరామారావును 1995లో గద్దె దింపి తాను పగ్గాలు చేపట్టినప్పటి నుంచి జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో పొత్తులతోనే ఎన్నికలకు వెళ్లిన చరిత్ర చంద్రబాబుది. ఏఐడీఎంకే మద్దతు ఉప సంహరించుకోవడంతో వాజ్‌పేయి నాయకత్వంలోని ఎన్‌ఏడీ సంకీర్ణ ప్రభుత్వం కూలిపోవడంతో 1999లో లోక్‌సభకు ఇటు ఆంధ్రప్రదేశ్‌ శాసనసభకు ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో బీజేపీతో పొత్తుతో టీడీపీ ఎన్నికలకు వెళ్లింది. అంతకుముందు జరిగిన కార్గిల్‌ యుద్ధ విజయంతో వాజ్‌పేయి పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. ఆయన గ్లామర్‌ను ఉపయోగించుకుని ఎన్నికల గండం గట్టెక్కాలనే ఉద్ధేశంతో చంద్రబాబు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. ఆ విధంగా ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచినా తన నాయకత్వంలో టీడీపీపై పెరిగిన ప్రజాగ్రహంతో ఓడిపోకుండా జాగ్రత్త పడ్డారు. అలిపిరి ఘటనతో తనకు సానుభూతి వెల్లువెత్తుతుందని భావించి ముందస్తుకు వెళ్లిన చంద్రబాబు 2004 ఎన్నికల్లోనూ బీజేపీతోనూ పొత్తును కొనసాగించారు.

ఆయన అంచనా దెబ్బతిని టీడీపీతో పాటు, కేంద్రంలోని బీజేపీ కూడా ఆ ఎన్నికల్లో ఓడిపోయాయి..  కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. 2009లో మహా కూటమి పేరుతో కమ్యూనిస్టులు, టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకున్నారు. అయితే వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రభుత్వ పాలనకు ఓటేసిన జనం ఆ ఎన్నికల్లో మహాకూటమిని ఓడించారు. ఆంధ్రప్రదేశ్‌ విభజన అనంతరం 2014లో జరిగిన ఎన్నికల్లో మళ్లీ బీజేపీ, జనసేనతో టీడీపీ పొత్తు పెట్టుకుంది. ఆ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు, ఇటు పవన్‌కల్యాణ్‌ సినీ గ్లామర్‌ కలసి రావడంతో చంద్రబాబు గెలవగలిగారు. ఇక 2019లో ఎన్నికల్లో తెలుగుదేశం చరిత్రలోనే మొట్టమొదటిసారిగా పొత్తుల్లేకుండా ఎన్నికలకు వెళ్లారు. అయితే జనసేనతో లోపాయికారీ పొత్తు కొనసాగించారు. పవన్‌కల్యాణ్‌ పోటీచేసిన గాజువాక, భీమవరంలో చంద్రబాబు అసలు టీడీపీ తరఫున ప్రచారమే చేయలేదు. అలాగే బాబు పోటీచేసిన కుప్పంలోనూ, లోకేశ్‌ పోటీ చేసిన మంగళగిరిలోనూ పవన్‌కల్యాణ్‌ జనసేన తరఫున ప్రచారం చేయలేదు. ఆ విధంగా రహస్య పొత్తు కొనసాగినా టీడీపీ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయి కేవలం 23 సీట్లకే పరిమితం అయింది.

Also Read : కొడాలి కాన్ఫిడెన్స్‌కు కారణమేంటి..?

2018లో ఏకంగా కాంగ్రెస్‌తోనే పొత్తు

కాంగ్రెస్‌ వ్యతిరేక వైఖరితో, ఆత్మ గౌరవ నినాదంతో ఆవిర్భవించిన తెలుగుదేశం ఏకంగా ఆ పార్టీతోనే పొత్తు పెట్టుకునేలా అవకాశవాద రాజకీయం నడిపిన చాణక్యం చంద్రబాబుది. తెలంగాణలో 2018లో వచ్చిన ముందస్తు ఎన్నికల్లో అక్కడి కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నారు. అదే సంవత్సరం కొన్ని రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ తో చెట్టాపట్టాలేసుకొని తిరిగిన చంద్రబాబు సోనియా, రాహుల్‌గాంధీలతో వేదికలను కూడా పంచుకున్నారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి ఆర్థికంగా కూడా చంద్రబాబు అండదండలు అందించారనే విమర్శలు ఎదుర్కొన్నారు. ఇలా ఒకసారి  బీజేపీ, మరోసారి కాంగ్రెస్‌, ఇంకోసారి కమ్యూనిస్టులు, జనసేన పార్టీలతో ప్రతి ఎన్నికల్లో పొత్తులతోనే చంద్రబాబు గట్టెక్కారు. వాస్తవాలు ఇలా ఉంటే పొత్తుల్లేకుండా ఎన్నోసార్లు గెలిచామని చెప్పడం ఆయనకే చెల్లింది.

వైఎస్సార్‌ సీపీ నేతలు రాజకీయాలు చేస్తున్నారట..

ఎప్పుడూ ఏదో అంశంపై రాజకీయం చేసి వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వాన్ని బదనాం చేయాలని కుట్ర పూరితంగా వ్యవహరించే చంద్రబాబు వైఎస్సార్‌ సీపీ నేతలకు రాజకీయాలు తప్ప మరో ధ్యాస లేదంటూ వ్యాఖ్యానించడం మరీ విచిత్రం. ప్రజా సంక్షేమంతో జనాదరణ పొందిన ప్రభుత్వంపై వాస్తవ విరుద్ధమైన ఆరోపణలతో నిత్యం దాడి చేస్తూ బాబు రాజకీయం చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. తాను అడ్డగోలుగా వ్యవహరిస్తూ, పరస్పర విరుద్దమైన వ్యాఖ్యలు చేస్తూ ఎదుటి పక్షంపై దుమ్మెత్తిపోయడం బాబు నైజం. అందుకే చంద్రబాబు కళ్లార్పకుండా అబద్ధాలు చెబుతాడని, నిజం చెబితే తల వేయి వక్కలవుతుందని మునిశాపం ఆయనకు ఉందని దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి అనేవారు.!

Also Read : చంద్ర‌బాబు గెలవడని పెద్దిరెడ్డికి ఎందుకంత కాన్ఫిడెన్స్.. తాజా వ్యాఖ్య‌లు దేనికి సంకేతం?