iDreamPost
iDreamPost
ఏదైనా రాజకీయ పార్టీకి ఒక విధానం ఉంటుంది. పరిస్థితులు మారితే ప్రజలకు సమాధానం చెప్పి తమ విధానం మార్చుకోవడంలో పెద్ద విశేషం లేదు. కానీ టీడీపీ వాటికి విరుద్ధం. ఎప్పటికయ్యది ఆ మాటలాడుతూ తప్పించుకు తిరుగువాడు ధన్యుడనే నానుడి బాగా వంటి పట్టించుకున్నట్టు వ్యవహరిస్తుంది. తాజాగా కృష్ణా జలాల వివాదం కూడా అంతే. అసలు సమస్య ఏపీ, తెలంగాణా మధ్య. నిజంగా విమర్శించాలనుకుంటే శ్రీశైలం నుంచి విద్యుత్పాదన పేరుతో కృష్ణా జలాలను నిబంధనలకు విరుద్ధంగా వినియోగిస్తున్న తెలంగాణా సర్కారుని విమర్శించారు. కేసీఆర్ తీరుని తప్పుబట్టాలి. ఏపీ ప్రభుత్వానికి అండగా నిలబడి, రాష్ట్ర హక్కుల పరిరక్షణకు తోడ్పడాలి. రాయలసీమ సాగునీరు తరలించడానికి సహకరించాలి.
కానీ తెలుగుదేశం నేతల తీరు తద్విరుద్ధం. తెలంగాణా ప్రభుత్వ నేతలు హద్దులు మీరి విమర్శిస్తున్నా, సమన్వయంతో సమస్యను పరిష్కరించాలని చూస్తున్న ఏపీ ప్రభుత్వాన్ని విమర్శించడానికే టీడీపీ చూస్తోంది. రాష్ట్ర హక్కులను హరిస్తున్న కేసీఆర్ మీద ఒక్క మాట కూడా అనడానికి సిద్ధంకాలేకపోతోంది. కృష్ణా జలాలను తరలిస్తున్న వారిని పల్లెత్తుమాట అనకుండా, దానిని నిరోధించడానికి అవకాశం ఉన్న అన్నిమార్గాలను అన్వేషిస్తున్న జగన్ సర్కారుని నిందిస్తోంది. నిజానికి ఏపీ ప్రభుత్వం నేరుగా కేఆర్ఎంబీకి ఫిర్యాదు చేసింది. కేంద్ర జలశక్తి శాఖతో మాట్లాడుతోంది. నదీ జలాల వినియోగంలో నిబంధనలు పాటించాలని డిమాండ్ చేస్తూ ఫిర్యాదులతో ప్రయత్నిస్తోంది. దానిని సమర్థిస్తూ తెలంగాణా ప్రభుత్వ వైఖరిని తప్పుబడితే ఏపీకి ఉపయోగం. కానీ బాబు అండ్ కో మాత్రం ఏపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ తెలంగాణాని తప్పుబట్టడానికి సిద్దం కాలేకపోవడం చూస్తుంటే వారి చిత్తశుద్ది పట్ల అనుమానం కలుగుతోంది.
Also Read : పోలవరం ముంపు సమస్యకు పరిష్కారం చూపిన జగన్ సర్కార్
ఇక రాయలసీమల ఎత్తిపోతల పథకాన్ని ప్రతిపాదించి, దాని టెండర్ల ప్రక్రియ కూడా పూర్తి చేసి, నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టిన జగన్ ఏపీ ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారంటూ కూడా టీడీపీ వ్యాఖ్యానించడం విడ్డూరంగా ఉంది. ఐదేళ్ల చంద్రబాబు ప్రభుత్వంలో ఎన్నడూ శ్రీశైలం జలాల కోసం పోరాడిన దాఖలాలే లేవు. చివరకు ఆయన హయంలో నీటి లభ్యత తక్కువ ఉన్న సమయంలోనూ తెలంగాణా విద్యుత్సాదన చేస్తున్నా చూసీ చూడనట్టే వ్యవహరించారు. అదేసమయంలో రాయలసీమకు కేటాయించిన నీటిని తరలించేందుకు అవసరమైన మార్గాలు అన్వేషించడానికి కూడా సిద్ధం కాలేదు.
ఇప్పుడు జగన్ రాయలసీమ వాటాగా వచ్చిన నికర జలాలను తరలించేందకు రాయలసీమ లిఫ్ట్ ని ప్రతిపాదిస్తే దానిని తెలంగాణా అడ్డుకోవాలని చూస్తోంది. అనుమతులు పేరుతో రాజకీయ ప్రహసనం నడుపుతోంది. దానిని నిరోధించాల్సిన టీడీపీ విచిత్రంగా రాయలసీమ లిఫ్ట్ కోసం ప్రయత్నిస్తున్న జగన్ ని తప్పుబట్టాలని చూస్తోంది. అంతేగాకుండా తన హయంలో ఎన్నడూ కృష్ణా జలాల పరిరక్షణ పట్టని చంద్రబాబు ఇప్పుడు వాటి కోసం జగన్ వివిధ మార్గాల్లో ముందుకెళుతుంటే సహకరించకపోగా అడ్డుపుల్ల వేసే ప్రయత్నం చేస్తున్నారు. రాయలసీమ సాగునీటి సమస్యల నుంచి గట్టెక్కేందుకు జగన్ యత్నిస్తుంటే, తెలంగాణా ప్రయత్నాలకు తోడు చంద్రబాబు కూడా రాష్ట్ర ప్రయోజనాలకు తిలోదకాలివ్వడమే విచిత్రంగా మారింది.
Also Read : నీళ్లు వృధాగా పోయినా ఫర్వాలేదా..? విద్యుత్ ఉత్పత్తే ముఖ్యమా..?
పైగా జగన్ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడలేకపోతున్నారంటూ విమర్శిస్తూనే, కేసీఆర్, జగన్ మధ్య విమర్శలు రాజకీయ డ్రామాగా చెబుతున్నారు. మరి నిజంగా రాజకీయ డ్రామా అయితే రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టడం అనే ప్రశ్నే ఉండదు కదా. కేసీఆర్ విమర్శలన్నీ రాబోయే ఉప ఎన్నికల కోసమే అయితే జగన్ అదే స్థాయిలో నోరు పారేసుకోవడం లేదని విమర్శలెందుకు. మొత్తంగా చూస్తే టీడీపీ తాను టీఆర్ఎస్ సర్కారు పట్ల భయంతో ఉన్న వాస్తవాన్ని ప్రజల ముందు చాటుకుంటున్నట్టు స్పష్టమవుతోంది.