iDreamPost
android-app
ios-app

మాజీ ఎమ్మెల్యే ఉదంతం.. వైసీపీ నేతల్లో ఆనందం..

మాజీ ఎమ్మెల్యే ఉదంతం.. వైసీపీ నేతల్లో ఆనందం..

ఎక్కడ అధికారం ఉంటే అక్కడ ఉండే నేతలకు కొదవే లేదు. ఏపీలోనూ ఈ తరహా ప్రజా ప్రతినిధులు మనకు కనిపిస్తుంటారు. అధికారం కోసం పార్టీలు ఫిరాయిస్తుంటారు. పార్టీ ఏదైనా తాము మాత్రం పదవుల్లో ఉండాలనుకుంటారు. అయితే ఈ తరహా నేతలకు కాలం చెల్లినట్లే కనిపిస్తోంది. ఏపీ రాజకీయాల్లో సరికొత్త విధానానికి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తెరతీసినట్లు ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మాజీ ఎమ్మెల్యే డేవిడ్‌ రాజు తాజాగా ఉదంతం ద్వారా స్పష్టమవుతోంది.

డేవిడ్‌ రాజు వైసీపీని వీడుతున్నట్లు ప్రకటించారు. చంద్రబాబు ఒప్పుకుంటే టీడీపీలో చేరతానంటూ మాట్లాడారు. ఇది విన్న వారికి.. అసలు డేవిడ్‌ రాజు వైసీపీలో మళ్లీ ఎప్పుడు చేరాడనే సందేహం వచ్చింది. వైసీపీ స్థాపనకు ముందు డేవిడ్‌రాజు టీడీపీ తరఫున ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత వైసీపీ స్థాపన తర్వాత వైసీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే టీడీపీ అధికారంలోకి రావడంతో.. ఆ పార్టీలోకి ఫిరాయించారు. అభివృద్ధిని చూసి చేరుతున్నానంటూ.. చంద్రబాబు కాళ్లకు మొక్కి టీడీపీలో చేరారు. అయితే ఎన్నికలకు నెల రోజుల ముందు ఆయన వైసీపీలో చేరారట. ఈ విషయం ప్రకాశం జిల్లా వాసులకు కూడా తెలియదు.

అయితే తాజాగా ఆయన వైసీపీని వీడుతున్నట్లు ప్రకటించారు. దీని వెనుక అసలు కథ ఏమిటనేది మంత్రి బాలినేని మాటల ద్వారా అర్థమవుతోంది. విలేకర్లు అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. వైసీపీలో పని చేసే వారికే ఆదరణ ఉంటుంది. పార్టీలు మారుతూ పదవులు కావాలంటే ఇచ్చే పరిస్థితి లేదని మంత్రి బాలినేని డేవిడ్‌ రాజును ఉద్దేశించి మాట్లాడారు. వైసీపీలో ఎమ్మెల్యేగా గెలిచిన డేవిడ్‌ రాజు టీడీపీలో కి వెళ్లి మళ్లీ వైసీపీలోకి ఎప్పుడు వచ్చారో కూడా తెలియదని బాలినేని అనడం గమనార్హం. బాలినేని వ్యాఖ్యల ద్వారా వైసీపీ నేతలకు ఒక విషయం స్పష్టమైంది. పార్టీలో ఉన్న తమకు సమయం వచ్చినప్పుడు మంచి అవకాశాలు లభిస్తాయి. ఎన్నికలకు ముందో, తర్వాతో ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి మాత్రం తమ కన్నా ఉన్నతి దక్కదనే విషయం మాత్రం వైసీపీ శ్రేణులకు బాలినేని వ్యాఖ్యల ద్వారా అవగతమవుతోంది. పార్టీలో ఆది నుంచి ఉండి కష్టపడిన వారికి ఈ అంశం ఆనందం కలిగిస్తోంది. డేవిడ్‌ రాజు ఉదంతంతో వైసీపీ శ్రేణులు జోష్‌మీద ఉన్నాయి.

ఇక డేవిడ్‌ రాజు పరిస్థితి రెంటకీ చెడ్డ రేవడిలా తయారయ్యే పరిస్థితులు ఏర్పడబోతున్నాయి. టీడీపీలో చేరతానంటూ ఆయన చేసిన ప్రకటనను స్థానిక టీడీపీ నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. డేవిడ్‌ రాజు నాయకత్వాన్ని ఒప్పుకోబోమంటూ స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు సమావేశం పెట్టుకుని మరీ తీర్మానించుకున్నారు. పార్టీలో ఉన్న వారికే నియోజకవర్గ బాధ్యతలు ఇవ్వాలని, పార్టీలు మారే వారికి ఇస్తే ఒప్పుకోబోమని డేవిడ్‌ రాజును ఉద్దేశించి టీడీపీ శ్రేణులు ఆ పార్టీ అధినాయకులకు సందేశం ఇస్తున్నారు. ఈ పరిణామాలతో డేవిడ్‌ రాజు రాజకీయ భవిష్యత్‌ ఎలా ఉంటుందో వేచి చూడాలి.