iDreamPost
android-app
ios-app

పురంధేశ్వ‌రి ప్లాన్ ఏంటి..?

పురంధేశ్వ‌రి ప్లాన్ ఏంటి..?

సంక్షేమ ప‌థ‌కాల అమ‌లులో జెట్ స్పీడ్ తో దూసుకెళ్తున్న జ‌గ‌న్ ప్ర‌భుత్వ వేగంలో చాలా మంది సీనియ‌ర్ నేత‌ల ప్ర‌స్తావ‌న అంతంత మాత్రంగానే ఉంటోంది. అంత‌కు ముందు వ‌ర‌కూ ప్ర‌ముఖంగా హ‌ల్ చ‌ల్ చేసిన నేతల్లో కొంత మంది స్త‌బ్దుగా ఉంటున్నారు. వారిలో ఒక‌రు టీడీపీకి చెందిన‌ గంటా శ్రీ‌నివాస‌రావు కాగా.. మ‌రొక‌రు బీజేపీకి చెందిన ద‌గ్గుబాటి పురంధేశ్వ‌రి. ఇద్దరూ విశాఖ జిల్లాతో అనుబంధం ఉన్న నేత‌లే. స్టీల్ ప్లాంట్ ప్రైవైటీక‌ర‌ణ ద్వారా ఇప్పుడు మ‌ళ్లీ వెలుగులోకి వ‌చ్చారు. ప్రైవేటీక‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా గంటా ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేయ‌గా.. బీజేపీలో కీల‌క స్థానంలో ఉండ‌డంతో పురంధేశ్వ‌రి ఢిల్లీ పెద్ద‌ల‌తో మాట్లాడి స్టీల్ ప్లాంట్ పై కీల‌క నిర్ణ‌యం తీసుకుంటాన‌ని ప్ర‌క‌టించారు. జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి హోదా ద‌క్క‌క ముందు పురంధేశ్వ‌రి కూడా పార్టీ మార‌తారంటూ ప్ర‌చారం జ‌రిగింది. లేదా నియోజ‌క‌వ‌ర్గం మారే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. కేంద్రం త‌న నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకోక‌పోతే ఆమె రాజ‌కీయ భ‌విత‌వ్యం ఏంటి..? అనేది మ‌రోసారి చ‌ర్చ జ‌రుగుతోంది.

తండ్రి నంద‌మూరి తార‌క రామారావు పెట్టిన తెలుగుదేశం పార్టీతో రాజ‌కీయ ప్రస్థానం ప్రారంభించిన పురంధేశ్వరి ఎన్టీఆర్ అనంత‌రం చంద్రబాబుతో రాజకీయ విభేదాల కారణంగా కాంగ్రెస్ దిశగా కదిలారు. 2004లో దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురంధీశ్వరి దంపతులు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ ఎన్నికల్లో పర్చూరు ఎమ్మెల్యేగా వెంకటేశ్వరరావు గెలుపొందగా, బాపట్ల ఎంపీగా పురంధీశ్వరి గెలుపొంది కేంద్ర మంత్రి ప‌ద‌వి పొందారు. ఆతర్వాత జరిగిన 2009 ఎన్నికల్లో పర్చూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా దగ్గుబాటి వెంకటేశ్వరరావు గెలవగా, పురంధేశ్వరి విశాఖపట్నం ఎంపీగా పోటీ చేసి గెలుపొంది కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి అయ్యారు. రాష్ట్ర విభజన అనంతరం మారిన రాజకీయ స‌మీక‌ర‌ణాల‌తో ఆమె పార్టీ మారారు. 2014లో బీజేపీలో చేరిన పురంధేశ్వరి రాజంపేట నుంచి లోకసభకు పోటీ చేశారు. కానీ ఇక్కడి నుంచి ఆమె ఓడిపోయారు. 2014లో టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేశాయి. పొత్తు నేపథ్యంలో చంద్రబాబు తో కలిసి పోటీ చేయాల్సి వచ్చింది. గ‌త లోక్ స‌భ ఎన్నిక‌ల్లో విశాఖ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అప్ప‌టి నుంచీ ఆమె రాజ‌కీయ జీవితంలో స్పీడు త‌గ్గింది. అనంత‌రం గ‌తేడాది చివ‌ర‌లో జ‌రిగిన బీజేపీ కార్య‌వ‌ర్గ కూర్పులో ఆమెకు జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి హోదా క‌ల్పించారు.

అయితే అంత‌కు ముందు ఆమె వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తుంద‌నే ప్ర‌చారం ముమ్మ‌రంగా సాగింది. ఇందుకు ప‌లు కార‌ణాలు వెలువ‌డ్డాయి. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో విజయవాడ ఎంపీగా వైసీపీ నుంచి పోటీ చేయ‌డానికి ఆమె ఆస‌క్తి చూపుతున్నార‌ని, త‌న కొడుకు పొలిటికల్ ఎంట్రీ కోసం ఆమె ఈ నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశాలు ఉన్నాయ‌ని ప్ర‌చారం జ‌రిగింది. కొడుకును పరుచూరు నియోజకవర్గం నుంచీ పోటీ చేయించాల‌నే ఉద్దేశం ఉంది. గతంలో అక్కడ్నుంచీ దగ్గుబాటి వేంకటేశ్వరరావు పోటీ చేసి గెలిచారు. అయితే, ఇప్పుడు తమ అబ్బాయిని పరుచూరు నుంచి పోటికి దింపాలంటే బలమైన పార్టీ కావాలి. ఏపీలో అలాంటి పార్టీ జగన్ పార్టీనే. అందుకే, పురంధేశ్వరి తాను బీజేపీ వదిలి వైసీపీలోకి మారి, కొడుకుని కూడా ఫ్యాన్ గుర్తుపై పోటీ చేయించాలని భావిస్తున్నార‌ని వార్త‌లు వెల్లువెత్తాయి. అలాగే ఏపీ బీజేపీ అధ్య‌క్షుడి ప‌ద‌విని ఆమె క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌కు ముందు నుంచే ఆశిస్తున్నారు. కానీ ఆ అవ‌కాశం ద‌క్క‌లేదు. ఆమె పార్టీ మారేందుకు వ‌స్తున్న వార్త‌లో అదీ ఓ కార‌ణంగా ఉండేది. అయితే జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి అయ్యాక పార్టీ మార‌తార‌నే వార్త‌లు త‌గ్గుముఖం ప‌ట్టాయి.

పార్టీ ప‌రంగా మంచి హోదాలోనే ఉన్న‌ప్ప‌టికీ భ‌విష్య‌త్ లో ప‌ద‌వులు పొందాలంటే ఇప్ప‌టికైతే బీజేపీ నుంచి అంత ఈజీ కాదు. దీనికి తోడు కేంద్రం తీసుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ నిర్ణ‌యం ఆ పార్టీ నేత‌ల‌కు శ‌రాగాత‌మే. అందుకే ఎటూ క‌క్క‌లేక‌.. మింగ‌లేక ఉంటున్నారు. దీనిపై పురంధేశ్వ‌రి మాత్రం స్పందించారు. విశాఖపట్నం ఉక్కు కర్మాగారం విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలను కేంద్ర ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో వివరిస్తానని వెల్లడించారు. విశాఖ ఉక్కుపై ప్రజాభిప్రాయాన్ని బీజేపీ పెద్దల దృష్టికి తీసుకెళతామని తెలిపారు. ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసిన తర్వాతనే తమకు తెలిసిందని వ్యాఖ్యానించారు. అంతకు ముందు ఈ విషయం తెలియదని వెల్లడించారు. కేంద్రం త‌న నిర్ణయాన్ని వెన‌క్కి తీసుకుంటుందా..? తీసుకోక‌పోతే పురంధేశ్వ‌రి ప్లాన్ ఏంటి..? ఎప్ప‌టి నుంచో ప్ర‌చారంలో ఉన్న‌ట్లుగా పార్టీ మార‌తారా..? లేదా కుమారుడికి లైన్ క్లియ‌ర్ చేయ‌డానికి ఏమైనా కీల‌క నిర్ణ‌యం తీసుకుంటారా..? అనే ప్ర‌శ్న‌లు త‌లెత్తుతున్నాయి.