రాజధాని మార్పుకు సంబంధించి ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకోనుంది. ఈ తరుణంలో ఈనెల 20న అసెంబ్లీ, 21, 22 న ఉభయ సభలను సమావేశపర్చాలని నిర్ణయించిన ప్రభుత్వం దీనికి సంభందిచిన సమాచారాన్ని అటు అసెంబ్లీ ఇటు శాసనమండలి సభ్యులకు అధికారికంగా తెలియచేసింది.
ఈ సమావేశాల్లోనే ప్రభుత్వం రాజధాని మార్పునకు సంబంధించి బిల్లును అసెంబ్లిలో ప్రవేశ పెట్టనుందని ప్రచారం జరుగుతోంది. దీనిలో భాగంగా గతంలో అసెంబ్లీ ఆమోదించిన సీఆర్డీయే చట్టాన్ని రద్దు చేయడం, ఆ స్థానంలో పాత వీజీటీఎం చట్టాన్ని తీసుకురావడం లేదా సీఆర్డీఏ చట్టానికే కొన్ని సవరణలు ప్రతిపాదించవచ్చని ఇదే సమయంలో నూతన ప్రాంతీయ అభివృద్ధి మండళ్లు ఏర్పాటు చేసే బిల్లులను సభలో ప్రవేశపెడుతుందని అంటున్నారు. అయితే మూడు రాజధానుల అంశం ఈ బిల్లులోనే పెడతారా లేక సీఆర్డీయే చట్టం సవరణకే పరిమితమవుతారా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.
ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం బిల్లు ఎలా పెట్టినా అసెంబ్లీలో వైసీపీకి పూర్తి మెజారిటీ ఉండటంతో అక్కడ తేలికగా ఆమోదం పొందే అవకాశం ఉంది. అయితే శాసన మండలి విషయానికి వస్తే శాసన మండలిలో మొత్తం 58 స్థానాలకు గాను మాగుంట శ్రీనివాసరెడ్డి రాజీనామాతో ఇటీవల ఖాళీ అయిన స్థానంతో కలిపి మూడు కౌన్సిల్ స్థానాలు ఖాళీ గా ఉండగా ప్రస్తుతం మండలిలో ఉన్న బలాబలాల ఆధారంగా మిగిలిన 55మంది కౌన్సిల్ సభ్యుల్లో వైసీపీకి కేవలం తొమ్మిది మందే ఉన్నారు. మండలి చైర్మన్ ని మినహాయించి టీడీపీకి గవర్నర్ నియమించిన నామినేటేడ్ సభ్యులతో కలిపి మొత్తం 32 మంది ఉండగా, ఇతర పార్టీలైన సిపియం అనుబంధ పీడీఎఫ్ కు ఐదుగురు, బీజేపీకి ముగ్గురు, కాంగ్రెస్ పార్టీకి ఒకరు (తాడిపట్ల రత్నా భాయ్), టీచర్స్ కోటాలో ఎన్నికైన ముగ్గురు ఇండిపెండెంట్లు ఉన్నారు.
అయితే మండలిలో టీడీపీకి కొంత స్పష్టమైన మెజారిటీ కనబడుతున్నప్పటికీ ఇటీవల ఆ పార్టీలో చోటు చేసుకున్న పరిణామాలు గమనిస్తే శాసనమండలిలో ఉన్న తెలుగుదేశం సభ్యులు ఎంత మంది ఆ పార్టీకి అనుకూలంగా ఓటు వేస్తారో చెప్పలేము.ఉదాహరకి నారా లోకేష్, యనమల రామకృష్ణుడు, బాబు రాజేంద్ర ప్రసాద్, బుద్దా వెంకన్న, టిడి జనార్దన్ లాంటి వారు తప్ప మిగిలిన శాసనమండలి సభ్యుల్లో ఆ పార్టీకి ఎంతమంది ఓటు వేస్తారో చెప్పలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రానున్న రెండు రోజుల్లో రాజధాని కి సంబందించిన కీలక బిల్లుల్ని తీర్మానాలని అసెంబ్లీ లో పెట్టనున్న నేపథ్యంలో తమకు అంతగా మెజారిటీ లేని శాసనమండలిలో ఎలా వ్యవహరిస్తోంది అనే దానిపై ప్రస్తుతం రకరకాల కధనాలు ప్రచారంలో ఉన్నప్పటికీ ఈ సమస్య నుండి నుండి బయటపడడానికి ప్రభుత్వం వద్ద అనేక ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు సిద్ధంగా వున్నాయి.
అయితే ఇదే సమయంలో రాష్ట్ర శాసనమండలి యొక్క స్వరూపం, దాని అధికారాలు విధులు, పరిమితులు చూస్తే కేంద్రంలో ఎగువసభ రాజ్యసభ వున్నట్లే కొన్ని రాష్ట్రాల్లో కూడా విధానపరిషత్ పేరుతొ ఎగువ సభలను ఏర్పాటు చేశారు. అయితే ఈ విధాన పరిషత్ ఏర్పాటుకి సంబంధించి భారత రాజ్యాంగంలోని 168 వ అధికరణ ప్రకారం ఆ రాష్ట్ర అసెంబ్లీలో విధాన పరిషత్ ఏర్పాటుకు తీర్మానం చేసి ఆ తీర్మానాన్ని పార్లమెంట్ లోని ఉభయ సభలు ఆమోదించిన తర్వాత ఆ తీర్మానానికి రాష్ట్రపతికి ఆమోద ముద్రతో విధానం పరిషత్ ని ఏర్పాటు చెయ్యవచ్చు. అయితే రాజ్యాంగంలోని 171 వ అధికరణ ప్రకారం విధాన పరిషత్ సభ్యుల సంఖ్య రాష్ట్ర అసెంబ్లీలో సభ్యుల సంఖ్యలో మూడవ వంతు (1/3) సభ్యుల సంఖ్యకు మించరాదు. విధాన పరిషత్ సభ్యుల్లో స్థానిక సంస్థల కోటాలో 1/3 వంతు సభ్యులని , ఎమ్మెల్యేల కోటాలో 1/3 వంతు సభ్యులని, ఉపాధ్యాయుల కోటాలో 1/12 వంతు సభ్యులను, పట్టభద్రుల కోటాలో 1/12 వంతు సభ్యులను, మిగిలిన సభ్యులను నామినేటేడ్ కోటాలో రాష్ట్ర గవర్నర్ నియమిస్తారు.
ఇదే సమయంలో అసెంబ్లీలో తీర్మానం చేసి దానిని పార్లమెంట్ కి పంపి రాష్ట్రపతి ఆమోదంతో విధానపరిషత్ ని అర్ధాంతరంగా రద్దు చేయవచ్చు. 1958లో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ విధాన పరిషత్ 1985 లో అసెంబ్లీ తీర్మానం ద్వారా రద్దు అయిన దేశంలోనే మొట్ట మొదటి శాసన మండలి ఆంధ్రప్రదేశ్ శాసన మండలే కావడం విశేషం. అప్పటి శానమండలిలో కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ ఉండడంతో ముఖ్యమంత్రి యన్టీ రామారావు ప్రభుత్వం శాసనమండలి అనవసరమైనదని, జనాభాలో ప్రాతినిధ్యం లేదని, రాష్ట్ర బడ్జెట్ పై భారంగా మారిందని, అదీకాక చట్టాలు ఆమోదించడంలో జాప్యాలు కలుగుతున్నాయనే కారణాలు చూపించి అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంట్ ద్వారా శాసనమండలిని రద్దు చేసింది.
అయితే 1989 లో మర్రి చెన్నా రెడ్డి ప్రభుత్వం శాసనమండలి పునరుద్దరణకు అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంట్ కు పంపించగా ఆ తీర్మానాన్ని రాజ్యసభలో ఆమోదించినప్పటికీ 1991 లో లోక్ సభ అర్ధాంతరంగా కూలిపోయి మధ్యంతర ఎన్నికలు రావడంతో ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చలేదు. అయితే వైయస్ రాజశేఖర్ రెడ్డి చొరవతో 2004 లో ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఏర్పాటుకు సంభందించిన తీర్మానాన్ని అసెంబ్లీలో ఆమోదించి పార్లమెంట్ కు పంపడంతో 2006లో లోక సభ మరియు రాజ్యసభలో ఆమోదింపజేసి ఆ తీర్మానానికి 2007 లో రాష్ట్ర పతి ఆమోద ముద్రతో ఆంధ్రప్రదేశ్ లో ఇరవై రెండేళ్ల తరువాత శాసన మండలి పునరుద్ధరించబడింది. 2014 రాష్ట్ర విభజన చట్టం ప్రకారం శాసన మండలి కూడా విభజించబడింది. మొత్తం 90 మంది శాసనమండలి సభ్యుల్లో 58 మంది ఆంధ్రప్రదేశ్ కి కేటాయించబడ్డారు.
సాధారణంగా కేంద్రంలో ఎగువ సభ అయిన రాజ్యసభకు ఉన్న పరిమిత అధికారాలు కూడా రాష్ట్ర శాసనమండలికి లేవనే చెప్పాలి. రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన ఏదైనా బిల్లుని లేదా తీర్మానాన్ని శాసన మండలి ఆమోదించవచ్చు, లేదా అందులో మార్పులు చేర్పులు సూచిస్తూ బిల్లుకు సవరణలు ప్రతిపాదించి పునః పరిశీలనకు తిరిగి అసెంబ్లీకి పంపవచ్చు. అసెంబ్లీ మరోసారి దాన్ని ఆమోదించి మండలికి పంపాల్సి ఉంటుంది. రెండోసారి కూడా మండలి తిరస్కరిస్తే ఆ తర్వాత అసెంబ్లీ నిర్ణయమే ఫైనల్ అవుతుంది. అంతే తప్ప శాసన మండలి తిరస్కరిస్తే తీర్మానం వీగిపోవడం జరగదు. ఆర్ధిక బిల్లుల విషయానికి వస్తే శాసన మండలి ఆమోదించినా, ఆమోదించకపోయినా అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన 14 రోజుల లోపు ఆ బిల్లు ఆమోదం పొందినట్టుగానే పరిగణించాలి.
ఈ నేపథ్యంలో రాజధాని అంశంపై ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న తీర్మానాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వానికి బలం లేని ఎగువ సభలో ఎలా గట్టెక్క గలుగుతుంది ?? ఈ అవరోధం ఎలా అధికమిస్తుంది ?? అనే అంశం పై మీడియాలో రకరకాల ఊహాగానాలు ప్రచారంలో ఉనాయి. దీనికి కారణం కూడా లేకపోలేదు. పోయిన సమావేశాల్లో పాఠశాలల్లో ఆంగ్ల మీడియం బిల్లు, ఎస్సీ కమిషన్ ఏర్పాటు బిల్లులను మండలి అసెంబ్లీ పునః పరిశీలనకు వెనక్కు పంపింది. వాటికి శాసన మండలి ప్రతిపాదించిన సవరణలపై అసెంబ్లీ ఇంతవరకూ ఏ నిర్ణయం తీసుకోలేదు.
అయితే శాసన మండలి అవరోధాన్ని అధిగమించడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందున్న ప్రత్యామ్న్యాయాలు పరిశీలిస్తే, ఆర్ధిక బిల్లుల రూపంలో కనుక అసెంబ్లీలో రాష్ట్ర రాజధానికి సంబంధించిన బిల్లు ప్రవేశ పెడితే, శాసన మండలి ఆమోదించినా ఆమోదించకపోయినా 14 రోజుల లోపు ఆ బిల్లు ఆటోమేటిక్ గా ఆమోదం పొందినట్టే లెక్క. లేదా కేంద్రంలో లాగా ఉభయ సభల సంయుక్త సమావేశం పెట్టి ఓటింగ్ నిర్వహించడం ద్వారా మండలిలో టీడీపీ ఆధిక్యానికి చెక్ పెట్టొచ్చని తెలుస్తుంది. అయితే ఈ అవకాశం పార్లమెంటులోనే ఉందని, రాజ్యాంగం ప్రకారం సంయుక్త సమావేశం అవకాశం రాష్ట్రాల్లో లేదని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. సాధారణంగా ఒక్క గవర్నర్ ప్రసంగం సమయంలో మాత్రం ఉభయ సభల సంయుక్త సమావేశం నిర్వహిస్తుంటారు. ఆ ప్రసంగంపై చర్చ, ధన్యవాదాలు తెలపడం రెండు సభల్లోనూ వేర్వేరుగా జరుగుతుంది.
ఇదే సమయంలో శాసన మండలి అవరోధాన్ని అధిగమించడానికి ఏకంగా శాసనమండలిని రద్దు చేసే అవకాశం కూడా ఉందని మీడియాలో వార్తలొస్తున్న నేపథ్యంలో ప్రభుత్వానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అలాంటి యోచన లేదని తెలుస్తుంది. ప్రస్తుతం మండలి నుంచి ఇద్దరు ఎమ్మెల్సీలు పిల్లి సుభాష్ చంద్ర బోస్, మోపిదేవి వెంకట రమణలు మంత్రులుగా ఉన్నారు. మండలి రద్దయితే వారిద్దరి పదవులు పోతాయి. ఆ మంత్రుల కోసం మరో ఇద్దరు ఏమ్మెల్యేలు రాజీనామా చెయ్యాల్సి ఉంటుంది. అదీకాక ఏడాది గడిస్తే మండలి లో వైసీపీ ఆధిక్యంలోకి వస్తుంది. కొత్తగా ఆ పార్టీ నేతలు 20 మందికి మండలిలో పదవులు వస్తాయి. ఇప్పటికే ఎమ్మెల్యే సీట్లు దక్కని వారికి ఎమ్యెల్సీ పదవులు ఇస్తానని జగన్ హామీ ఇచ్చి ఉన్నారు. పైగా మండలి రద్దు ఇప్పటికిప్పుడు అయ్యేది కూడా కాదు. అసెంబ్లీ లో తీర్మానం ప్రవేశపెట్టి, ఆ తీర్మానం కేంద్రానికి వెళ్లి అక్కడ ఆమోదం పొందడానికి కనీసం ఆరు నెలల పెట్టె అవకాశం వుంది.
వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుంటే శాసనమండలిని రద్దు చేసే దానికన్నా ఏదొక రూపంలో అసెంబ్లీలో బిల్లు ను ప్రవేశపెట్టి గట్టెకించడానికే జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మొగ్గు చూపుతుందని చెప్పవచ్చు. అంతిమంగా శాసన మండలి వల్ల ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లు ఆమోదంలో కొంత జాప్యం జరుగుతుంది కానీ తిరస్కరణకు గురవడం ఉండదు. మహా అయితే పునఃపరిశీలన పేరుతొ శాసనమండలి ఆ ప్రక్రియను ఒక నెల రోజులు లేదా అసెంబ్లీ తదుపరి సెషన్ వరకు ఆపవచ్చు. ఇక ఆర్ధిక బిల్లుల విషయంలో అయితే శాసన మండలి పాత్ర ఏమి ఉండదు.