iDreamPost
iDreamPost
రోడ్ల కోసం రూ.రెండు రూపాయలు సెస్ వసూలు చేస్తున్నారు కాని రోడ్లు ఎక్కడ నిర్మిస్తున్నారో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు రాష్ట్ర ప్రయోజనాలపై కేంద్రాన్ని ఈ విధంగా ఎందుకు ప్రశ్నించరనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆదివారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు. రోడ్లను బాగు చేయకుండా, రాజధాని కట్టకుండా సెస్ వసూలు చేయడం ఏమిటని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఆంధ్రప్రదేశ్‌ను అథోగతి పాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో వాగ్దానాలను చేసిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి రాజధానిని ఎక్కడికి పట్టుకెళ్లారని ప్రశ్నించారు.
కేంద్రంలో తమ ప్రభుత్వంలో పరపతి ఉపయోగించరా..
పార్లమెంట్ సాక్షిగా నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్ ఇచ్చిన ప్రత్యేక హాదా హామీని ఏడున్నరేళ్లుగా తమ పార్టీ ప్రభుత్వం అమలు చేయకపోయినా సోము వీర్రాజు ఎందుకు స్పందించడం లేదు. విభజన చట్టంలోని అంశాలు ఇప్పటికీ అమలుకు నోచుకోకపోయినా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా తన పలుకుబడిని ఉపయోగించకుండా ఎందుకు తాత్సారం చేస్తున్నారు? ఆంధ్రుల హక్కుగా సాధించుకున్న విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయడానికి తమ పార్టీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే ఎందుకు అడ్డుకోవడం లేదు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పరిరక్షణ కోసం దాదాపు ఆరునెలలుగా అక్కడి కార్మికులు ఆందోళన చేస్తుంటే అటువైపు ఎందుకు చూడరు? కొండంతగా పెట్రోల్ ధరలను పెంచి గోరంతగా తగ్గించిన కేంద్ర ప్రభుత్వాన్ని ఇదేమిటని అడగరు కానీ దీనిపై తగుదునమ్మా అంటూ ఆందోళనలు చేయడం భావ్యమా? కేంద్రంలో బీజేపీ ప్రభుత్వంలో తన పరపతిని ఉపయోగించి రాష్ట్ర ప్రయోజనాలకు నేను చేసింది ఇది అని చెప్పుకోవడానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా సోముకు ఏమైనా ఉందా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పలేని సోముకు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించే నైతిక అర్హత ఉంటుందా అని జనం అనుకుంటున్నారు.
Also Read : KCR Press Meet – ధాన్యం కొనుగోలు, పెట్రోల్ ధరలు.. కేంద్రాన్ని ఉతికి ఆరేసిన కేసీఆర్
రోడ్లకు టెండర్లు పిలిచారు కదా..
గత ప్రభుత్వం రోడ్ల మరమ్మతుల విషయం గాలికి వదిలేయడం వల్ల, అధిక వర్షాల కారణంగా రాష్ట్రంలో రోడ్లు అధ్వానంగా ఉన్న విషయం వాస్తవమే. కరోనా కారణంగా ఆదాయాలు గణనీయంగా తగ్గిపోవడంతో దేశవ్యాప్తంగా అభివృద్ధి కుంటుపడిన విషయం తెలిసిందే. అందుకే రోడ్ల మరమ్మతులను ప్రభుత్వం సకాలంలో చేపట్టలేకపోయింది. అయినా రూ.2.205 కోట్లతో 8,970 కిలోమీటర్ల మేర రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధి, మరమ్మతులకు ప్రభుత్వం ఇప్పటికే టెండర్లు పిలిచింది. ఈ సమాచారం తెలిసినా దాన్ని ఉద్దేశ పూర్వకంగా పక్కనపెట్టి రాజకీయ విమర్శలు చేయడం సబబా? మూడు రాజధానుల అంశంపై వైఎస్సార్ సీపీ స్పష్టతతో ఉంది. కోర్టుల్లో కేసుల కారణంగా అది కార్యరూపం దాల్చడం లేదు. వాస్తవం ఇదికాగా జగన్‌మోహన్‌రెడ్డి రాజధానిని ఎక్కడికి పట్టుకెళ్లారని ప్రశ్నిస్తూ తెలుగుదేశం పార్టీ నాయకుల కన్న అధ్వానంగా విమర్శలు చేయడం న్యాయమా?
ఉనికి కోసమే విమర్శలా..
ఒకపక్క ఎమ్మెల్సీగా సోము పదవీకాలం ముగియనుంది. మరోపక్క తిరుపతి, బద్వేల్ ఉప ఎన్నికల్లో తమ సారథ్యంలో ఓటములు మూటకట్టడంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికీ పొడిగింపు ఉండదని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సోము ఇలా మాట్లాడుతున్నారా అన్న అనుమానం చాలామందికి కలుగుతోంది. తెలుగుదేశం పార్టీ నాయకుల కన్న తాను రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎక్కువగా నిలదీస్తున్నాను అనిపించుకోవడానికి ఏదో అంశంతో రోజూ మీడియాలో ప్రచారం కోరుకోవడం ఉనికికోసం పడే పాట్లుగానే జనం గుర్తిస్తారు. అంతేగాని ఎప్పుడూ లేనిది మీరు రాష్ట్ర ప్రయోజనాల కోసం పాటు పడుతున్నారని అనుకోరు.
Also Read : Petrol Politics – నిస్సిగ్గు ప్రచారం.. పెట్రో ధరలు పెంచింది ఎంత? తగ్గించింది ఎంత?