iDreamPost
android-app
ios-app

ట్రాన్స్ జెండర్లకు వరంగల్ MGM భరోసా… సర్జరీలు, కౌన్సిలింగ్ కోసం ప్రత్యేక క్లినిక్

ట్రాన్స్ జెండర్లకు వరంగల్ MGM భరోసా… సర్జరీలు, కౌన్సిలింగ్ కోసం ప్రత్యేక క్లినిక్

ట్రాన్స్ జెండర్లు వ్యక్తిగతంగా, సామాజికంగా ఎదుర్కొంటున్న వివక్ష అంతా ఇంతా కాదు. అనారోగ్య సమస్యలు వారి ఇక్కట్లను రెట్టింపు చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో వరంగల్ MGM (Mahatma Gandhi Memorial) ఆసుపత్రి మేమున్నామంటూ ట్రాన్స్ జెండర్లకు భరోసా ఇస్తోంది. వారి కోసం తెలంగాణలోనే తొలిసారిగా ఒక ప్రత్యేక క్లినిక్ ఏర్పాటు చేసింది. ప్రతి మంగళవారం ఉదయం 9 నుంచి 12 గంటల వరకు ట్రాన్స్ జెండర్లు ఇక్కడ వైద్య సేవలు పొందవచ్చు.

ట్రాన్స్ జెండర్లు ఎదుర్కొనే శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలకు వివిధ రంగాల నిపుణులు చికిత్సలు, సలహాలు అందిస్తారు. మానసిక సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్ళకు సైకలాజికల్ కౌన్సిలింగ్ ఇస్తారు. దీంతో పాటు సెక్స్ రీ అసైన్ మెంట్ సర్జరీ (sex reassignment surgery), బ్రెస్ట్ ట్రాన్స్ ప్లాంటేషన్ (breast transplantation), హార్మోనల్ థెరపీ సదుపాయాలు కూడా ఈ క్లినిక్ లో అందుబాటులో ఉంటాయి. మ్యాస్టెక్టమీ (mastectomy), హిస్టరెక్టమీ (hysterectomy), ప్లాస్టిక్ సర్జరీ (plastic surgery) లాంటి చికిత్సలు కూడా ట్రాన్స్ జెండర్లు పొందే వీలుంటుంది.

ఈ ప్రత్యేక క్లినిక్ అందించే సేవలకు సంబంధించిన సమాచారం అందించేందుకు MGM యాజమాన్యం 99631 64111 నంబర్ తో ఒక హెల్ప్ లైన్ ఏర్పాటు చేసింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ట్రాన్స్ జెండర్లు ఈ నంబరుకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.

తమిళనాడులో నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా ట్రాన్స్ జెండర్లకు వైద్య సాయం అందుతోంది. కానీ తెలంగాణలో MGM సొంతంగా ఈ కార్యక్రమం చేపట్టడం విశేషం. ఇప్పటికే ఇక్కడ HIV పాజిటివ్ ట్రాన్స్ జెండర్లకు రెట్రో వైరల్ థెరపీ లాంటి సేవలు అందిస్తున్నారు. ఇప్పుడీ క్లినిక్ ఏర్పాటుతో మరో ముందడుగు పడినట్లయింది.