iDreamPost
iDreamPost
చాలామందికి ఒకటే సందేహం. మార్గదర్శిని ఇబ్బందుల్లోకి నెడితే ఉండవల్లి అరుణ్ కుమార్ కి ఇప్పుడు ఒరిగేది ఏముందని. వై.ఎస్.ఆర్ బతికుండగా ఆయన పార్టీ ఎం.పీగా మార్గదర్శిపై మొదలుపెట్టిన యుద్ధాన్ని ఉండవల్లి ఇప్పటికీ కొనసాగిస్తుండడం పట్ల పలువురు ఆశ్చర్యం వ్యక్తపరుస్తున్నారు. కొంతమంది ఆయనది సాడిజమంటున్నారు. ఇంకొంతమంది..”కొండని ఢీకొని గెలిచినా ఓడినా చైత్రలో స్థానం ఉంటుంది…ఆ స్థానం కోసమే ఆయన ఆరాటం” అంటున్నారు.
కానీ అసలు విషయమేంటో ఆయన ఎన్నిసార్లు చెబుతున్నా అధికశాతం మంది గ్రహించడం లేదు.
ఉండవల్లి చెప్పేదల్లా ఒకటే
“న్యాయం, చట్టం ఈ దేశంలో అందరికీ సమానంగా వర్తింపజేయాలి. ఒక తప్పుని వదిలేస్తే అదే ప్రెసిడెన్స్ అయిపోయి మరింతమంది భవిష్యత్తులో తప్పులు చేసి తప్పించుకునే అవకాశముంటుంది. కనుక అటువంటి రాంగ్ ప్రిసిడెన్స్ భారతదేశ న్యాయ చరిత్రలో నమోదు కాకూడదు”.
దీనికి కొనసాగింపుగా ఆయన ఇంకొకటి చెబుతున్నారు-
“రామోజీరావు వెనుకున్న న్యాయవాదులు “లా” లో ఉన్న పాయింట్స్ ని, లూప్ హోల్స్ ని ఆయనకు అనుకూలంగా ఎలా వాడుతున్నారో ఒక పుస్తకం రాస్తున్నాను. ఇది న్యాయ విద్యార్థులకి ఒక పెద్ద పాఠమవుతుంది”
ప్రస్తుతం ఉండవల్లి నమ్మిన కాంగ్రెస్ బలంగా లేదు. ఆంధ్రలో అయితే భూస్థాపితమైపోయింది. తెదేపాతో సంబంధాలున్నాయా అంటే, అవే ఉంటే ఈ మార్గదర్శిపై యుద్ధం చేయనే చేయడాయన. పోనీ వైకాపాతో లింకులు బాగున్నాయా అంటే అవీ లేవు. భాజపాతో ఇప్పటికీ ఆయన విభేదిస్తూనే ఉంటాడు. జనసేనపై పెద్ద అభిప్రాయం కూడా లేదు, ఉన్నా కూడా ఆ పార్టీ కూడా తెదేపాకి అనుబంధమే కనుకే మార్గదర్శిపై ఫైట్ కి అటునుంచి ఏ మద్దతూ ఉండదు. కనుక ఎలా చూసుకున్నా ఉండవల్లి ఫలానా పార్టీ అండ చూసుకుని మార్గదర్శిపై యుద్ధాన్ని కొనసాగిస్తున్నాడని అనుకోవడానికి ఏ ఆధారమూ లేదు.
అసలే సమాజంలోని ఒక వర్గం రామోజీని గురువుగా, మహాపురుషుడిగా చూస్తుంటుంది. మరి ఆ వర్గం నుంచి ఉండవల్లికి ప్రమాదం ఉండదా? ఎందుకింత తెగింపు? అని సోషల్ మీడియాలో కూడా ప్రశ్నలు కనిపిస్తున్నాయి.
ప్రతి వ్యక్తి ఏదో ఒక వ్యక్తిగత ప్రయోజనం ఉంటేనే పోరాటం చేస్తాడని అనలేం. కొందరి ధోరణి ప్రమాదాలతో చెలగాటమైనా పర్వాలేదు..సత్యాన్ని చూపించాలి..అన్నట్టు ఉంటుంది. ఆ ప్రస్థానంలో ఎంతటి యుద్ధమైనా చేస్తారు. దాదాపు కళ్లు మూసేసే స్థికి వచ్చిన మార్గదర్శి కేసుని వైకాపా ప్రభుత్వం కళ్లు తెరిపించడం, దానికి కొనసాగింపుగా ఉండవల్లి ఉద్యమం…రామోజీకి, ఆయన సానుభూతిపరులకి ఎంతటి తలనొప్పిగా ఉంటాయి.
అయినా సరే ఇప్పటివరకు ఉండవల్లి శైలి చూస్తే ఒకటే అనిపిస్తోంది. ఆయన ఆర్ధికపరమైన విషయాల్లో సన్మార్గంలో నడిచే పద్ధతులు దేశవాసులకి తెలియజేయాలనుకుంటున్నాడు.
అంటే…ఏ రకంగా కోట్లకి పడగలెత్తవచ్చో తెలిపే విషయంలో “మార్గదర్శి” రామోజీ అయితే ఏ రకంగా సంపాదించకూడదో తెలిపే “సన్మార్గదర్శి” ఉండవల్లి అన్నమాట. ఈ కేసు ఎలా కొలిక్కి వస్తుందో చూడాలి.