iDreamPost
iDreamPost
ఆంధ్రప్రదేశ్ రాజధాని వ్యవహారం మరోసారి మొదటికొచ్చింది. గడిచిన శతాబ్దకాలంలోనే మద్రాస్ నుంచి కర్నూలుకి, అక్కడి నుంచి హైదరాబాద్ కి, మళ్లీ అమరావతి నుంచి ఇప్పుడు వైజాగ్ వైపు వెళుతోంది. మద్రాస్ తీరం నుంచి ఇప్పుడు విశాఖ తీరం వరకూ సాగుతున్న ఏపీ రాజధాని పయనంలో అనేక మలుపులున్నాయి. కానీ ఇప్పుడు తాజాగా వైఎస్ జగన్ ప్రభుత్వం చేపట్టిన మూడు రాజధానులు, నాలుగు రీజియన్ల వ్యవహారం ఆసక్తిగా కనిపిస్తోంది. అమరావతి పరిస్థితి ఏమిటన్నది కొందరి సమస్యగా కనిపిస్తున్నప్పటికీ, ఏపీలో రాజధాని అంశం కొలిక్కి తీసుకురావడం అన్నది అందరికీ సంబంధించిన అంశం. కాబట్టి జీఎన్ రావు కమిటీ కూడా ఓవర్ టూ వైజాగ్ అని చెప్పేసిన తరుణంలో అసలు కథ ఇప్పుడే మొదలయ్యిందని చెప్పక తప్పదు.
అనేక సవాళ్ల మధ్య తన రాజకీయ పయనం సాగించిన వైఎస్ జగన్ పాలనలో కూడా అదే పద్ధతిని కొనసాగిస్తున్నారు. ముఖ్యమంత్రిగా ఏడు నెలల కాలంలో తీసుకున్న నిర్ణయాలే దానికి సాక్ష్యం. వ్యవస్థలో మార్పు తీసుకొస్తానని చెప్పినట్టుగానే ప్రయత్నాలు ప్రారంభించారు. గ్రామ సచివాలయ వ్యవస్థ నుంచి ఇప్పుడు ఏపీ సచివాలయం తరలింపు వరకూ జగన్ బ్రాండ్ కనిపిస్తోంది. అయితే గ్రామ పాలనా వ్యవస్థలో మార్పులు తీసుకురావడానికి, రాష్ట్ర అధికార వ్యవహారాల్లో మార్పులకు చాలా వైరుధ్యం ఉంటుంది. అనేక చిక్కుముడులుంటాయి. సవాలక్ష ఆటంకాలు ఎదురవుతాయి. వాటన్నింటినీ అధిగమించడం ఎలా అన్నదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందన్న ప్రశ్నలు.
మూడు ప్రాంతాల విశ్వాసాన్ని నిలపాలి
దక్షిణాఫ్రికా తరహాలో మూడు రాజధానులంటూ ముఖ్యమంత్రి చేసిన ప్రకటననే పలువురు ఆహ్వానించారు. పార్టీలకు అతీతంగా జగన్ నిర్ణయానికి జైజైలు పలికారు. ఒకటి రెండు ప్రాంతాల్లో కొంత మిశ్రమ స్పందన ఉన్నప్పటికీ జగన్ ఆశించిన స్పందన కనిపించింది. అయితే ఆ విశ్వాసానికి తగ్గట్టుగా అడుగులు పడాలి. ఉత్తరాంధ్ర, రాయలసీమ వాసుల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. అందుకు అనుగుణంగా జేఎన్ రావు కమిటీ సిఫార్సులను అమలు చేసేందుకు పూనుకోవాలి. గతంలో శివరామకృష్ణన్ కమిటీ, శ్రీకృష్ణ కమిటీ వంటి రిపోర్టులు దాదాపుగా తుంగలో తొక్కారు. రిపోర్టుల సారాంశం కూడా సంపూర్ణంగా వెల్లడించలేని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో జీఎన్ రావు కమిటీతో పాటుగా అంతర్జాతీయ సంస్థ రిపోర్ట్ కూడా రాబోతున్న తరుణంలో వాటికి అనుగుణంగా చర్యలు తీసుకుంటే మరింత సానుకూలత ఖాయం.
వ్యవహార కేంద్రం విశాఖ వైపు అందరి చూపు
తాజా పరిణామాలతో అందరి చూపు విశాఖ వైపు మళ్లింది. దానికి అనుగుణంగా గత కొన్ని నెలలుగా ప్రభుత్వం ప్రాధమిక కసరత్తులు చేసినట్టు కథనాలు వస్తున్నాయి. ఇప్పటికే హెచ్ వో డీలకు సంబంధించిన కార్యాలయాలు, సీఎం క్యాంప్ కార్యాలయం సహా పలు భవనాలు, స్థలాల పరిశీలన పూర్తయ్యిందని చెబుతున్నారు. కొన్ని నెలల్లోనే విశాఖలో రాజధాని ఏర్పాటు అవుతుందని మంత్రి అవంతి కూడా ప్రకటించారు. దాంతో విశాఖను దానికి అనుగుణంగా సన్నద్ధం చేయడం కీలకం. ముఖ్యంగా సీఎం చెప్పినట్టుగానే ట్రాఫిక్ సమస్యలు, కాలుష్యం, తాగునీటి కొరత వంటివి ప్రధానమైన అంశాలు. వాటికి తగ్గట్టుగా వేసవి అసెంబ్లీ సమావేశాలకు అనుగుణంగా విశాఖలో ఏర్పాట్లు అవసరం అవుతాయి. ముందుచూపుతో ప్రభుత్వం ఉందని చెబుతున్న తరుణంలో విశాఖనగరానికి కొత్త ఊపు ఖాయం అని చెప్పవచ్చు. ఉత్పన్నమయ్యే సమస్యలను గమనంలో ఉంచుకుని అడుగులు వేస్తే సాగరనగరం అంతర్జాతీయ కీర్తి సాధించడం అంత కష్టం కాబోదనే అభిప్రాయం వినిపిస్తోంది.
అమరావతి రైతులకు అండగా..
అమరావతి రాజధానిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ విషయంలో ప్రజలకు కూడా పెద్దగా అనుమానాలు లేవు. చివరకు ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ నేతలు కూడా మేము భూములు కొనలేదని చెప్పలేకపోతున్నారు. దాంతో రాజధాని విషయం ముందే తెలిసి భూములు కొనుగోలు చేసిన కొందరు నేతలు, వారి బినామీల విషయం పక్కన పెడితే రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు మాత్రం కొంత నష్టపోయే ప్రమాదం ఉంది. స్వచ్ఛందంగా కొందరు, బలవంతంగా, భయపడి భూములు ఇచ్చిన వారు కూడా ఇప్పుడు బాధితులుగా మారుతున్నారు. ఐదేళ్ల తర్వాత, అనేక రోడ్లు, నిర్మాణాల కోసం పనులు చేపట్టిన ప్రాంతంలో తిరిగి భూములు ఇవ్వడానికి ప్రభుత్వం దాదాపుగా నిర్ణయించుకున్న తరుణంలో రైతాంగానికి మేలు చేసేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. నష్టపోయిన దానికి తగ్గట్టుగా వారికి అండగా నిలవాల్సి ఉంటుంది. ఇప్పటికే తుళ్లూరులో అసెంబ్లీ మినహా మిగిలిన హైకోర్ట్ బెంచ్ సహా అన్ని కార్యకలాపాలకు మంగళగిరి, నాగార్జున యూనివర్సిటీ ప్రాంతాలను జేఎన్ రావు కమిటీ సూచించిన తరుణంలో రాజధాని రైతుల నష్టాన్ని పూడ్చడానికి అనుగుణంగా ప్రభుత్వం ముందుకు రావాల్సి ఉంటుంది.
కర్నూలు విషయంలో కేంద్రం కొర్రీలు వేయకుండా..
జ్యుడీషియల్ క్యాపిటల్ గా కర్నూలు ఖరారు కావడంతో శ్రీభాగ్ ఒప్పందంలో కొంతమేరకు అమలు జరగడం సీమ వాసులను తృప్తి పరుస్తోంది. గడిచిన కొన్ని రోజులుగా రాయలసీమ ప్రజల్లో కనిపిస్తున్న స్పందన అందుకు తార్కాణం. అయితే ఇప్పటికే అమరావతి కేంద్రంగా హైకోర్ట్ కి రాష్ట్రపతి గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చేశారు. దానికి అనుగుణంగా కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో కర్నూలులో హైకోర్ట్, మంగళగిరి, విశాఖలో బెంచీల ఏర్పాటు కోసం గెజిట్ లో మార్పులు అవసరం అవుతాయి. అందుకు కేంద్రం సహకరించాల్సి ఉంటుంది. వాస్తవానికి ఇప్పటికే బీజేపీ కూడా కర్నూలులో హైకోర్ట్ డిమాండ్ చేస్తోంది. కాబట్టి సమస్య కాకపోవచ్చనే అభిప్రాయం ఉంది. అయినా ఎటువంటి కొర్రీలు పడకుండా వీలయినంత త్వరగా ఆ ప్రక్రియను పూర్తిచేయడం జగన్ సర్కారుకి ప్రధాన కర్తవ్యం.
ఉద్యోగుల్లో విశ్వాసం కల్పించాలి..
హైదరాబాద్ నుంచి అమరావతికి అష్టకష్టాలు పడుతూ వచ్చిన ఉద్యోగుల పరిస్థితి ఇప్పుడు ఊగిసలాటలో పడింది. వారానికి ఐదు రోజుల పాటు వెలగపూడి చుట్టూ తిరిగి మళ్లీ హైదరాబాద్ కి వారాంతంలో వెళ్లి వస్తున్న వారు కూడా ఉన్నారు. అలాంటి వారందరికీ విశాఖ ఊరటనిస్తుందనే అభిప్రాయం ఉంది. మెట్రోపాలిటన్ నగరంగా విశాఖలో ఉన్నత ఉద్యోగులందరికీ తగిన వసతి, ఇతర సదుపాయాలు అందుబాటులో ఉంటాయని చెప్పవచ్చు. అయితే ప్రభుత్వం మారిన ప్రతీసారి ఇలా రాజధానులు మారుస్తుంటే తమ పరిస్థితి ఏమిటనే సందేహాలు సెక్రటేరియేట్, కమిషనరేట్ల సిబ్బందిలో కనిపిస్తోంది. దానిని అధిగమించడానికి వారిలో విశ్వాసం నింపాలి. అనవసర ఆందోళనలు కలగకుండా, వారిని సముదాయించి, సాగరతీరానికి చేర్చాలి. ఈ విషయంలో కూడా జగన్ ప్రభుత్వం జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. లేకుండా అపోహలు సృష్టించి, వివాదాలు రాజేందుకు కొందరు వేచి ఉన్నారనే వాస్తవాన్ని గ్రహించాలి.
మొత్తంగా ఏపీ కి కొత్త రాజధాని తో పాటు ప్రాంతీయ అభివృద్ధి కమిషనరేట్లు కొలువుతీరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వాటన్నింటికీ సంక్రాంతి నాటికి స్పష్టత వస్తుందనే అభిప్రాయం వినిపిస్తోంది. దాంతో కొత్త సంవత్సరంలో కొంగొత్త ఆశలతో అడుగుపెడుతున్న నవ్యాంధ్ర పయనం జగన్ నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది. ఆయన వేయబోయే అడుగులతో ముడిపడి ఉంటుంది. సమస్యలను అధిగమించేందుకు చేపట్టబోయే చర్యల ఆధారంగా ఉంటుంది.