Idream media
Idream media
అమరావతి నిర్మాణంలో చంద్రబాబు విఠలాచార్య సినిమాలని గుర్తుకు తెచ్చాడని బీజేపీ నేత సోము వీర్రాజు ఎద్దేవా చేశారు. చనిపోయిన 20 ఏళ్ల తర్వాత కూడా విఠలాచార్య ఇంకా గుర్తున్నాడంటే ఆయన నిజంగా గ్రేట్.
50 సినిమాలని డైరెక్షన్ చేసిన ఆయన చదివింది మూడో తరగతే. కానీ పల్లె ప్రజలకి ఏం కావాలో బాగా చదువుకున్నాడు. కర్నాటకలోని ఉడిపి సమీపంలోని ఉదయవర గ్రామంలో 1920లో పుట్టాడు. తండ్రి ఆయుర్వేదం డాక్టర్.
విఠలాచార్య స్కూల్‌కి వెళ్లకుండా నాటకాలు వేసేవాడు. తండ్రికి ఇది ఇష్టం లేదు. దాంతో ఇల్లు వదిలి అరిసికెరె అనే ఊరికి పారిపోయాడు. రకరకాల పనులు చేసి చివరికి ఒక హోటల్ పెట్టాడు. అక్కడికి వచ్చే రకరకాల వ్యక్తులని పరిశీలించేవాడు. ఇదంతా తర్వాత సినిమాల్లో హాస్య పాత్రలకి పనికొచ్చింది.
12 ఏళ్ల వయస్సులోనే గాంధీజీని చూడడం వల్ల ఆ ప్రభావంతో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నాడు. జైలుకి వెళ్లాడు. విడుదలైన తర్వాత హోటల్ బోర్ కొట్టింది. హాసన్ జిల్లాలో టూరింగ్ టాకీస్ పెట్టాడు. ప్రతిరోజూ సినిమాలు చూడడం వల్ల ఆసక్తి పెరిగింది. మైసూరుకి వెళ్లి సినిమా కంపెనీ పెట్టి కన్నడ సినిమాలు తీశాడు. 44 నుంచి 53 వరకు 18 సినిమాలు ఫైనాన్ష్ చేశాడు.
1954లో మద్రాస్ వచ్చి చనిపోయే వరకు అక్కడే ఉన్నాడు. ఒక్క ఎన్టీఆర్‌తోనే దాదాపు 15 సినిమాలు తీశాడు. కాంతారావు చేతికి కత్తి ఇచ్చింది ఆయనే.
చాలా క్రమశిక్షణ కలిగిన మనిషి. షూటింగ్‌కి పదేపదే ఆలస్యంగా వస్తే హీరోని ఎలుగుబంటిగా, హీరోయిన్‌ని చిలుకగా స్క్రిప్ట్ కరెక్షన్ చేసి సినిమా ముగించేవాడు. ఎలుగుబంటి రెండు కాళ్లతో నడవడం, హాస్యనటుడు దాన్ని చూసి భయపడడం ప్రతి సినిమాలోనూ ఒకటే సన్నివేషం ఉన్నప్పటికీ జనం ఆదరించారు.
చిత్రవిచిత్రమైన మాయాజాలం కేవలం కెమెరా ట్రిక్స్‌తో చూపించేవాడు. ఈయన సినిమాల్లో దెయ్యం చాలా ఫేమస్. జుత్తు విరబోసుకుని , కాళ్లని పొయ్యిలో పెట్టుకుని ఉండేది.
జనవరి 20, 2020 అంటే ఇంకో నెల రోజులకి ఆయన శతజయంతి. సినిమా వాళ్లు ఆయన్ని గుర్తు పెట్టుకుంటారో లేదో?