iDreamPost
android-app
ios-app

కొత్త రిస్కులో డిటెక్టివ్ సీక్వెల్

  • Published Feb 24, 2020 | 11:45 AM Updated Updated Feb 24, 2020 | 11:45 AM
కొత్త రిస్కులో డిటెక్టివ్ సీక్వెల్

హీరోగా విశాల్ తెలుగు వాళ్లకు పరిచయం అక్కర్లేని పేరు. ఇక్కడివాడే అయినప్పటికీ తమిళ్ లో జెండా పాతేసిన విశాల్ అక్కడ కేవలం నటుడిగానే కాక నడిగర్ సంఘం తాలూకు వ్యవహారాలు, పదవులు, వివాదాల పుణ్యమాని ఆ రకంగా కూడా పేరు తెచ్చుకున్నాడు. ఇటీవలే వచ్చిన యాక్షన్ పర్వాలేదు అనిపించుకున్నా ఓవరాల్ గా ఆశించిన అంచనాలు అందుకోలేకపోయింది. తాజాగా అతను నటిస్తున్న చిత్రం తుప్పరివాలన్ 2. ఇది గతంలో మనకు డబ్బింగ్ రూపంలో వచ్చి హిట్టు కొట్టిన డిటెక్టివ్ తమిళ పేరు.

దీని సీక్వెల్ చాలా రోజుల క్రితమే మొదలయ్యింది. షూటింగ్ పాతిక శాతం పైగానే పూర్తి చేశారు. కానీ దర్శకుడు మిస్కిన్ కు హీరో కం నిర్మాత విశాల్ కు ప్రొడక్షన్ కు సంబంధించి ఏవో అభిప్రాయ భేదాలు రావడంతో ఇద్దరూ విడిపోయారట. దీంతో బాలన్స్ పార్ట్ ని తానే డైరెక్ట్ చేయాలనీ విశాల్ నిర్ణయించుకొన్నాడట. ఆ మేరకు కెప్టెన్ గా బాధ్యతలు తీసుకుని షూటింగ్ కంటిన్యూ చేస్తున్నాడని చెన్నై టాక్. మిస్కిన్ లేటెస్ట్ మూవీ సైకో అంచనాలు అందుకోలేక ఫెయిలయ్యింది. డిటెక్టివ్ మొదటి భాగం క్రైమ్ డ్రామాగా ఇక్కడా పెద్ద హిట్ అయ్యింది.

విభిన్నమైన సినిమాలను డిఫరెంట్ టోన్ తో తెరకెక్కిస్తాడని పేరున్న మిస్కిన్ తప్పుకోవడం ఒకరకంగా డిటెక్టివ్ 2కు దెబ్బే, రేపు ఏ మాత్రం తేడా వచ్చినా అందరూ విశాల్ వైపే వేలెత్తి చూపిస్తారు. బడ్జెట్ విషయంలో మిస్కిన్ చాలా ఎక్కువ ఖర్చు పెట్టించడం వల్లే విశాల్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు అక్కడి మీడియా కథనం. అయితే స్పష్టమైన కారణాలు మాత్రం బయటికి రావడం లేదు. ఇలా హీరోలు దర్శకులు కావడం కొత్తేమి కాదు. తమిళ్ లో భాగ్యరాజా, అర్జున్ ఇలా సక్సెస్ అయినవాళ్లే. తెలుగులోనూ ఎన్టీఆర్, కృష్ణ తమ ప్రతిభను రుజువు చేసుకున్నారు. హీరో కావడానికి ముందు విశాల్ యాక్షన్ కింగ్ అర్జున్ దగ్గర దర్శకత్వ శాఖలో అసిస్టెంట్ గా పని చేశాడు. ఆ అనుభవం ఇప్పుడు ఈ విధంగా పనికొస్తుందన్న మాట .