iDreamPost
iDreamPost
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని అయిన విశాఖ మహానగరంలోని పరిశ్రమలపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కక్షగట్టినట్లు కనిపిస్తోంది. నాణ్యమైన ఉక్కు ఉత్పత్తులకు ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన విశాఖ స్టీల్ ప్లాంటును ఇప్పటికే వాటాల ఉపసంహరణ పేరుతో అమ్మకానికి పెట్టిన మోదీ ప్రభుత్వం.. ఉద్యమాలను కూడా పట్టించుకోకుండా ముందుకు వెళుతోంది. ఇది చాలదన్నట్లు ఇప్పుడు దేశంలోనే ప్రధాన మేజర్ పోర్టుల్లో ఒకటైన విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ ను మెల్ల మెల్లగా ప్రైవేటుకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తోంది. పోర్టులో అతి ముఖ్యమైన, ప్రధాన ఆదాయ వనరు అయిన బెర్తుల నిర్వహణను ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తోంది. తద్వారా పోర్టు ఆదాయానికి గండి కొడుతోంది.
ఇప్పటికే ప్రైవేట్ చేతిలో 7 బెర్తులు.. త్వరలో మరో 4
విశాఖ పోర్ట్ ఇన్నర్, ఔటర్ హార్బర్లలో కలిపి 26 బెర్తులు ఉన్నాయి. వీటిలో ఏడు బెర్తులను ప్రైవేట్ సంస్థలకు అప్పగించారు. ఎస్సార్, వేదాంత, ఏవీఆర్ ఇన్ఫ్రా, గామన్ ఇండియా, అదానీ, జేఎన్ బక్షి గ్రూపు సంస్థలు వీటిని నిర్వహిస్తున్నాయి. తాజాగా మరో నాలుగు బెర్తులను ప్రైవేట్ కు ఇచ్చేందుకు కేంద్రం పచ్చ జెండా ఊపింది. ఇటీవల విశాఖ వచ్చిన కేంద్ర పోర్టులు, షిప్పింగ్ మంత్రి శాంతన్ ఠాకూర్ ఈ విషయం వెల్లడించారు. ఒకవైపు మేజర్ పోర్టుల ప్రైవేటీకరణ ఇప్పట్లో లేదని చెప్పిన ఆయన.. మరోవైపు బెర్తుల లీజ్ ప్రక్రియకు పబ్లిక్ ప్రైవేట్ పార్టీసిపేషన్ పేరుతో
ఆమోదం తెలపడం చూస్తే అడ్డదారుల్లో పోర్టు ఉసురు తీస్తున్నారని అర్థం అవుతుంది. మంత్రి ఆదేశాలతో పోర్టు అధికారులు టెండర్లు పిలుస్తున్నారు. ఇన్నర్ హార్బర్లోని క్యూ -7, 8 బెర్తులను చెరో రూ.288 కోట్లతో, ఔటర్ హార్బర్లోని ఈక్యూ-6, 7 బెర్తులకు చెరో రూ.200 కోట్లతో టెండర్లు పిలిచారు.
Also Read : రైతుల పై దూసుకెళ్లిన కేంద్ర మంత్రి కుమారుడి కారు , 8 మంది మృతి
కాగ్ వద్దన్నా.. చేదు అనుభవాలు ఉన్నా..
పోర్టులకు సంబంధించి భారత కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో పీపీపీకి సంబంధించి స్పష్టమైన సూచనలు చేశారు. ఈ విధానం వల్ల కార్పొరేట్ సంస్థలకు మేలు చేయడం తప్ప పోర్టులకు లాభం ఉండదని, అందువల్ల దానికి స్వస్తి పలకాలని సూచించారు. ప్రస్తుత టెండర్లలో పొందుపర్చిన నిబంధనలు కూడా అలాగే ఉన్నాయి. బెర్తుల్లో కార్గో హ్యాండ్లింగ్ ద్వారా వచ్చే ప్రతి వంద రూపాయల ఆదాయంలో రూ.38 పోర్టుకు వాటాగా చెల్లించాలి. అంటే ఆదాయంలో ఒక వంతే పోర్టుకు దక్కుతుంది. మిగిలిన రెండు వంతులు ప్రైవేటుకు వెళ్లిపోతాయి. అదే పోర్టు స్వయంగా బెర్తులను నిర్వహించుకుంటే మొత్తం కార్గో హాండ్లింగ్ ఆదాయం దానికే చెందుతుంది.
మరోవైపు ఇప్పటికే ప్రైవేట్ నిర్వహణలో ఉన్న ఏడు బెర్తుల్లో రెండు దాదాపు రెండేళ్లుగా కార్యకలాపాలు లేక ఖాళీగా ఉన్నాయి. వీటిని లీజుకు తీసుకున్న సంస్థలు కార్గో హాండ్లింగ్ నిర్వహించకుండా వదిలేశాయి. దాంతో ఆ రెండు బెర్తుల నుంచి పోర్టుకు రెండేళ్లుగా ఆదాయం లభించడంలేదు. ఇన్ని అనుభవాలు, కాగ్ ఆక్షేపణలు ఉన్నా పట్టించుకోకుండా కేంద్ర ప్రభుత్వం బెర్తులను ప్రైవేట్ సంస్థలకే కట్టబెట్టడానికి తీసుకుంటున్న చర్యల వల్ల పోర్టు క్రమంగా ప్రైవేట్ పరం అయిపోతుందని, కార్మికులకు ఉద్యోగ భద్రత లేకుండా పోతుందని పోర్టు ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.
Also Read : వర్క్ ఫ్రమ్ హోమ్ టౌన్ : ఏపీ సర్కార్ వినూత్న నిర్ణయం