iDreamPost
android-app
ios-app

విరాటపర్వం సినిమా కాదు.. ఓరుగల్లు బిడ్డ కథ..

  • Published Jun 17, 2022 | 9:10 AM Updated Updated Jun 17, 2022 | 9:10 AM
విరాటపర్వం సినిమా కాదు.. ఓరుగల్లు బిడ్డ కథ..

రానా, సాయి పల్లవి జంటగా నటించిన సినిమా విరాటపర్వం ఈ రోజూ (జూన్ 17న) రిలీజ్ అవుతుంది. అయితే ఇది ఒక మహిళ జీవిత కథ అని, ఆమె కథ ఆధారంగా చేసుకొని ఈ సినిమా తెరకెక్కించారని, ఆమె పాత్రలో సాయి పల్లవి అద్భుతంగా నటించిందని డైరెక్టర్ వేణు పలు ఇంటర్వ్యూలలో తెలిపారు. అయితే విరాటపర్వం కేవలం సినిమా మాత్రమే కాదు. ఓ ఓరుగల్లు బిడ్డ కథ కూడా.

ఓరుగల్లు ఎందరో మహా నాయకులకు, రాణి రుద్రమదేవి, సమ్మక్క సారలమ్మ, చాకలి ఐలమ్మ.. ఇలా ఎందరో వీర నారీమణుల పురిటిగడ్డ. వీరిలో కొందరి జీవిత చరిత్రల ఆధారంగా ఇప్పటికే పలు సినిమాలు తెరకెక్కాయి. వీరిలాగే మరో ఉన్నత మహిళ కథ ఆధారంగా విరాటపర్వం సినిమా తెరకెక్కింది. ధైర్యశాలి, లక్ష్యం కోసం చిన్న వయసులోనే ప్రాణాలు వదిలిన ఓరుగల్లు బిడ్డ సరళ జీవితగాథ ఆధారంగా విరాటపర్వం సినిమాని దర్శకుడు వేణు ఊడుగుల తెరకెక్కించారు.

సరళ తల్లిదండ్రులు స్వరాజ్యం, భిక్షమయ్య. తండ్రి వామపక్ష విప్లవభావాలు కలిగి సీపీఐ ఆర్గనైజర్‌గా వ్యవహరించేవారు. వీళ్ల కుటుంబం భూపాలపల్లి జిల్లా (ఉమ్మడి వరంగల్‌ జిల్లా) మోరంచపల్లిలో ఉండేది. అక్క, ఇద్దరు సోదరుల తర్వాత నాలుగో సంతానంగా జన్మించిన సరళ అంటే అందరికి ఇష్టమే. అప్పట్లో ఈ ప్రాంతమంతా వామపక్ష ప్రభావం కలిగి ఉండడంతో పిల్లల చదువుల కోసం 1985లో వీరంతా ఖమ్మం వెళ్లిపోయారు. అయితే సరళ పైకి చెప్పకున్నా ఎలాగైనా ఉద్యమంలోకి వెళ్లి పోరాడాలని డిసైడ్ అయ్యింది. ఇంటర్‌ మొదటి సంవత్సరం పూర్తి చేయగానే ఇంట్లో చెబితే వద్దంటారని కుటుంబసభ్యులకు చెప్పకుండా అడవిబాట పట్టింది సరళ. పీపుల్స్‌వార్‌లో పనిచేస్తున్న శంకరన్నను వెతుక్కుంటూ ఖమ్మం నుంచి నిజామాబాద్‌ అడవుల్లోకి వెళ్ళింది. అయితే పీపుల్స్‌వార్‌ ఉద్యమకారులు సరళను పోలీస్‌ ఇన్‌ఫార్మర్‌ అనుకొని చంపేశారు. సరళ ఇంట్లో నుంచి వెళ్లాక సుమారు 35 రోజులకు పీపుల్స్‌వార్‌ విడుదల చేసిన లేఖ ద్వారా సరళ చనిపోయిందని కుటుంబ సభ్యులకు తెలిసి విషాదంలో మునిగిపోయారు.

సరళ జీవితం ఆధారంగా తీసిన విరాటపర్వం కథ ఎలా ఉంటుందని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సరళ సోదరుడు, వరంగల్‌లోని ప్రశాంతి ఆసుపత్రి ఛైర్మన్‌ తూము మోహన్‌రావును దర్శకుడు వేణు మూడు నెలల కిందట కలిసి సరళ జీవితాన్ని విరాటపర్వం చిత్రంగా తీస్తున్నట్టు చెప్పారు. అంతకుముందే దర్శకుడు ఆమె గురించి ఎంతో పరిశోధన చేసి అనేక విషయాలు తెలుసుకున్నారు. అడవికి వెళ్లాక సరళ అనుభవించిన కష్టాలు, ఎదుర్కొన్న సవాళ్లను లోతుగా పరిశీలించి చిత్రాన్ని రూపొందించారు.

ఇక సరళ పాత్రలో నటించిన సాయి పల్లవి ఇటీవల వరంగల్ లో జరిగిన విరాటపర్వం ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొనగా అదే సమయంలో సరళ తల్లి, కుటుంబసభ్యులను కూడా ఆమె కలిశారు. సాయి పల్లవిని చూడగానే మా చెల్లెలు సరళను చూసినట్టు అనుభూతి పొందామని, దశాబ్దాల కిందట మా నుంచి దూరమైన చెల్లి మళ్లీ వచ్చినట్టు భావోద్వేగానికి గురయి అంతా ఏడ్చేశామని, మా అమ్మ కూడా ఎంతో ప్రేమతో సాయి పల్లవిని దగ్గరికి తీసుకుందని, సాయి పల్లవి కూడా కన్నీరు పెట్టుకొందని, సాయి పల్లవికి మా ఇంటి ఆడపడుచులా చీర పెట్టి పంపించామని సరళ అన్నయ్య మోహన్‌రావు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అలాగే సినిమా తీయడంలో దర్శకుడికి పూర్తి స్వేచ్ఛ ఉండాలని అందుకే కథలో మార్పులు, చేర్పులు ఏమి చెప్పలేదని, సినిమాను శుక్రవారం విడుదల రోజే కుటుంబ సభ్యులమంతా చూస్తున్నామని, అప్పుడు మా చెల్లి తెలిసీ తెలియక చేసిన పనికి కాల్చేసి ఉండకూడదని, కానీ ఆ తర్వాత పీపుల్స్‌వార్‌ వాళ్లు క్షమాపణలు చెప్తూ లేఖ రాశారని సరళ అన్నయ్య మోహనరావు వివరించారు.

అలాగే విరాటపర్వం దర్శకుడు వేణు ఊడుగుల కూడా వరంగల్‌ కి చెందిన వ్యక్తే. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లికి చెందిన వేణు గతంలో శ్రీవిష్ణుతో ‘నీదీ నాది ఒకే కథ’ సినిమా తీశాడు. వరంగల్‌ ప్రాంతానికి చెందిన వాడు కావడం వల్లే విప్లవ నేపథ్యమున్న సరళ జీవిత కథను ఎంపిక చేసుకొని ఇలా విరాటపర్వం సినిమాని తెరకెక్కించారు.