గణతంత్రదినోత్సవం రోజున.. గ్రామసేవకు శ్రీకారం..

  • Published - 06:37 AM, Sat - 25 January 20
గణతంత్రదినోత్సవం రోజున.. గ్రామసేవకు శ్రీకారం..

ఈ నెల 26 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్నిగ్రామ మరియు వార్డు సచివాలయాలు అందుబాటులోకి రానున్నాయని, గ్రామ/వార్డుల పరిధిలోని ప్రజలందరూ ఇకపై ఈ సచివాలయం సేవలు వినియోగించుకోవచ్చని రాష్ట్ర మున్సిపల్‌ శాఖ కమిషనర్‌ విజయ్‌కుమార్‌ వెల్లడించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇకమీదట అన్ని పౌర సేవలు సచివాలయాలు ద్వారా అందిస్తామని దేశంలో ఇన్ని సేవలు గ్రామాలు, వార్డు స్థాయిలోనే అందిస్తున్న మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఒక్కటేనని ఆయన స్పష్టం చేశారు.

ఇప్పటికే సచివాలయాలకు అవసరమైన మౌలిక వసతులను కల్పించామని వచ్చే నెల నుంచి గ్రామ మరియు వార్డు సచివాలయాలు, వాటి పరిధిలోని వాలంటీర్ల ద్వారా పింఛన్ల చెల్లింపులు చేస్తామని చెప్పారు. రెండు నెలల్లో మొత్తం సేవలన్నీ పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. ఇకమీదట దరఖాస్తు చేసుకున్న 24 గంటల్లో కొన్ని సేవలను, 72 గంటల్లో కొన్ని సేవలను అందిస్తామని వివరించారు. అంతేకాకుండా ప్రతి రోజు సచివాలయాల్లో “స్పందన” కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. దరఖాస్తు దారులు నేరుగా సచివాలయం దగ్గరికి వచ్చి స్వయంగా దరఖాస్తు చేసుకోవచ్చని విజయ్ కుమార్ తెలిపారు. అన్ని గ్రామాలు, మున్సిపాలిటీల్లో నివసిస్తున్న ప్రజలకు ప్రభుత్వ సేవలు తక్షణమే అందుతాయని కమిషనర్‌ పేర్కొన్నారు.

Read Also: వేడుకలు విజయవాడలోనే!

అధికార వికేంధ్రీకరణలో భాగంగా గ్రామ మరియు వార్డు స్థాయిలోనే ప్రజలకు ప్రభుత్వ సేవలను త్వరితగతిన అందించడానికి దేశంలోనే మొదటిసారి రాష్ట్రప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఈ సచివాలయ వ్యవస్థ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 14,944 గ్రామ మరియు వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసింది. దీనికి గాను ఏపిపియ్యస్సి ద్వారా నిర్వహించిన రాత పరీక్ష ద్వారా మొత్తం 1,26,728 మంది ఉద్యోగులను శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేసిన విషయం తెలిసిందే.

ముందుగా అనుకున్నట్టు గాంధీజీ కలలు కన్న గ్రామా స్వరాజ్యానికి ప్రతీకగా ఉన్న ఈ వ్యవస్థని గత ఏడాది అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున  ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభించినప్పటికీ, పూర్తి స్థాయిలో సచివాలయాలు పనిచేయడానికి కావాల్సిన మౌలిక వసతులు కల్పించి జనవరి ఒకటి నుండి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావించింది. అయితే ఉద్యోగుల భర్తీలో శాఖాపరమైన జాప్యం వల్ల ఈ కార్యక్రమం కొంత వాయిదా పడింది.

ఎట్టకేలకు ఈ నెల 26 న గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని గ్రామ, వార్డు సచివాలయలు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. వీటి ద్వారా అన్ని రకాల ధ్రువీకరణ పత్రాలు, పన్నులు, రుసుముల చెల్లింపులు, ఫించన్ చెల్లింపులు, సంక్షేమ పధకాల లభ్డిదారుల గుర్తింపు వంటి దాదాపు 530 రకాల ప్రభుత్వ సేవలు ప్రజలకు అందనున్నాయి.

Show comments