Idream media
Idream media
గాంధీ మహాత్ముడు కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని ఆంధ్రప్రదేశ్‌లో సాకారం చేస్తూ వైఎస్ జగన్ సర్కార్ ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయాలు అత్యున్నత సేవలు అందిస్తున్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రజల సమస్యలు వారి గ్రామం, ప్రాంతంలోనే పరిష్కారం అయ్యేలా రాష్ట్ర వ్యాప్తంగా 15,004 గ్రామ, వార్డు సచివాలయాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. గత ఏడాది గాంధీ జయంతి రోజున (అక్టోబర్ –2) గ్రామ, వార్డు సచివాలయాలను వైసీపీ ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభించింది. దాదాపు 1.40 లక్షల మంది ఉద్యోగులను శాశ్వత విధానంలో భర్తీ చేయడం, భవనాలు, మౌలిక సదుపాయాల కల్పన వంటి చర్యల అనంతరం గ్రామ, వార్డు సచివాలయాలు జనవరి నుంచి సేవలు అందించడం ప్రారంభించాయి.
ప్రజలకు అవసరమైన అన్ని సేవలు గ్రామ, వార్డు సచివాలయాల్లో లభిస్తున్నాయి. దాదాపు 540 రకాల సేవలు సచివాయాలు ప్రజలకు అందిస్తున్నాయి. నిర్ణీత కాల వ్యవధిలో ప్రజల సమస్యలను పరిష్కరిస్తున్నాయి. గతంలో గ్రామాల వైపు కన్నెత్తి కూడా చూడిన పంచాయతీ కార్యదర్శులు, వీఆర్‌వోలు నేడు ప్రతి రోజు ఉదయ 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ గ్రామ సచివాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు.
సచివాలయాలు ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారం కోసం స్పందన కార్యక్రమం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. గతంలో గ్రీవెన్స్ పేరుతో ప్రతి సోమవారం మండల తహసీల్దార్ కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించేవారు. అయితే వైసీపీ ప్రభుత్వం సచివాలయాలు ఏర్పాటు చేసి ప్రజల నుంచి వినతులను స్థానికంగానే స్వీకరిస్తూ వాటిని సంబంధిత మండల అధికారులకు పంపిచి పరిష్కరిస్తోంది. వారంతో పనిలేకుండా ప్రతి రోజూ సచివాలయాల్లో స్పందన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. గ్రామ సచివాలయాలు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే దాదాపు ఆరు నెలల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 33 లక్షల వినతులు పరిష్కరించినట్లు గ్రామ, వార్డు సచివాలయాలు, స్పందన కార్యక్రమంలో ముఖ్యమంత్రి సలహాదారు ఆర్.ధనుంజయ్‌రెడ్డి తెలిపారు.
ఆగస్టులో సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి రచ్చబండ కార్యక్రమం నిర్వహించాలని సూచన ప్రాయంగా నిర్ణయించిన విషయం తెలిసిందే. తాను వచ్చినప్పుడు ఎవరూ అర్హత ఉండి ఫలానా పథకం అందడం లేదని చెప్పకూడదంటూ ఇప్పటికే సీఎం జగన్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ పర్యటనలో భాగంగా సీఎం జగన్ తాను వెళ్లిన గ్రామంలోని సచివాలయాన్ని సందర్శించనున్నారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ గతంలో చేసిన సూచనలు, ఆదేశాల మేరకు అందుకు అనుగుణంగా పథకాలు, ప్రభుత్వ సేవల్లో ఎలాంటి లోటు లేకుండా చూడాలని గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి ఆర్.ధనుంజయ్ రెడ్డి సూచించారు. అంతేకాదు ప్రభుత్వానికి సంబంధించి ప్రజలకు ఉపయోగపడే అన్ని ముఖ్యమైన ఫోన్ నంబర్లను ,సంక్షేమ పథకాల అమలు క్యాలెండర్‌ను, సచివాలయాల ద్వారా లభించే 540 రకాల సేవల వివరాలు.. గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శించాలని స్పష్టం చేశారు.