iDreamPost
iDreamPost
ఈగతో విలన్ గా మనకు పరిచయమై బాహుబలి, సైరాలో చిన్న క్యామియోలు చేసి మెప్పించిన కిచ్చ సుదీప్ కన్నడలో పెద్ద స్టార్. రవితేజలాగా తనకు శాండల్ వుడ్ లో పెద్ద మార్కెట్ ఉంది. కాకపోతే ఇతని డబ్బింగ్ సినిమాలు ఇక్కడ అంతగా ఆడకపోవడంతో ప్రత్యేకంగా ఫాలోయింగ్ అంటూ లేకపోయింది. అయినా కూడా హిందీ మూవీస్ రెగ్యులర్ గా చూసేవాళ్లకు సుదీప్ రెగ్యులర్ గా కనిపించే టైపు. తన కెరీర్ లోనే మొట్టమొదటిసారిగా అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన విక్రాంత్ రోనా ఇవాళ విడుదలైంది. కంప్లీట్ త్రీడి ఎక్స్ పీరియన్స్ తో తీసిన చిత్రంగా ప్రచారం జోరుగా చేశారు. మరి దానికి తగ్గట్టే బొమ్మ ఉందో లేదో రివ్యూలో చూద్దాం
కథ
దట్టమైన అటవీ ప్రాంతంలో కొమరొట్టు అనే చిన్న గ్రామం. అక్కడ చిన్నపిల్లలు హఠాత్తుగా మాయమై కొద్దిరోజుల తర్వాత శవాలుగా తేలతారు. ఈ రహస్యాన్ని ఛేదించాలని చూసిన వారందరిని బ్రహ్మరాక్షసుడు పేరుతో ఓ దెయ్యం చంపేస్తుందని రకరకాలుగా చెప్పుకుంటారు. ఈ కేసు కోసమే అక్కడికి పోలీస్ ఆఫీసర్ గా వస్తాడు విక్రాంత్ రోనా(సుదీప్). రాగానే ప్రమాదాలు చుట్టుముడతాయి. తాను అనుకున్నంత సులభంగా ఈ పద్మవ్యూహం లేదని అర్థం చేసుకుంటాడు. చిక్కుముడులు విప్పే కొద్దీ విభ్రాంతి కలిగించే రహస్యాలు బయటపడతాయి. స్వంత కూతురినే రిస్క్ లో పెట్టాల్సి వస్తుంది. ఆ తర్వాత జరిగేది తెరమీద చూస్తేనే కిక్
నటీనటులు
చక్కని విగ్రహంతో గంభీరమైన స్వరంతో మ్యాన్లీగా ఉండే సుదీప్ విక్రాంత్ రోనాగా పర్ఫెక్ట్ గా ఛాయస్. చాలా సులభంగా క్యారీ చేసి సెటిల్డ్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో భావోద్వేగాలు, యాక్షన్ ఎపిసోడ్స్ లో పోరాటాలు బాగా వచ్చాయి. తను ఎంతగా ఇష్టపడి ఈ పాత్ర చేసాడో ఇంటర్వెల్ బ్యాంగ్ లో అర్థం చేసుకోవచ్చు. చాంతాడంత డైలాగులు లేకుండా కేవలం ఎక్స్ ప్రెక్షన్లు ఎక్కువగా ఇవ్వాల్సిన క్యారెక్టర్ లో అలా ఒదిగిపోయాడు. తనకు ప్రత్యేకంగా హీరోయిన్ అంటూ ఎవరూ లేకపోయినా ఇలాంటి ప్రయోగాలకు సిద్ధపడటం మంచి నిర్ణయం. ఫ్యాన్స్ కోసమని చెప్పి కమర్షియల్ చక్రంలో ఇరుక్కోకపోవడం ఆహ్వానించాలి
జాక్వలైన్ ఫెర్నాండేజ్ ఐటెం సాంగ్ కే పరిమితమయ్యింది. మాస్ కి పేలింది ఇదొక్కటే. రెండు సీన్లు ఉన్నాయి కానీ అవి అనవసరమే.
నిరూప్ భండారి లుక్స్ పరంగా బాగున్నాడు కానీ మరీ తన స్టేచర్ కి మించిన బరువైన పాత్ర అనిపిస్తుంది. ట్విస్ట్ పరంగా చూస్తే ఓకే అనుకుని సర్దుకోవచ్చు.ఉన్న క్యాస్టింగ్ లో మధుసూదన్ రావు ఒక్కడే తెలుగువాడు. మిగిలినవన్నీ కన్నడ మొహాలే కాబట్టి పరిచయమున్న వారు ఎవరూ కనిపించరు. నీతా అశోక్, రవిశంకర్ గౌడ, వాసుకి వైభవ్, సిద్దు మూలిమని, చిత్కల బిరదర్, రమేష్ కుక్కువల్లి తదితరులు వాళ్ళకిచ్చిన వేషాలకు తగ్గట్టు డీసెంట్ గా సరిపోయారు. స్కోప్ ఎవరికీ పెద్దగా లేదు
డైరెక్టర్ అండ్ టీమ్
సాధారణంగా డెబ్యూతోనే బ్లాక్ బస్టర్ సాధించిన దర్శకులు కొంత కాలం ఆ హ్యాంగోవర్ లో ఉంటారు. అది సహజం. తమ మీద పెరిగిపోయిన అంచనాలు అందుకోవడానికో లేక వేరే జానర్ ను సరిగా హ్యాండిల్ చేయగలమో లేదో అన్న అనుమానమో రిస్క్ చేసేందుకు ఇష్టపడక అదే ఫార్ములాని రిపీట్ చేస్తారు. విక్రాంత్ రోనా దర్శకుడు అనూప్ భండారి మొదటి సినిమా 2015లో వచ్చిన రంగితరంగ. బెంగళూరులో ఏడాది ఆడిన సెన్సేషన్ ఇది. స్వతహాగా సంగీతం సాహిత్యం రెండింటి మీదా పట్టున్న అనూప్ దాన్ని హ్యాండిల్ చేసిన తీరు విమర్శకులను మెప్పించింది. దెబ్బకు టాక్ అఫ్ ది ఇండస్ట్రీగా మారాడు.
తర్వాత రాజరధ అనే మరో కామెడీ మూవీ చేశాడు అదేమంత క్లిక్ కాలేదు. దెబ్బకు తిరిగి రంగితరంగ స్కూల్ కే వెళ్ళిపోయాడు. వరసగా జరిగే క్రైమ్స్ చుట్టూ ఊహించని మలుపులు పేర్చుకుంటూ చివర్లో విలన్ ఎవరో మతిపోయేలా రివీల్ చేయడం అందులో బాగా పేలింది. ఆ మాటకొస్తే మనకీ ట్రీట్మెంట్ కొత్త కాదు. అవే కళ్ళుతో మొదలుపెట్టి అన్వేషణ దాకా, కోకిలతో స్టార్ట్ చేసి మంత్ర దాకా మనం ఎన్నో చూశాం. కానీ అనూప్ సెట్ చేసుకునే టోన్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఈ విక్రాంత్ రోనాలోనూ ఆ మార్కు చూపించాడు. కానీ బ్యాక్ గ్రౌండ్ ఎంత వైవిధ్యంగా ఉన్నా ప్రేక్షకులను ఎంగేజ్ చేయాల్సింది స్క్రీన్ ప్లేనే. విక్రాంత్ ఇక్కడే తడబడ్డాడు
ట్రైలర్ కట్ చూసి ఇందులో చాలా ఆశిస్తాం. థ్రిల్స్ ఉంటాయని ఎక్స్ పెక్ట్ చేస్తాం. కానీ బిగినింగ్ లో చిన్న ఝలక్ ఇచ్చిన అనూప్ ఫస్ట్ హాఫ్ ని సాదాసీదాగా నడిపించిన తీరు బోర్ కొట్టిస్తుంది. పాత్రలను సుదీర్ఘంగా పరిచయం చేయడం, వాటి మధ్య రిలేషన్స్ ని బాగా సాగదీయడం విసిగిస్తుంది. పోనీ హత్యలు జరిగినప్పుడు దానికి ముందు వెనుకా నడిచే టెంపో అరెస్టింగ్ గా ఉందా అంటే అదీ లేదు. కొన్ని ఎపిసోడ్స్ చాలా బాగా వచ్చాయి. ఆర్ట్ డిపార్ట్ మెంట్ తో పోటీ పడుతూ అనూప్ పరుగులు పెట్టాడు. కానీ అవి కొన్ని నిముషాలు ఉంటే ఏంటిది ముందుకు సాగదనిపించే ప్రహసనాలు బోలెడు ఉన్నాయి. అదే విక్రాంత్ కున్న పెద్ద మైనస్.
రంగితరంగి చూడని వాళ్ళను ఓ పది శాతం దీని సెటప్ కొత్తగా అనిపిస్తుంది కానీ ముందుకు వెళ్లే కొద్దీ అవసరం లేని పాటలు, ఎమోషన్ల పేరుతో డ్రాగ్ చేసిన సీన్లు ముందు వచ్చిన ఫీల్ ని పోగొడతాయి. సెకాంఫ్ హాఫ్ లో వేగం ఉన్నప్పటికీ అది సరిపోలేదు. ఇలాంటి కథల్లో ఒక్కో ట్విస్టుని ఓపెన్ చేసుకుంటూ పోవడం మైండ్ బ్లోయింగ్ అనిపించాలి. కానీ అదేమీ ఉండదు. అరే భలే తిప్పాడే అనే చిన్న ఫీలింగ్ కలుగుతుంది కానీ రాక్షసుడు టైపులో సీటు చివరి అంచుకు వచ్చే తరహాలో సాగదు. అనూప్ లోని టెక్నిషియన్ ఫెయిల్ అవ్వలేదు. కానీ తనలో రైటర్ వీక్ అవ్వడంతో విక్రాంత్ రోనా సోసోగా అనిపిస్తాడు తప్ప గొప్ప అనుభూతిని ఇవ్వలేకపోయాడు.
ఆ మధ్య అతడే శ్రీమన్నారాయణ అనే సినిమా వచ్చింది. 777 ఛార్లీ రక్షిత్ శెట్టి హీరో. అక్కడి జనం ఆదరించారు. కానీ మన దగ్గర వర్కౌట్ అవ్వలేదు. ఇది కూడా అదే కోవలోకే చేరేలా ఉంది. ఈ మాత్రం దానికి త్రీడి అని పదే పదే పబ్లిసిటీలో చెప్పుకోవడం ఎందుకో అర్థం కాదు. సుదీప్ కోసమో లేదా ఒక డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్ కొసమో అయితే ఈ విక్రాంత్ రోనాను నార్మల్ 2డిలో చూడటం బెటర్. ఎఫెక్ట్స్ కూడా పెద్దగా లేవు. అంత పెద్ద ఆర్ఆర్ఆరే అద్దాలు పెట్టుకుని చూస్తే ఏమంత స్పెషల్ గా అనిపించలేదు. అలాంటిది ఈ విక్రాంత్ రోనా నుంచి ఆశించడం వృధా. ఈ వెర్షన్ వద్దనుకోవడం వల్ల దానికయ్యే అదనపు ఖర్చుని ఆదా చేసుకోవచ్చు.
ఇదంతా పక్కనపెడితే ఇలాంటి ప్రయోగాలు ఇంకా రావాలి. కాకపోతే జనం ఆమోదించారు కదాని ఒకసారి వాడేసిన టెంప్లేట్ ని తిరిగి వాడితే చాలా రిస్క్ అవుతుంది. కమర్షియల్ కథలను మనం ఎన్నిసారైనా తిప్పి తిప్పి చెప్పొచ్చు. మాస్ మసాలాల అండతో అవి గట్టెక్కుతాయి. కానీ హారర్ థ్రిల్లర్స్ కు ఆ వెసులుబాటు ఉండదు. అందులోనూ స్టార్ హీరోలతో డీల్ చేస్తున్నప్పుడు. అనూప్ భండారి రంగితరంగ, బాలీవుడ్ మూవీ తుంబడ్ ప్రేరణతో ఈ విక్రాంత్ రోనాని ఒక గ్రాండ్ స్కేల్ మీద ఆవిష్కరించాలని ప్రయత్నించాడు. దానికి ప్రశంసించాల్సిందే. కాకపోతే తర్వాత తీసే సినిమా అయినా మరో ఊహాతీత ప్రపంచంలోకి తీసుకెళ్తాడని ఆశిద్దాం
సంగీత దర్శకుడు అజనీష్ లోకానాధ్ బ్యాక్ గ్రౌండ్ కొన్నిచోట్ల బాగా ఎలివేట్ అయ్యింది. కొన్ని సందర్భాల్లో సౌండ్ తప్ప ఎలాంటి మేజిక్ చేయలేకపోయింది. ఓవరాల్ గా చూసుకుంటే ఇంకా బెటర్ ఉంటే బాగుండేదేమోననే ఫీలింగ్ కలుగుతుంది. రారా రక్కమ్మ పాట ఒక్కటే బాగుంది. మిగిలినవి తీసేసినా బాగుండేది. ఆషిక్ కుసుగొల్లి ఎడిటింగ్ ఇంకొంచెం లెన్త్ ని తగ్గించాల్సింది. జీ స్టూడియోస్ తో కలిసి బడ్జెట్ పెట్టిన సుదీప్ రాజీ పడలేదు కానీ మరీ కళ్లుచెదిరే స్థాయిలో వందల కోట్లేమీ ఖర్చు కాలేదనిపిస్తుంది. కెజిఎఫ్ రేంజ్ గ్రాండియర్ ని ఆశించకుండా చూస్తే శాండల్ వుడ్ స్టాండర్డ్ పెరిగిందని చెప్పడానికి విక్రాంత్ పనికొస్తుంది
ప్లస్ గా అనిపించేవి
కిచ్చ సుదీప్
స్టోరీ బ్యాక్ గ్రౌండ్
కొన్ని ట్విస్టులు
ఛాయాగ్రహణం
మైనస్ గా తోచేవి
ఫస్ట్ హాఫ్
పాటలు (రక్కమ్మ కాకుండా)
సాగతీత
అవసరం లేని ఎమోషన్లు
కంక్లూజన్
మనం తెరమీద అరుదుగా చూసే ఒక విభిన్నమైన గ్రామీణ చీకటి వాతావరణాన్ని చూపించడంలో విక్రాంత్ రోనా సక్సెస్ అయ్యాడు. దాని తగ్గట్టే బలమైన కథా కథనాలు సెట్ చేసుకుని ఉంటే సుదీప్ కోరుకున్నట్టే అన్ని భాషల్లోనూ ల్యాండ్ మార్క్ మూవీ అయ్యేది. కానీ కన్నడ వెర్షన్ సంగతేమో కానీ మన ఆడియన్స్ కి సూట్ కాని, సింక్ అవ్వని అంశాలు ఇందులో చాలా ఉన్నాయి. లాజిక్స్ అవసరం లేకపోయినా చూపించిన మేజిక్ అయినా మెస్మరైజ్ చేసేలా ఉండాలి. ఈ సినిమాలో అవి పూర్తి స్థాయిలో పండలేదు. వారానికోసారి థియేటర్ కు వెళ్ళకపోతే ఏం తోచదు అనుకుంటే ఓ ట్రయిల్ వేయొచ్చు కానీ అంచనాలను హద్దుల్లో పెట్టుకునే సుమా
ఒక్క మాటలో : సాదాసీదా రోనా
రేటింగ్ : 2.5 / 5