iDreamPost
iDreamPost
కమల్ హాసన్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ విక్రమ్ మూడో వారంలోకి అడుగుపెడుతున్నా స్పీడ్ తగ్గడం లేదు. ముఖ్యంగా మాస్ సెంటర్స్ ఫీవర్ మాములుగా లేదు. రెగ్యులర్ ఫార్మాట్ కాకపోయినా దర్శకుడు లోకేష్ కనగరాజ్ సినిమాని తీర్చిదిద్దిన తీరు అందరినీ మెప్పిస్తోంది. తెలుగు వెర్షన్ హక్కులు సొంతం చేసుకున్న నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డికి ఏకంగా డబుల్ ప్రాఫిట్స్ వచ్చినట్టు ట్రేడ్ రిపోర్ట్. 6 కోట్లకు హక్కులు కొంటే ఏకంగా 13 కోట్లు ఇంత తక్కువ టైంలో దాటేయడం మాములు విషయం కాదు. విచిత్రంగా నిన్న కొన్ని సెంటర్లలో లేటెస్ట్ రిలీజ్ అంటే సుందరానికి కంటే విక్రమ్ కే ఎక్కువ వసూళ్లు రావడం వినడానికి షాక్ గా అనిపించినా వాస్తవం ఇదే.
ముఖ్యంగా నైజామ్ లో విక్రమ్ జోరు ఓ రేంజ్ లో ఉంది. ఒక్క ఆ ఏరియా నుంచే 6 కోట్ల దాకా షేర్ వచ్చేసింది. సీడెడ్ 1 కోటి 83 లక్షలు, ఉత్తరాంధ్ర 2 కోట్లు, ఈస్ట్ వెస్ట్ కలిపి 1 కోటి 70 లక్షలు, గుంటూరు 90 లక్షలు, కృష్ణా 1 కోటి, నెల్లూరు 49 లక్షలు ఇలా ఏ సెంటర్ చూసినా డిస్టిబ్యూటర్లు మంచి లాభాల్లోకి వెళ్లిపోయారు. గ్రాస్ లెక్కలో చూసుకుంటే కేవలం 11 రోజులకే విక్రమ్ 24 కోట్ల 20 లక్షల దాకా తేవడం కమల్ కెరీర్ కి టాలీవుడ్ లో కొత్త రికార్డు. ఫైనల్ గా ఎక్కడ ఆగుతుందో చెప్పలేం కానీ రాబోయే రోజుల్లో దగ్గరగా ఏ మాస్ మూవీ లేకపోవడం కలిసివచ్చేలా ఉంది. పోటీగా ఉన్న మేజర్ స్లో అవ్వడంతో బాక్సాఫీస్ కంప్లీట్ గా కమల్ కంట్రోల్ లోకి వెళ్తోంది.
ఈ ఆనందం తట్టుకోలేకే కమల్ రెండు సార్లు హైదరాబాద్ లో ఈవెంట్లు చేశారు. చిరంజీవి ఇంటికి వెళ్లి మరీ సల్మాన్ ఖాన్ తో పాటు తన సంతోషాన్ని పంచుకున్నారు. ఈ స్థాయి రెస్పాన్స్ ఊహించలేదు కాబట్టి తక్కువ ధరకు ఇక్కడ రిలీజ్ చేశారు. కట్ చేస్తే అంచనాలకు మించి విక్రమ్ ఆడేస్తోంది. దెబ్బకు రాబోయే ఇండియన్ 2 కు డిమాండ్ పెరగడం ఖాయం. అంతే కాదు మూలానపడేసిన శభాష్ నాయుడుని బయటికి తీస్తారని తెలిసింది. మొత్తానికి సక్సెస్ ఇచ్చిన కిక్ తో కమల్ కు బిగ్ బాస్, రాజకీయాలు ఇవేవి గుర్తుకురావడం లేదు. నెక్స్ట్ ప్రాజెక్టుల మీద సీరియస్ గా దృష్టి పెట్టడం స్టార్ట్ చేశారు. అందులో విక్రమ్ 2 కూడా ఉంది.