iDreamPost
android-app
ios-app

విజ‌య‌సాయిరెడ్డి ప్ర‌జా ద‌ర్బార్ : ఎంపీని క‌ల‌వ‌డం ఇక ఈజీ..!

విజ‌య‌సాయిరెడ్డి ప్ర‌జా ద‌ర్బార్ : ఎంపీని క‌ల‌వ‌డం ఇక ఈజీ..!

ఉత్త‌రాంధ్ర స‌మ‌స్య‌ల‌పై పార్ల‌మెంట్ లో గ‌ళం విప్పుతూ, సంచ‌ల‌నం సృష్టిస్తున్న వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. తాను ప్ర‌జాప్ర‌తినిధిని అని చాటి చెబుతూ కొత్త కార్యక్ర‌మానికి శ్రీ‌కారం చుడుతున్నారు. ఇప్పుడు ప్రజా దర్బార్ పేరిట ప్రజలతో ప్రతి నిత్యం అనుసంధానం కాబోతున్నారు. విశాఖ సహా ఉత్తరాంధ్రా జిల్లాల సమస్యలపైన ప్రజలు తనకు ప్రతీ రోజూ మధ్యాహ్నం మూడు నుంచి ఆరు గంటల లోపల కలవవచ్చు అని ఆయన చెబుతున్నారు. ముందస్తు అప్పాయింట్మెంట్ లేకుండా నేరుగా ప్రజా దర్బార్‌కి ఎవరైనా వచ్చి తమ సమస్యలను చెప్పుకోవచ్చు. వాటిని అప్పటికపుడు ఎంపీ పరిశీలించి సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులకు తెలియచేయడం ద్వారా వాటి పరిష్కారానికి కృషి చేస్తారు.

విజయసాయిరెడ్డి విశాఖలో గత ఆరేళ్ళుగా ఉంటున్నారు. ఆయన రాజ్యసభ సభ్యుడిగా విశాఖను నోడల్ జిల్లాగా చేసుకున్నారు. తన ఎంపీ నిధులను విశాఖలోనే ఖర్చు చేస్తూ వస్తున్నారు. తనకున్న పలుకుబడితో అనేక సమస్యలను ఆయన ఇంతవరకూ పరిష్కరిస్తూ వచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆయన ముప్పయి రెండు కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రను కూడా చేపట్టి జనాల మనసు చూరగొన్నారు. వైసీపీకి ఉత్తరాంధ్రలో రాజకీయంగా ఆయన అతి పెద్ద బలంగా మారారు. ఇక విజయసాయిరెడ్డి నాయకత్వంలో 2019 ఎన్నికల్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది.

ఇక ఏడాది జరిగిన లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా వైసీపీ తిరుగులేని ఆధిక్యతను కనబరచడం వెనక విజయసాయిరెడ్డి చాణక్య రాజకీయం ఉంది. ఇక విజయసాయిరెడ్డి ఇప్పటిదాకా తన వద్దకు వచ్చిన వారి సమస్యలను పరిష్కరిస్తున్నారు. అయితే రానున్న రోజులలో ప్రజలతో మరింత ఎక్కువగా ఇంటరాక్ట్ కావాలన్న ఉద్దేశ్యంతో ఆయన ప్రజా దర్బార్ కి శ్రీకారం చుట్టారు. అధికార పార్టీ ఎంపీగా ప్రభుత్వ పరంగా ఉన్న సమస్యలను ఎప్పటికపుడు తెలుసుకుని పరిష్కరించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని చెబుతున్నారు. మొత్తానికి విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్రలో తనదైన పద్ధతిలో జనాలకు మరింత చేరువ అయ్యేందుకు ప్రజా దర్బార్‌ని రూపకల్పన చేశారు అంటున్నారు.

Also Read : ఇళ్ల పట్టాల నిలుపుదల టీడీపీ పనే.. అసలు సంగతి బయట పెట్టిన సజ్జల