iDreamPost
iDreamPost
సాధారణంగా ఏ నటుడికైనా కొన్ని పరిమితులు ఉంటాయి. అందులోనూ ముఖ్యంగా హీరోలకు. అయితే క్యారెక్టర్ ఆర్టిస్టులకు అలాంటి హద్దులు ఏమి ఉండవు. సరిగ్గా వాడుకుంటే ఆకాశమే హద్దుగా చెలరేగుతారు. అందులో ఒకరు కైకాల సత్యనారాయణ గారు. ఎన్టీఆర్ డూప్ గా నటిస్తూ ఆపై నటుడిగా మారి ఒక్కో మెట్టు ఎక్కుతూ తనకు మాత్రమే సొంతమైన ప్రత్యేక శైలి అలవరుచుకున్న ఈ విలక్షణ నటుడు ఇప్పటిదాకా ఏడు వందలకు పైగా సినిమాలు చేయడం చిన్న విషయం కాదు. అందులో దాదాపు అన్ని కీలక పాత్రలే కావడం ఆయన ప్రతిభకు దర్శకులు ఇచ్చిన గుర్తింపుకు తార్కాణం. కైకాల గారు 1935లో ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా కోతవరం గ్రామంలో జన్మించారు. విద్యభాస్యం విజయవాడ, గుడివాడలో పూర్తి చేశారు. 1960లో నాగేశ్వరమ్మ గారితో వివాహమయ్యింది.
దానికి సరిగ్గా సంవత్సరం ముందు 1959లో చెంగయ్య దర్శకత్వంలో వచ్చిన సిపాయి కూతురులో వేషం ఇచ్చారు. కాని సినిమా ఫ్లాప్ అయ్యింది. ఎస్డి లాల్ డైరెక్షన్ లో వచ్చిన సహస్ర శిరచ్చేద చింతామణిలో యువరాజుగా నటించాక అందరి దృష్టిలో పడ్డారు. అయితే పెద్ద బ్రేక్ వచ్చింది మాత్రం విట్టలాచార్య గారి వల్లే. కనకదుర్గా పూజా మహిమలో ఇచ్చిన విలన్ వేషం సత్యనారాయణలోని రియల్ ఆర్టిస్ట్ ని బయట పెట్టింది. అది మొదలు ఆయన ఇక వెనుదిరిగి చూడాల్సిన అవసరం పడలేదు. పాండవ వనవాసం, చిక్కడు దొరకడు, ఉమ్మడి కుటుంబం, నిర్దోషి, ఆలీబాబా 40 దొంగలు, సంపూర్ణ రామాయణం, ఖైది బాబాయ్, తాతా మనవడు, శారద, నిప్పు లాంటి మనిషి, చదువు సంస్కారం, జీవన జ్యోతి, యుగంధర్, తూర్పు పడమర, ఆలు మగలు, చాణక్య చంద్రగుప్తా, బంగారు గాజులు ఇలా ఒకటా రెండా లెక్కలేనన్ని బ్లాక్ బస్టర్స్ అశేషమైన అభిమానులను సంపాదించిపెట్టాయి.
మొరటోడుతో హీరోగా కూడా చేశారు. యముడిగా నటించిన యమగోల ఈయన్ని ఇంకో స్థాయికి తీసుకెళ్ళింది. ఎన్టీఆర్-ఎఎన్ఆర్ తరం ప్రభావం తగ్గిపోయాక చిరు బాలయ్య లాంటి సెకండ్ జనరేషన్ హీరోల సినిమాల్లోనూ అద్భుతమైన పాత్రలు దక్కించుకున్నారు సత్యనారాయణ. ఆఖరి పోరాటం, కొండవీటి దొంగ, బొబ్బిలి రాజా, నారి నారి నడుమ మురారి లాంటి ఎన్నో మరపురాని హిట్స్ వాళ్ళతో ఉన్నాయి. నిర్మాతగానూ మారి చిరంజీవి, కొదమ సింహం, బంగారు కుటుంబం, ముద్దుల మొగుడు సినిమాలను అందించారు. ఎంత వయసు మళ్ళినా ఇప్పటికీ నటించేందుకు ఉత్సాహపడే కైకాల గత ఏడాది ఎన్టీఆర్ కథానాయకుడులో నటించారు. ఆ తర్వాత విశ్రాంతి తీసుకోవడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. మూడో జెనరేషన్ హీరో మహేష్ బాబు మురారిలోనూ తన ఉనికిని చాటుకున్న నట శిఖరం కైకాల. అందుకే ప్రతి జన్మదినం ఈయన నటించిన ఆణిముత్యాల్లాంటి సినిమాలతో ప్రేక్షకులు అలా జ్ఞాపకాల సముద్రంలోకి వెళ్తూ ఉంటారు