iDreamPost
android-app
ios-app

పోలీసులు ఎలా పని చేస్తారో వర్ల రామయ్యకు తెలియదా..?

  • Published Jan 17, 2022 | 6:06 AM Updated Updated Jan 17, 2022 | 6:06 AM
పోలీసులు ఎలా పని చేస్తారో వర్ల రామయ్యకు తెలియదా..?

రాష్ట్రంలో అధికార వైఎస్సార్‌ సీపీ చేతిలో కీలుబొమ్మగా మారిన పోలీసు వ్యవస్థను కాపాడడానికి ఎవరో ఒకరు రావాలని తెలుగుదేశం పార్టీ నేత వర్ల రామయ్య చేసిన వ్యాఖ్యలను వైఎస్సార్‌ సీపీ నాయకులు తప్పుపడుతున్నారు. తానూ ఒకప్పుడు పోలీసు అధికారినన్న విషయం మరచి విమర్శలు చేయడం తగదని అంటున్నారు. ఆదివారం వర్ల రామయ్య మీడియాతో మాట్లాడుతూ అధికార పార్టీకి కొంతమంది పోలీసు అధికారులు దాసోహం చేస్తున్నారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నేరస్తులకు అనుకూలంగా వ్యవహరిస్తోందని వ్యాఖ్యానించారు. ఎవరిని సంతృప్తి పర్చడానికి జొన్నలగడ్డలో టీడీపీ నేత అరవింద్‌బాబును పోలీసు అధికారి బూటు కాలితో తన్నాడని ప్రశ్నించారు. మాచర్లలో చంద్రయ్యను వైఎస్సార్‌ సీపీ నేతలు రాజకీయ కక్షతోనే హత్య చేశారని ఆరోపించారు. ఆ గ్రామంలో టీడీపీకి ఎదురులేకుండా పోతోందనే, రాజకీయ కక్షతోనే చాలా శ్రద్ధగా చంద్రయ్యను వైఎస్సార్‌ సీపీ నేతలు హత్య చేశారని వర్ల రామయ్య ఆరోపించారు.

ఇదేమైనా సినిమానా?

ఆపదలో ఉన్న హీరోయిన్‌ను కాపాడడానికి హీరో సడన్‌గా వచ్చినట్టు.. పోలీసు వ్యవస్థను కాపాడడానికి ఎవరో ఒకరు రావడానికి ఇదేమైనా సినిమానా అని వర్ల వ్యాఖ్యలను వైఎస్సార్‌ సీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలెన్నుకున్న ప్రభుత్వం మాట కాకుండా పోలీసులు ఎవరి మాట వినాలి అని ప్రశ్నిస్తున్నారు. పోలీసు మాజీ అధికారి అయిన వర్ల.. ప్రభుత్వం మాట వినకుండా స్వతంత్రంగానే నిర్ణయాలు తీసుకొని తన విధులను నిర్వహించారా? అసలు అలా సాధ్యమా? అని అడుగుతున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోలీసులు విధులు నిర్వహిస్తారు. ఇది ఎక్కడైనా జరిగేదే? ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే పోలీసులు ప్రభుత్వం మాట విని పనిచేస్తున్నట్టు, మిగిలిన అన్ని రాష్ట్రాల్లో పోలీసు వ్యవస్థ సర్వ స్వతంత్రంగా వ్యవహరిస్తున్నట్టు టీడీపీ నేతలు మాట్లాడుతున్నారు. చంద్రబాబు మొదలు గల్లీ నాయకుడి వరకూ ప్రతి టీడీపీ నేత చీటికి మాటికి పోలీసులను విమర్శిస్తున్నారు. తద్వారా పోలీసులు అసమర్థులు అని జనంలో ఒక అభిప్రాయం కలిగించాలనేది వారి వ్యూహం.

పోలీసులుపై టీడీపీ కక్ష పెంచుకుందా..

నిజానికి కులాలు, మతాలను అడ్డుపెట్టుకొని రాష్ట్రంలో అలజడులు సృష్టించడానికి కొందరు నాయకులు చేస్తున్న కుట్రలను ఎప్పటికప్పడు భగ్నం చేస్తూ పోలీసులు సమర్థంగా పనిచేస్తున్నారు. వరుసగా ఆలయాలపై దాడులు, దేవుళ్లవి, నాయకులవి విగ్రహాల ధ్వంసం, అంతర్వేదిలో రథం దగ్ధం వంటి ఘటనల సందర్భంగా శాంతి భద్రతలు అదుపు తప్పకుండా పోలీసులు పనిచేశారు. తాము ఊహించినట్టు రాష్ట్రంలో పరిస్థితులు అదుపు తప్పలేదని, అందుకు కారణమైన పోలీసులపై టీడీపీ కక్ష పెంచుకుందా? అని అధికార పార్టీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఎవరో వచ్చి కాపాడాల్సిన దుస్థితిలో పోలీసు వ్యవస్థ లేదని, తమ పార్టీ పాలనలో వారు ఎటువంటి ఒత్తిళ్లు లేకుండా పనిచేస్తున్నారని అంటున్నారు. తమ ప్రభుత్వం వచ్చాక వీక్లీ ఆఫ్‌లు, జీతాల పెంపు వంటి నిర్ణయాలు తీసుకోవడంతో టీడీపీ హయాంలో కన్నా ఆనందంగా పోలీసులు పనిచేస్తున్నారని చెబుతున్నారు. పాత కక్షల కారణంగా మాచర్లలో చంద్రయ్య హత్యకు గురై, నిందితుల అరెస్ట్‌ జరిగింది. అయినా ప్రభుత్వంపైన, పోలీసులపైన టీడీపీ నేతలు విమర్శలు చేయడం వారి రాజకీయంగా వారి దిగజారుడు తనానికి నిదర్శనమని వైఎస్సార్‌ సీపీ నేతలు దుయ్యబడుతున్నారు.