iDreamPost
iDreamPost
మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లనున్న ఉత్తరాఖండ్‌లో అధికార బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి యశ్ పాల్ ఆర్య, ఆయన కుమారుడైన ఎమ్మెల్యే సంజీవ్ ఆర్య ఆ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్‌లో చేరిపోయారు. గత కొన్నాళ్లుగా అసంతృప్తితో ఉన్న ఆయన పార్టీ వీడతారన్న ప్రచారం జరుగుతోంది. దాన్ని నిజం చేస్తూ సోమవారం తండ్రీకొడుకులు ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్‌లో చేరారు.
స్వగృహ ప్రవేశం
గతంలో 2016 వరకు యశ్‌పాల్ ఆర్య కాంగ్రెస్‌లోనే ఉండేవారు. ఉమ్మడి యూపీలోనూ, ఉత్తరాఖండ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత హస్తం పార్టీలో పలు కీలక పదవులు నిర్వహించారు.ఉమ్మడి యూపీ అసెంబ్లీలో 1989 నుంచి 2000 వరకు ఎమ్మెల్యేగా ఉన్నారు.కొత్తగా ఉత్తరాఖండ్ ఏర్పడిన తర్వాత వరుసగా నాలుగుసార్లు 2002, 2007, 2012, 2017 ఎన్నికల్లో గెలిచి భజపూర్ అసెంబ్లీ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.ఎన్డీ తివారీ సీఎంగా ఉన్నప్పుడు 2002 నుంచి 2007 వరకు ఉత్తరాఖండ్ అసెంబ్లీ స్పీకర్‌గా కూడా వ్యవహరించారు. 2007 నుంచి 2014 వరకు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు. కాంగ్రెస్ సీఎంలు విజయ్ బహుగుణ, హరీష్ రావత్ ప్రభుత్వాల్లో మంత్రిగా వ్యవహరించారు. తర్వాత బీజేపీలోకి వెళ్లిన ఆర్య మళ్లీ కాంగ్రెస్‌లో చేరడం ద్వారా స్వగృహానికి తిరిగివచ్చారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వ్యాఖ్యానించారు.
నాడు.. నేడు సీఎంలపై అసంతృప్తితోనే..
నాడు కాంగ్రెస్ నుంచి.. నేడు బీజేపీ నుంచి యశ్ పాల్ బయటకు రావడానికి సీఎంలపై అసంతృప్తే కారణం. 2016లో అప్పటి ముఖ్యమంత్రి హరీశ్ రావత్‌పై తిరుగుబాటు చేసిన వారిలో ఆర్య ఒకరు. 2017 ఎన్నికలకు ముందు బీజేపీలో చేరిన ఆయన మంత్రి కాగా.. తనయుడు సంజీవ్ ఆర్య నైనిటాల్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఐటీవల తీరథ్ సింగ్‌ను తప్పించి బీజేపీ అధిష్టానం పుష్కర్ సింగ్ దమీని సీఎంను చేసింది. దమీ సీఎం కావడం ఆర్యకు ఇష్టం లేదు. ఆయన క్యాబినెట్‌లో మంత్రిగా ఉన్నప్పటికీ అసంతృప్తి వీడలేదు. దాంతో ఆర్యను చల్లబర్చేందుకు గత నెల 25న సీఎం స్వయంగా మంత్రి ఇంటికి వెళ్లి మంతనాలు జరిపారు. అయినా ఫలితం లేకపోయింది.
ఎన్నికల ముంగిట యశ్ పాల్ పార్టీని వీడటం బీజేపీకి గట్టి దెబ్బగా భావిస్తున్నారు. రాష్ట్రంలోని కుమావ్ ప్రాంతంలో గట్టి పట్టున్న దళిత నేతగా యశ్‌పాల్ ఆర్య పేరుపొందారు. కాగా ఆర్య పార్టీలో చేరిక రాష్ట్రంలో గాలి ఎటువైపు ఉందో చెప్పకనే చెబుతోందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ వ్యాఖ్యానించారు.