బాగ్దాద్ విమానాశ్రయంలో అమెరికా జరిపిన రాకెట్ దాడిలో ఇరాన్ ఖడ్స్ ఫోర్స్ అధిపతి జనరల్ ఖాసీం సోలెమన్, ఇరాక్ మిలీషియా కమాండర్ అబూ మహదీ అల్ ముహండిస్‌తోపాటు మరో ఆరుగురు మృతిచెందారు. అమెరికా దాడితో మధ్య ఆసియా దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది.
ఈరోజు తెల్లవారుజామున ఇరాన్ ఖడ్స్ ఫోర్స్ అధిపతి జనరల్ ఖాసీం సోలెమన్ సిరియా నుంచి ఇరాక్‌కు ప్రత్యేక విమానంలో చేరుకున్నారు. బాగ్దాద్ విమానాశ్రయంలో ఆయనకు స్వాగతం పలికేందుకు ఇరాక్ మిలీషియా కమాండర్ అబూ మహదీ అల్ ముహండిస్ ప్రత్యేక కాన్వాయ్‌లో విమానాశ్రయానికి చేరుకున్నారు. ఖాసీం సోలెమన్ విమానం దిగగానే రాకెట్ ఢీకొట్టినట్లు అధికారులు వెల్లడించారు. విమానాశ్రయ కార్గో హాల్‌ను మొత్తం మూడు రాకెట్లు ఢీకొట్టినట్లు ఇరాక్ భద్రతా వర్గాలు వెల్లడించాయి. ఖాసీం సోలెమన్ చేతి వేలికున్న ఉంగరం ద్వారా మృతదేహాన్ని గుర్తించామని అధికారులు తెలిపారు. ఈ దాడిలో రెండు కార్లు పూర్తిగా దగ్ధమయ్యాయి.
అమెరికానే ఖాసీం సోలెమాన్ పై దాడికి పాల్పడిందని అమెరికా రక్షణ విభాగం పెంటగాన్ వెల్లడించింది. వైట్ హౌస్ కూడా ఆ విషయాన్నీ ధ్రువీకరించడం దాడి జరిగిన కొద్ది సేపటికే డోనాల్డ్ ట్రంప్ అమెరికా జెండాను ట్విట్టర్ లో పోస్ట్ చేయడం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది.ఇరాక్‌లో అమెరికా అధికారులపై జరిగిన దాడుల్లో సోలెమన్ కీలక పాత్ర పోషించాడని అమెరికా రక్షణ విభాగం పెంటగాన్ ఆరోపించింది. విదేశాల్లో ఉన్న అమెరికా అధికారులపై కూడా ఖాసీం సోలెమన్ దాడులకు పాల్పడే అవకాశం ఉండటంతో ఖాసీం సోలెమన్ ను హతమార్చాలని నిర్ణయించుకున్నట్లు పెంటగాన్ వెల్లడించింది. ఈ దాడిని రక్షణాత్మక చర్యగా పేర్కొంది.
మరో యుద్ధం తప్పదా.. ?
బాగ్దాద్‌లోని అమెరికా దౌత్య కార్యాలయంపై రెండు రోజుల క్రితం ఇరాన్ మద్ధతు ఉన్న నిరసనకారులు దాడికి పాల్పడ్డారు. దీనిని తీవ్రంగా పరిగణించిన ట్రంప్ ప్రత్యేక బలగాలను ఇరాక్‌కు పంపించారు. అమెరికా దౌత్య కార్యాలయంపై దాడి జరిగిన రెండురోజుల్లోనే దానికి ప్రతీకార చర్యగా అమెరికా జరిపిన తాజా దాడి వల్ల మధ్య ఆసియా దేశాల్లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. అమెరికా దాడికి ప్రతీకారంగా ఇరాన్ తో పాటు ఆ దేశానికి మద్దతిస్తున్న అనేక దేశాలు అమెరికా చర్య పట్ల తీవ్రంగా మండిపడుతున్నాయి. అమెరికాకు వ్యతిరేకంగా ఆ దేశాలు ఎలాంటి చర్యలు తీసుకుంటాయో అంచనా వేయలేని పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ మూడవ ప్రపంచ యుద్ధం అంటూ కనుక జరిగితే అది కేవలం చమురు కోసమే జరుగుతుందని ఇప్పటికే చాలామంది నిపుణులు వెల్లడించారు. అపార చమురు నిల్వలున్న ఇరాన్ పై ఆధిపత్యం కోసం అమెరికా ఎప్పటినుండో ప్రయత్నాలు చేస్తూనే ఉంది.
ఇప్పటికే చాలాసార్లు అమెరికా ఇరాన్ దేశాల మధ్య యుద్ధం తప్పదేమో అన్నంత ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.గతంలో ఇరాన్‌పై పలు ఆంక్షలు విధించిన అమెరికా, పశ్చిమాసియాలో అమెరికా సైనిక స్థావరాలు, బలగాలపై దాడికి ఇరాన్ పూర్తి సన్నద్ధతతో ఉందన్న నిఘావర్గాల సమాచారం నేపథ్యంలో విమానవాహక యుద్ధనౌక యూఎస్‌ఎస్ ఆర్లింగ్టన్‌ను పశ్చిమాసియా సముద్రజలాల్లో మోహరించింది. అప్పుడు కూడా ఇరుదేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. కానీ ఇప్పుడు ఇరాన్ క్వాడ్స్ ఫోర్స్ అధిపతి జనరల్ ఖాసీం సోలెమన్ పై అమెరికా రాకెట్ దాడి చేసి హతమార్చడంతో రెండు దేశాల మధ్య యుద్ధానికి దారి తీసే పరిస్థితులను ఏర్పడింది.
భారీగా పెరిగిన చమురు ధరలు
అమెరికా చేసిన తాజా దాడి నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలకు రెక్కలొచ్చాయి. చమురు ధరలు దాదాపు నాలుగు శాతం మేర పెరగడంతో ఆ ప్రభావం దేశీయ మార్కెట్లపై కూడా పడింది. ప్రస్తుతం చమురు కంపెనీల షేర్లు తీవ్ర నష్టాలలో కొనసాగుతు కుదేలయ్యాయి. దేశంలో పెట్రోల్ రేట్లు పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. అమెరికా జరిపిన ప్రతీకార దాడి ఫలితాలు ముందు ముందు ఎటువంటి ఫలితాలకు దారి తీస్తుందో వేచి చూడాలి.