iDreamPost
iDreamPost
తాజాగా UPSC సివిల్స్ -2021 పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. ఈ సివిల్స్ ఫలితాల్లో అమ్మాయిలు సత్తా చాటారు. తొలి నాలుగు ర్యాంకులు అమ్మాయిలే సాధించారు. ఢిల్లీకి చెందిన శృతి శర్మ UPSC సివిల్స్ -2021 పరీక్ష ఫలితాలలో నంబర్ 1 ర్యాంకు సాధించింది. ఆ తర్వాత వరుసగా అంకితా అగర్వాల్, గామిని సింగ్లా, ఐశ్వర్య వర్మ రెండు, మూడు, నాలుగు ర్యాంకులతో సత్తా చాటారు.
సివిల్స్ టాపర్ శృతి శర్మ ఢిల్లీ సెయింట్ స్టీఫెన్స్ కళాశాలలో హిస్టరీలో గ్రాడ్యుయేషన్ చేశారు. ఆ తర్వాత ప్రతిష్టాత్మక జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (JNU)లో సీటు సాధించి అక్కడే పీజీ చేశారు. సివిల్స్ పరీక్ష కోసం జామియా మిల్లియా ఇస్లామియా రెసిడెన్షియల్ కోచింగ్ అకాడమీలో కోచింగ్ తీసుకున్న శృతి హిస్టరీని తన ఆప్షనల్ సబ్జెక్టుగా ఎంచుకున్నారు. నాలుగేళ్ల పాటు సివిల్స్ కోసం చాలా కష్టపడి చదివి ఇలా టాపర్ గా నిలిచింది.
సివిల్స్-2021 ఫలితాల్లో టాపర్ గా నంబర్ 1 ర్యాంకు సాధించడంపై శృతి శర్మ మీడియాతో మాట్లాడుతూ.. సివిల్స్‌కు అర్హత సాధిస్తానన్న విశ్వాసం ఉంది కానీ టాపర్ అవుతానని అనుకోలేదు. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎంతో కష్టంతో కూడుకున్న నా ఈ సివిల్స్ ప్రయాణంలో నా తల్లిదండ్రులతో పాటు స్నేహితులు కూడా నాకు సహకరించారు. నా జర్నీలో నాకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ఈ విజయం దక్కుతుంది అని తెలిపింది.
సివిల్స్ లో రెండో ర్యాంక్ సాధించిన అంకిత అగర్వాల్ ఢిల్లీ యూనివర్సిటీ నుంచి ఎకనమిక్స్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. సివిల్స్ లో పొలిటికల్ సైన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్‌ను ఆప్షనల్‌గా ఎంచుకుంది. ఇక మూడో ర్యాంక్ సాధించిన చండీగఢ్‌కు చెందిన గామిని సింగ్లా కంప్యూటర్ సైన్స్‌లో బీటెక్ పూర్తి చేసి సోషియాలజీని ఆప్షనల్ సబ్జెక్టుగా ఎంచుకొని సివిల్స్‌లో సత్తా చాటింది. సివిల్స్ తొలి 25మంది టాపర్లలో 15మంది పురుషులు కాగా 10మంది మహిళలు ఉన్నట్టు UPSC తెలిపింది.