iDreamPost
iDreamPost
జిహ్వకో రుచి.. పుర్రెకో ఆలోచన అన్నట్లు.. ఎన్నికల్లో ఓటర్ల మనసు దోచుకునేందుకు రాజకీయ పార్టీలు ఎన్నెన్నో ఆలోచనలు చేస్తుంటాయి.. వాగ్దానాలు ఇస్తుంటాయి. మద్యం, మనీ, గిఫ్టులు వంటి తాయిలాలు సరే సరి. ఇవన్నీ ప్రధాన రాజకీయ పార్టీలు చేస్తుంటాయి. వీటికీ భిన్నంగా కొందరు స్వతంత్ర అభ్యర్ధులు వినూత్నమైన, వింతైన చర్యలతో ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. కానీ ఒక ప్రధాన రాజకీయ పార్టీ ఆ తరహాలో ఆలోచించడం, ఆచరణలో పెట్టడం ఉత్తరప్రదేశ్లో సరదా సరదాగా చర్చలకు, వ్యాఖ్యలకు తావిస్తోంది. ఎన్నికలకు మరో నాలుగు నెలల సమయం ఉన్న తరుణంలో అక్కడి ఓటర్లను ఒక పార్టీకి చెందిన అత్తరు పరిమళం కమ్ముకుంటోంది. దాని పేరే సమాజ్వాదీ అత్తరు కావడం విశేషం. దాన్ని తయారు చేసి ప్రజల మీదికి వదిలింది కూడా రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న సమాజ్వాదీ పార్టీయే. ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఈ అత్తారును విడుదల చేశారు.
విద్వేషాలను తరిమి కొడుతుందట..
ఎన్నికల్లో ప్రజలకు పంపిణీ చేసేందుకు సమాజ్వాదీ పార్టీ ఈ అత్తరును ప్రత్యేకంగా తయారు చేయించింది. 22 రకాల సహజసిద్ధ సుగంధ ద్రవ్యాలతో దీన్ని తయారు చేశారట. ఎరుపు, ఆకుపచ్చ రెండు రంగుల్లో ఉన్న ఈ అత్తరు సీసాలపై ఎస్పీ ఎన్నికల గుర్తు సైకిల్ ఉంది. దాని కవర్ పై పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ బొమ్మ ఉంది. దీన్ని ఓటర్లకు పంచి.. వారిని అత్తరు పరిమళంలో ముంచెత్తి ఓట్లు కొల్లగొట్టాలన్నది ఆ పార్టీ ఆలోచనగా కనిపిస్తోంది. అత్తరు విడుదల సందర్బంగా పార్టీ ఎమ్మెల్సీ పుష్పరాజ్ జైన్ మాట్లాడుతూ తమ పార్టీ రూపొందించిన అత్తరు సామ్యవాద పరిమళాలు వెదజల్లుతుందని వ్యాఖ్యానించారు. 2022లో ఈ పరిమళం విద్వేషాలను తరిమికొడుతుందని అన్నారు.
విభిన్న వ్యాఖ్యలు.. ట్రోల్స్
సమాజ్వాదీ అత్తరుపై సోషల్ మీడియాలో విభిన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కొందరు దీనిపై సరదా వ్యాఖ్యలు చేస్తుంటే ఇంకొందరు నెటిజన్లు అఖిలేష్ చర్యను ట్రోల్ చేస్తున్నారు. మోదీ, యోగీ సబ్ కా సాత్.. సబ్ కా వికాస్ అంటుంటే.. అఖిలేష్ సమాజ్వాదీ అత్తరు ఇస్తున్నారు.. అని కొందరు సెటైర్లు వేశారు. వచ్చే ఎన్నికల్లో తటస్థంగా ఉండాలనుకున్నాను.. కానీ సమాజ్వాదీ పార్టీవారు నన్ను బీజేపీకి ఓటు వేసేలా చేస్తున్నారని మరో నెటిజన్ పోస్ట్ పెట్టారు. ఇంకొందరు వాహ్ భాయ్.. వాహ్.. అని కామెంట్స్ పెట్టారు. ఓట్ల కోసం ఈ ఫీట్లు ఏమిటని పలువురు మీమ్స్ తో ట్రోలింగ్ చేస్తున్నారు. మరి ఈ అత్తరు పరిమళం ఎస్పీకి ఓట్లు కురిపిస్తుందో.. మళ్లీ ఓటమి రుచి చూపిస్తుందో.. ఎన్నికల్లోనే తేలుతుంది.
Also Read : Governor Satyapal Malik – కేంద్రానికి తలనొప్పిగా మారిన గవర్నర్