iDreamPost
android-app
ios-app

అనిల్ అంబానీకి షాకిచ్చిన లండన్ కోర్టు…మూడు వారాలే గడువు

  • Published May 23, 2020 | 4:59 AM Updated Updated May 23, 2020 | 4:59 AM
అనిల్ అంబానీకి షాకిచ్చిన లండన్ కోర్టు…మూడు వారాలే గడువు

రిలయన్స్ గ్రూపు ఛైర్మన్ అనీల్ అంబానీకి లండన్ కోర్టు పెద్ద షాకే ఇచ్చింది. వ్యాపారం కోసం మూడు చైనా బ్యాంకుల నుండి తీసుకున్న అప్పులను 21 రోజుల్లో తిరిగి చెల్లించాలంటూ తాజాగా పెద్ద షాకే ఇచ్చింది. అసలే దివాలా అంచుల్లో ఉన్న అనీల్ కు లండన్ కోర్టు తీర్పు మూలిగే నక్కపై తాటిపండు పడినట్లైంది. కోర్టు తీర్పు ప్రకారం అనీల్ మూడు చైనా బ్యాంకులకు 717 మిలియన్ డాలర్లు చెల్లించాలి. మన కరెన్సీలో అయితే రూ. 5446 కోట్లు.

వ్యాపారవసరాల కోసం అనీల్ 2012లో ఇండస్ట్రీయిల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా లిమిటెడ్ (ముంబాయ్ బ్రాంచ్), చైనా డెవలప్మెంట్ బ్యాంక్, ఎక్సిమ్ బ్యాంక్ ఆఫ్ చైనా నుండి 700 మిలియన్ డాలర్లు అప్పు తీసుకున్నాడు. అప్పు తీసుకునేటపుడు తనఖా పెట్టిన ఆస్తులకు తోడు అప్పు తీర్చే విషయంలో తానే గ్యారంటార్ సంతకాలు కూడా చేశాడు. అప్పు తీసుకున్న తర్వాత జరిగిన పరిణామాల్లో గ్రూపు మొత్తం నష్టాల్లో కూరుకుపోయింది. తీసుకున్న అప్పులు తీర్చలేక ఆమధ్య దివాలా పిటీషన్ కూడా వేశాడు.

అయితే అనీల్ కు అప్పులిచ్చిన మిగిలిన బ్యాంకుల విషయం ఎలాగున్నా పై మూడు బ్యాంకులు మాత్రం లండన్ కోర్టును ఆశ్రయించాయి. సరే రెండు వైపుల వాదనలు, ప్రతిపాదనలు అయిన తర్వాత తీసుకున్న అప్పును వడ్డీతో సహా తీర్చటానికి అనీల్ కు కోర్టు 21 రోజులు గడువిచ్చింది. వివిధ బ్యాంకుల నుండి తీసుకున్న అప్పులకు నెలసరి వాయిదాలే కట్టలేకుండా గ్రూపు దివాలా పిటీషన్ వేసింది. మరి కోర్టు తీర్పు ప్రకారం 21 రోజుల్లో 717 మిలియన్ డాలర్లు ఎలా చెల్లిస్తాడనే విషయం ఇపుడు ఆసక్తిగా మారింది.

తమ తీర్పు ప్రకారం అనీల్ 21 రోజుల్లోగా తీసుకున్న అప్పు మొత్తాన్ని వడ్డీతో కలిపి తీర్చకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా కోర్టు హెచ్చరించటం ఇపుడు పారిశ్రామికరంగాల్లో సంచలనంగా మారింది. క్షేత్రస్ధాయిలో ఉన్న పరిస్ధితుల ప్రకారమైతే అనీల్ 717 మిలియన్ డాలర్ల అప్పు తీర్చటం అయ్యేపని కాదు. గతంలో కూడా ఒకసారి ఇదే విధంగా అప్పు తీర్చే విషయంలో పీకల్లోతు కష్టాల్లో ముణిగిపోతే సోదరుడు, అపర కుబేరుడుగా ప్రచారంలో ఉన్న ముఖేష్ అంబానీయే సుమారు రూ. 5 వేల కోట్లు కట్టిన విషయం అందరికీ తెలిసిందే. మరి ఇపుడు ఏమి జరుగుతుందో చూడాల్సిందే.