iDreamPost
iDreamPost
దివంగత మాజీ సీఎం కరుణానిధి మనవడు, ప్రస్తుత తమిళనాడు సీఎం స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్ ఒకప్పుడు హీరోగా దాదాపు 13 సినిమాలు చేశాడు. తెలుగులో కూడా ‘ఓకే ఓకే’ అనే డబ్బింగ్ సినిమాతో పరిచయమయ్యాడు. హీరోగా ఆశించినంత సక్సెస్ అవ్వలేదు ఉదయనిధి. దీంతో తన కుటుంబ వారసత్వంగా రాజకీయాల్లోకి వెళ్ళాడు. ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచాడు ఉదయనిధి స్టాలిన్.
అయితే గతంలో ఒప్పుకున్న కొన్ని సినిమాలు ఉండటంతో వాటిని పూర్తి చేయడానికి మళ్ళీ సినిమాల వైపు వచ్చాడు. ఉదయనిధి స్టాలిన్ నటించిన తమిళ చిత్రం ‘నెంజుకు నీధి’ సినిమా మే 20న విడుదల కానుంది. బాలీవుడ్ హిట్ సినిమా ‘ఆర్టికల్ 15’కు రీమేక్‌గా ఇది తెరకెక్కింది. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో ఇకపై నేను సినిమాలు చేయనని చెప్పి అభిమానులకి షాకిచ్చాడు ఉదయనిధి.
ఉదయనిధి స్టాలిన్ ఈ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మారి సెల్వరాజ్ డైరెక్షన్‌లో ‘మామన్నన్’ అనే సినిమా చేస్తున్నాను ప్రస్తుతం. ఆ సినిమా తర్వాత ఇకపై సినిమాలు చేయను. అదే నా చివరి సినిమా. సినిమాలు, రాజకీయాలు బ్యాలెన్స్ చేయలేకపోవడం వల్లే సినిమాలు వదిలేస్తున్నాను. రాజకీయాల్లో నాన్న గారికి తోడుంటూ, ప్రజా సేవ చేయడమే నా లక్ష్యం అని తెలిపారు. మారి సెల్వరాజ్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ‘మామన్నన్’ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా ఫహాద్ ఫాజిల్ ముఖ్య పాత్రలో నటించనున్నారు.
అయితే ఉదయనిధి స్టాలిన్ ని తమిళనాడు క్యాబినెట్ లోకి తీసుకొని మంత్రి పదవి ఇవ్వాలని స్టాలిన్ భావిస్తున్నట్టు సమాచారం. అందుకే సినిమాలు వదిలేస్తున్నట్టు తమిళ రాజకీయాల్లో వినిపిస్తుంది. భవిష్యత్తులో తాత, తండ్రిని ఆదర్శంగా తీసుకొని రాజకీయాల్లో మరింత ఎదిగి సీఎం అయినా ఆశ్చర్యపోనవసరం లేదు.